Delhi Declaration On Afghan Consequences :
ఆఫ్ఘనిస్తాన్ లో శాంతి, సుస్థిరత నెలకొనాలని, అన్ని వర్గాల ప్రజలకు ప్రాతినిధ్యం కల్పించాలని ఢిల్లీలో భారత్ అధ్యక్షతన జరిగిన జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో తీర్మానించారు. ఆఫ్ఘన్లో పరిణామాలపై ఈ రోజు రష్యా, ఇరాన్, తజికిస్తాన్, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్, తుర్కమేనిస్తాన్ దేశాల జాతీయ భద్రతా సలహాదారులు, కార్యదర్శుల స్థాయి సమావేశం ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశానికి భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అధ్యక్షత వహించారు. భారత్ తో పాటు పాల్గొన్న ఏడు దేశాలు ఆఫ్ఘన్ లో పరిస్థితులు, ప్రాంతీయ భద్రతపై ఢిల్లీ డిక్లరేషన్ ప్రకటించాయి. ఆఫ్ఘన్లో పౌరుల భద్రతపై సమావేశంలో వివిధ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ముఖ్యంగా మహిళల హక్కులు, ఉజ్బెక్, షియా , సిక్కు తదితర మైనారిటీలకు రక్షణ కల్పించాలని సమావేశం కోరింది. సమావేశం అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడిని నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు.
కాందహార్,కాబుల్,కుందుజ్ తదితర ప్రాంతాల్లో మైనారిటీల మీద జరుగుతున్న దాడులు అక్కడి ప్రభుత్వం కట్టడి చేయాలని, అన్ని వర్గాల ప్రజలకు సమ ప్రాధాన్యత కల్పించి, ప్రజాస్వామ్య పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని సమావేశంలో కోరారు. ఆఫ్ఘన్ భూభాగాన్ని ఇతర దేశాలపై దాడులకు, కుట్రలకు ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగించకుండా ఉండాలి. ఆఫ్ఘన్ ప్రజలకు నిత్యావసరాలు, వైద్య సహాయం కోసం అంతర్జాతీయ సంస్థలకు ప్రభుత్వం సహకారం అందించాలి. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో జరుగుతున్న సేవ కార్యక్రమాలు, వివిధ స్వచ్చంద సంస్థలు చేపట్టిన కార్యక్రమాలకు ఆటంకం కలగకుండా ప్రభుత్వం తోడ్పడాలి. ఆఫ్ఘన్ సరిహద్దుల వెంట చొరబాట్లకు అవకాశం ఇవ్వకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలి.
Also Read : ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ల వశం