తెలుగు తెరపై ఒక వెలుగు వెలిగిన అలనాటి నటులలో చాలామంది నాటకరంగం నుంచి వచ్చినవారే. తెలుగు భాషపై పట్టున్నవారే .. పద్యం పాడగల సామర్థ్యం ఉన్నవారే. అలా తమ ప్రతిభా పాటవాలతో తమదైన ప్రత్యేకతను చాటుకుని, తమదైన ముద్రవేసిన కేరక్టర్ ఆర్టిస్టులలో ధూళిపాళ ఒకరు. ఆయన పూర్తి పేరు ధూళిపాళ సీతారామశాస్త్రి. గుంటూరు జిల్లా ‘దాచేపల్లి’లో ఆయన జన్మించారు.
యుక్తవయసులోకి అడుగుపెడుతూ ఉండగానే ఆయనకి నటన పట్ల .. నాటకాల పట్ల ఆసక్తి పెరుగుతూ పోయింది. అప్పట్లో ధూళిపాళ నాటకాలలో స్త్రీ పాత్రలను పోషించేవారు. ఆ పాత్రలను ఆయన అద్భుతంగా పండిస్తూ ఉండటంతో మంచి పేరు వచ్చింది. దాంతో ఆయన స్త్రీ పాత్రలు వరుసగా చేస్తూ వెళ్లడం మొదలుపెట్టారు. ఆ తరువాత తన వాయిస్ లో మార్పు రావడం గమనించిన ఆయన, ఇకపై తాను స్త్రీ పాత్రలు కాకుండా పురుష పాత్రలు మాత్రమే పోషించాలని నిర్ణయించుకున్నారట.
అలా ఆయన నాటకాలలో పురుష పాత్రలను పోషించడం మొదలుపెట్టారు. దుర్యోధనుడి పాత్రలను ఆయన పోషించే విధానం అందరినీ ఆశ్చర్యచకితులను చేయడం మొదలుపెట్టింది. దుర్యోధనుడు అంటే ఆ పాత్రను ధూళిపాళ చేయవలసిందే అనే పేరు వచ్చేసింది. అలా ఆయన నాటకాలు ఆడుతూ ఉండగా, నటి జి.వరలక్ష్మి చూసి ఆయనను దర్శకుడు బీఏ సుబ్బారావుకు పరిచయం చేశారు. ఆ సమయంలో ఆయన ఎన్టీఆర్ తో ‘భీష్మ’ సినిమాను రూపొందించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.
దుర్యోధనుడి పాత్రను ధూళిపాళ బాగా చేస్తారని తెలిసిన బీఏ సుబ్బారావు, ఆయనకి ‘భీష్మ’ సినిమాలో దుర్యోధనుడి పాత్రనే ఇచ్చారు. దాంతో ఆ పాత్రలో ధూళిపాళ తన విశ్వరూపం చూపించారు. ఆయన నటనలోని ప్రత్యేకతను గుర్తించిన ఎన్టీ రామారావు అభినందించడమే కాకుండా, తన సొంత బ్యానర్ పై నిర్మిస్తున్న ‘శ్రీకృష్ణ పాండవీయం’లో ‘శకుని’ పాత్రను ఇచ్చారట. ఆ పాత్ర ధూళిపాళ కెరియర్ ను ఒక్కసారిగా మలుపు తిప్పేసింది. నడకలోను .. డైలాగ్ డెలివరీలోను .. హావభావ విన్యాసంలోను ఆ పాత్రలో ఆయన చూపిన వైవిధ్యానికి ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు.
అంతకుముందు శకుని పాత్రకు సిఎస్ఆర్ ఆంజనేయులు .. లింగమూర్తి పేర్లు చెప్పుకునేవారు. ఆ ఇద్దరినీ కూడా అసమానమైన తన నటనతో ధూళిపాళ మరిపించగలిగారు. శకుని పాత్రను ఆయన తప్ప .. ఆయనకి మించి ఎవరూ చేయలేరనే ఒక ముద్ర పడిపోయింది. అందువలన ఎన్టీఆర్ ‘దాన వీర శూర కర్ణ’లోను ఆయనతోనే శకుని పాత్రను వేయించారు. ఆ పాత్రలో ‘అని గట్టిగా అనరాదు .. వేరొకరు వినరాదు’ అంటూ ఆయన చెప్పిన డైలాగ్ ను ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేదు.
అలా ఆయన గయుడు .. యముడు .. ఇంద్రుడు .. సత్రాజిత్తు .. విభీషణుడు వంటి ఎన్నో పాత్రలను తన విలక్షణమైన నటనతో ప్రకాశింపజేశారు. ఒకదానికి ఒకటి సంబంధం లేని విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ, ఔరా అనిపించే స్థాయిలో ఆ పాత్రల్లో ఆయన ఒదిగిపోయేవారు. సాంఘిక చిత్రాలలోను ఆయన కుటిలత్వంతో కూడిన పాత్రలతో పాటు, మనసును కదిలించే పాత్రలు కూడా చేశారు. ఎస్వీఆర్ నిర్మించి .. దర్శకత్వం వహించిన ‘బాంధవ్యాలు’ సినిమాలో ఆయన తమ్ముడి పాత్రను అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
ఇలా సాంఘిక .. జానపద .. పౌరాణిక చిత్రాలలో ఆయన ఎన్నో విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను పోషించి మెప్పించారు. ఆయన ఇండస్ట్రీలోకి ప్రవేశించేనాటికే బలమైన కేరక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు. అయినా వాళ్ల పోటీని తట్టుకుని ధూళిపాళ నిలబడానికి గల కారణం ఆయన వాచకం .. కళ్లతోనే మనసులోని మర్మాన్ని ఆవిష్కరించే విధానం అని చెప్పొచ్చు. నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్రలలో శభాష్ అనిపించుకున్న ఆయన, ‘ఉండమ్మా బొట్టుపెడతా’ సినిమాలో హరిదాసుగా మెప్పించడం మరో విశేషం. ప్రతి సంక్రాంతికి వినిపించే ‘రావమ్మా మహాలక్ష్మి రావమ్మా’ అనే హరిదాసు పాటను చిత్రీకరించింది ఆయన పైనే.
ఎన్టీఆర్ పోషించిన దుర్యోధనుడి పాత్ర .. ఎస్వీఆర్ పోషించిన హిరణ్యకశిపుడి పాత్ర ఏకపాత్రాభినయంగా ఆయా వేదికలపై ఎక్కువగా ప్రదర్శించబడుతూ ఉంటాయి. ఆ తరువాత స్థానంలో మాత్రం ధూళిపాళ పోషించిన శకుని పాత్ర ఉంటుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇలా దశాబ్దాల పాటు నటుడిగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ వచ్చిన ఆయన, ఆ తరువాత పూర్తిగా ఆధ్యాత్మిక ప్రపంచం దిశగా అడుగులు వేశారు. ఎక్కువగా దైవ చింతనలో కాలాన్ని గడుపుతూ, సన్యాస దీక్షను స్వీకరించి ఆశ్రమనామంతో కొనసాగారు. ఈ రోజున (సెప్టెంబర్ 24) ఆయన జయంతి .. ఈ సందర్భంగా మనసారా ఓసారి ఆయనను స్మరించుకుందాం.
(ధూళిపాళ జయంతి ప్రత్యేకం)
— పెద్దింటి గోపీకృష్ణ

ఎం.ఏ తెలుగు, బి ఈడి . ప్రింట్, టీ వి, డిజిటల్ మీడియాల్లో పాతికేళ్ల అనుభవం. భక్తి రచనల్లో అందెవేసిన చేయి. సినిమా విశ్లేషణల్లో సుదీర్ఘ అనుభవం.