ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు భారీ ఊరట తక్కింది. ఢిల్లీ మద్యం కేసులో సిబిఐ దాఖలు చేసిన కేసులో కేజ్రీ వాల్ కు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. ఇదే కేసులో ఈడీ దాఖలు చేసిన కేసులో ఇప్పటికే బెయిల్ లభించగా, నేటి తీర్పుతో ఆయనకు జైలు నుంచి విముక్తి కలిగినట్లయ్యింది. ఈ రాత్రికి ఆయన జైలు నుంచి విడుదల కానున్నారు.
ఈ కేసులో సీబీఐ అరెస్టును సవాల్ చేస్తూ బెయిల్ ఇవ్వాలని కోరుతూ కేజ్రీవాల్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సెప్టెంబర్ 5 న ఇరుపక్షాల వాదనలూ విని తీర్పును రిజర్వ్ చేసింది. నేడు తీర్పును న్యాయమూర్తులు వెలువరించారు.
ఈ కేసుకు సంబంధించి అరవింద్ కేజ్రీవాల్‌ను మార్చి 21న ఈడీ అరెస్ట్ చేసింది. లోక్ సభ ఎన్నికల్లో ప్రచారం కోసం మే 10 నుంచి జూన్ 1 వరకూ తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్ పొడిగించాలని ఆయన చేసిన అభ్యర్ధనను ట్రయల్ కోర్టు తిరస్కరించడంతో జూన్ 2 న కోర్టులో లొంగిపోయారు. జూలై 12న ఈడీ కేసులో సుప్రీం కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసినా సిబిఐ కేసులో అరెస్టు కావడంతో ఆయన విడుదల సాధ్యం కాలేదు. నేడు సిబిఐ కేసులో కూడా ఉపశమనం కలిగింది. ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న ఆయన ఈ రాత్రికి విడుదల కానున్నారు,