పోలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని రాష్ట్ర మాజీ మంత్రి దేవినేని ఉమా విమర్శించారు. టిడిపి హయాంలో పోలవరం పునాదులు కూడా లేవలేదని సిఎం జగన్ గతంలో ఆరోపించారని, ఇప్పుడు 27 మీటర్లు గోదావరి నీరు ఎలా నిలబడ్డాయో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రేపు సిఎం పోలవరం పర్యటన నేపధ్యంలో ఈ విషయమై దేవినేని నేడు మీడియా సమావేశం నిర్వహించారు.
దేవినేని మాట్లాడిన ముఖ్యంశాలు:
- పాదయాత్ర సమయంలో ప్రాజెక్టుపై ఎన్నో మాటలు చెప్పారు
- నిర్వాసితుల సమస్యలు పరిష్కరించిన తరువాతే ప్రాజెక్టు కట్టాలన్నారు
- ప్రస్తుతం వస్తున్న వరదలకు నిర్వాసితులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు
- 20 వేల కుటుంబాలు తరలించాలని అధికారులు చెబుతున్నారు
- ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కాలనీల్లో కనీస సదుపాయాలు లేవు
- మీ ప్రభుత్వం వచ్చి 26 నెలలైనా పునరావాస కాలనీలు ఎందుకు పూర్తి చేయలేకపోయారు?
- ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై 18 వేల కోట్లు పోలవరంపై ఖర్చు పెట్టాము
- కాంగ్రెస్ పార్టీ హయాంలో ముగ్గురు ముఖ్యమంత్రులు 5,135 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టారు
- చంద్రబాబు హయాంలో ఐదేళ్ళ మా హయాంలో రూ. 11,537 కోట్లు ఖర్చు చేశాం
- మా హయాంలో పోలవరం పనులు దాదాపు 70 శాతం వరకూ పూర్తి చేశాం
- రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన నిధులను కేంద్రం నాబార్డు ద్వారా రీఎంబర్స్ చేసే విధంగా ఒప్పించాం
- ఆర్టీఐ ద్వారా సమాచారం తెప్పిస్తే రెండేళ్లలో పోలవరంపై రూ. 845 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు
- కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన గెజిట్ పై మంత్రులు, సలహాదారులు, అధికారులు అవహాహన లేకుండా మాట్లాడుతున్నారు
- ఈ గెజిట్ వల్ల గతంలో మనం కట్టుకున్న ఎన్నో ప్రాజెక్టుల భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారే ప్రమాదం ఉంది
- మా ప్రభుత్వ హయాంలో ఉరుకులు పెట్టించిన ప్రాజెక్టు పనులు నేడు ఆపేశారు
- రాష్ట్ర రైతాంగానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి
- రేపు జగన్ పోలవరం నిర్వాసితుల వద్దకు కూడా వెళ్ళాలి. కేవలం ఫోటో సెషన్ కోసం వెళ్లొద్దు