“నా పాట నీ నోట పలకాల సిలకా!
నీ బుగ్గలో సిగ్గులొలకాల సిలకా!”
“కారులో షికారు కెళ్ళే
పాలబుగ్గల పసిడి చానా!
బుగ్గమీద గులాబి రంగు
ఎలా వచ్చెనో చెప్పగలవా?”
“అరె మావా ఇల్లలికి
పండుగ చేసుకుందామా!
ఓసి భామా బుగ్గలతో
బూరెలు వండుకుందామా!”
“పాల బుగ్గా…
ఇదిగో పట్టు!
ఇంకో ముద్దు…
ఇక్కడ పెట్టు!”
“బూరెలాంటి బుగ్గ చూడూ కారుమబ్బులాంటి కురులు చూడూ”
“అబ్బనీ తియ్యనీ దెబ్బ…
ఎంత కమ్మగా ఉందిరోయబ్బా!
అమ్మనీ నున్ననీ బుగ్గ…
ఎంత లేతగా ఉన్నదే మొగ్గ!”
ఇలా చెప్పుకుంటూపోతే సినిమా పాటల్లో ఈ బుగ్గసాహిత్యానికి అంతు ఉండదు.
ఎన్ని దశాబ్దాలుగా బుగ్గలతో బూరెలు వండుతున్నా తెలుగు గేయరచయితల పాటల వంటావార్పులో ఇంకా పిండి అయిపోలేదు. నూనె ఆవిరి కానేలేదు. బూరెల లోపల దట్టించాల్సిన పూర్ణం అయిపోనేలేదు.
తెలుగులో బుగ్గ అన్న మాటకు “ఉబికి వచ్చే ఊట” అని మరో అర్థం కూడా ఉంది. బహుశా హీరోయిన్ బుగ్గలమీద కవిత్వం కూడా కవులకు ఉబికి వచ్చే ఊటలాగే ఉంది.
రాజకీయంలో అంతా రాజకీయమే. ఏదైనా రాజకీయమే. ఏ పోలికైనా రాజకీయమే. హద్దులు ఉండవు. తనను గెలిపిస్తే ఒకానొక కాంగ్రెస్ ఎం పి బుగ్గల్లా రోడ్లను అందంగా తీర్చిదిద్దుతానని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కల్కాజీ నియోజకవర్గ బి జె పి అభ్యర్థి రమేష్ బిధూరి ఓటర్లకు బహిరంగంగా హెచ్చు స్వరంతో హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా ఈ వ్యాఖ్యలమీద నిరసన వ్యక్తం కావడంతో వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు నెమ్మదిగా తగ్గు స్వరంతో చెప్పారు.
సినిమా కవులకే బుగ్గకవిత్వం బుగ్గపొంగినట్లు వస్తుందనుకోవడం భ్రమ. పబ్లిక్ లైఫ్ లో ఈమధ్య ఎందరో బుగ్గోపమానాలతో సినిమా కవులను మించి రాజకీయోపన్యాసాలు చేస్తున్నారు. రాజకీయాల్లో ఇది బుగ్గలు పండే రుతువు. బుగ్గ గిల్లే వేళ. బుగ్గ పగిలే సందర్భం.
సిగ్గులేని ఈ సమాజాన్ని అగ్గితో కడగమన్నాడు సిరివెన్నెల.
బుగ్గల్లో సిగ్గులేకుండా ఓట్ల పంటలు పండించుకునే ఆధునిక సందర్భాలను చూస్తే సిరివెన్నెల దేనితో కడగమనేవాడో!
పోయాడు కాబట్టి బతికిపోయాడు.
“ఉపమా కాళిదాసస్య
భారవే రర్థగౌరవం
దండినః పదలాలిత్యం
మాఘే సంతి త్రయోగుణాః”
ఉపమ- పోలికకు కాళిదాసు;
మాటల అర్థగౌరవానికి భారవి;
పదలాలిత్యానికి దండిమహాకవి;
ఈ మూడు గుణాలకు మాఘుడు పెట్టింది పేరు అని లోకం శతాబ్దాలుగా, సహస్రాబ్దాలుగా గొప్పగా చెప్పుకుంటోంది.
ఈ బి జె పి బిధూరి ముందు కాళిదాసు ఏపాటి?
ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీ తండ్రి గురించి కూడా ఇదే బిధూరి తీవ్రమైన, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు.
వికసిత్ భారత్ ప్రజాస్వామ్య ఎన్నికల ప్రజాక్షేత్ర ప్రచార ప్రయాణంలో ఇప్పటికి సిగ్గుల బుగ్గలదాకా, తండ్రుల మార్పు దాకా వచ్చాము. ఇదిక్కడితో ఆగిపోవాలని సంస్కారులైన దేశపౌరులు సిగ్గుతో తలదించుకుని కోటి దేవుళ్ళకు మొక్కుకుంటున్నారు!
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు