శివకార్తికేయన్ హీరోగా అనుదీప్ దర్శకత్వంలో ‘ప్రిన్స్‘ సినిమా రూపొందింది. మూడు బడా బ్యానర్లు కలిసి ఈ సినిమాను నిర్మించాయి. తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమాను ఈ నెల 21వ తేదీన విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్నరాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదులో జరిగింది. విజయ్ దేవరకొండ .. హరీశ్ శంకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రానాను కూడా ఆహ్వానించినప్పటికీ, ఫ్లైట్ లేట్ కారణంగా తాను రాలేకపోయానంటూ ఆయన వీడియో మెసేజ్ పంపించాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా చేసిన ఉక్రెయిన్ బ్యూటీ ‘మరియా’ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

శివకార్తికేయన్ చాలా కష్టపడి పైకొచ్చాడనీ .. ఆయనకి సినిమా అంటే ఎంత ప్యాషన్ అనేది ఒకసారి ఆయన స్పీచ్ వినడం వలన తనకి అర్థమైందని విజయ్ దేవరకొండ అన్నాడు. ఆ స్టేజ్ పై ఆయన ఏడవడం తనని కదిలించి వేసిందనీ, అప్పటి నుంచి ఒక బ్రదర్ గా ఆయనకి అండగా నిలబడటం కోసం వెయిట్ చేస్తూ వచ్చానని చెప్పాడు. అంచలంచెలుగా ఎదిగిన ఆయన జర్నీ తనకి ఇష్టమని చెప్పుకొచ్చాడు. ఇక శివ కార్తికేయన్ మాట్లాడుతూ .. తన జర్నీ రైలు ప్రయాణం మాదిరిగా జరుగుతూ వచ్చిందనీ, విజయ్ దేవరకొండ మాత్రం రాకెట్ లా దూసుకెళ్లాడని అన్నాడు. ఆయన బాడీ లాంగ్వేజ్ తనకి బాగా నచ్చుతుందని చెప్పాడు.

విజయ్ దేవరకొండతో కలిసి నటించాలని ఉందనీ, అందుకు ఆయన అంగీకారం కూడా కావాలని శివకార్తికేయన్ అన్నాడు. స్టేజ్ పైనే ఉన్న విజయ్ దేవరకొండ తాను రెడీ అంటూ థమ్సప్ చూపించాడు. ఇక ఈ మల్టీ స్టారర్ బాధ్యతను హరీశ్ శంకర్ తీసుకోవాలని శివకార్తికేయన్ అనడంతో,  తాను కూడా సిద్ధమేనంటూ హరీశ్ శంకర్ సిగ్నల్స్ ఇచ్చాడు. అలా మొత్తం మీద ఈ స్టేజ్ పై ఒక మల్టీ స్టారర్ ఆలోచనకి అంకురార్పణ అయితే జరిగింది. ఇక ఈ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కనుందనేది చూడాలి.ప్రస్తుతం విజయ్ దేవరకొండ మాత్రం ‘ఖుషి’ సినిమాను పూర్తిచేసే పనిలో ఉన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *