బిజెపి ఎంపి, మాజీ క్రికెట్ ఆటగాడు గౌతం గంభీర్ పై విచారణ చేపట్టాల్సిందిగా ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. కోవిడ్ నివారణకు ఉపయోగించే ఫ్యాబి ఫ్లూ మందులు దేశమంతటా కొరత ఉన్నప్పటికీ గంభీర్ పెద్దమొత్తంలో ఆ మందులు ఎలా కొనగాలిగారో విచారణ జరిపి వారంలోగా నివేదిక ఇవ్వాల్సిందిగా ఢిల్లీ డ్రగ్ కంట్రోలర్ కు ఢిల్లీ కోర్టు సూచించింది.
మందులు పెద్ద మొత్తంలో కొని ఉంచుకోవడం వెనుక గంభీర్ కు దురుద్దేశాలు లేకపోయినప్పటికీ, నైతికంగా బాధ్యతా రాహిత్యమేనని స్పష్టం చేసింది. మందులు అలా ఉంచుకోవడం అంటే ఆపదలో ఉన్న రోగికి అది అందుబాటులో లేకుండా చేయడమే కదా అంటూ ప్రశ్నించింది.
ఈ కేసులో ఇంప్లీడ్ అయ్యేందుకు గంభీర్ కు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. తము కేవలం విచారణ చేయమనే ఆదేశించామని, చర్యలు తీసుకూమని చెప్పలేదని కోర్టు వ్యాఖ్యానించింది.
మరోవైపు, ఆక్సిజన్ నిల్వ ఉంచుకున్నరనే ఆరోపణల్లో ఢిల్లీ అధికార పార్టీ ఆప్ ఎమ్మెల్యేలు ప్రీతి తోమర్, ప్రవీణ్ కుమార్ ల పై కూడా విచారణ చేసి నివేదిక ఇవ్వమని డ్రగ్ కంట్రోలర్ ని కోర్టు ఆదేశించింది.