Saturday, November 23, 2024
HomeTrending NewsDiwali: ఆ పల్లెల్లో నిజమైన దీపావళి

Diwali: ఆ పల్లెల్లో నిజమైన దీపావళి

దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయాల్లో భక్తుల సందడి, చిన్న పెద్దలు టపాసులతో సంబురాలు చేసుకున్నారు. ఇందుకు విరుద్దంగా తమిళనాడులోని ఏడు పల్లెలు టపాసుల మోత లేని దీపావళి వేడుకలు నిర్వహించి ఆదర్శంగా నిలిచాయి. ఈరోడ్ నగరానికి కేవలం పది కిలోమీటర్ల దూరంలోని ఈ పల్లెల ప్రజలు ప్రకృతి ప్రేమికులుగా తమ బాధ్యత గుర్తించి నడుచుకుంటున్నారు.

ఈరోడ్‌ జిల్లాలోని సెల్లప్పంపాళయం, వడముగం వెల్లోడే‌, సెమ్మందంపాళయం, కరుక్కనకట్టు వాలాసు, పుంగంపాడి తదితర ఏడు గ్రామాలు వేదముగం వెల్లోడ్‌ పక్షుల సంరక్షణ కేంద్రానికి సమీపంలో ఉంటాయి. అక్కడ అక్టోబర్‌ నుంచి జనవరి మధ్య దేశ విదేశాల నుంచి పక్షులు వలస వచ్చి గుడ్లు పెట్టి పొదుగుతాయి. సాధారణంగా దీపావళి పండుగ కూడా అక్టోబర్‌-నవంబర్‌ నెలల మధ్య వస్తుండటంతో రెండు దశాబ్దాలుగా ఈ పల్లెలు పక్షులకు అనువైన వాతావరణం కల్పిస్తున్నాయి.

వాటిని భయపెట్టకుండా ఉండేందుకు గ్రామస్థులు ఈ నిర్ణయం తీసుకున్నారు. పక్షల కేంద్రానికి చుట్టుపక్కల నివసించే సుమారు 900కుపైగా కుటుంబాలు బాణసంచా పేల్చకుండానే దీపావళి ఘనంగా జరుపుకుంటారు. పండుగ సందర్భంగా తమ పిల్లలకి కొత్త బట్టలు, మిటాయిలు కొనివ్వడంతోపాటు, శబ్దంరాని టపాసులు కాల్చేందుకు మాత్రమే అనుమతిస్తారు. దాదాపు 22 ఏళ్లుగా ఇదే సాంప్రదాయాన్ని పాటిస్తుండటం విశేషం.

మరోవైపు ఢిల్లీలో కాలుష్యం తారాస్థాయికి వెళ్లిపోయింది. దీపావ‌ళి ప‌టాకుల‌తో గాలి కాలుష్య కారకాలతో నిండిపోయింది. ఊపిరితిత్తుల‌తో పాటు ప్ర‌మాద‌క‌ర ఆరోగ్య స‌మ‌స్య‌ల‌కు దారి తీసే కాలుష్య కార‌కాలు పెరిగిపోయాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో విష‌పూరిత ప‌దార్ధాలు గాలిలో 140 శాతం పెరిగిన‌ట్లు కేంద్ర కాలుష్య నియంత్ర‌ణ బోర్డు పేర్కొన్న‌ది.

గాలిలో ఉండే పార్టిక‌ల్స్‌లో పీఎం 2.5 స్థాయి చాలా ప్ర‌మాద‌క‌ర‌మైంది. ఆదివారం ఉద‌యం 7 గంట‌ల‌కు 83.5గా ఉన్న పార్టిక‌ల్స్ సంఖ్య‌.. ఇవాళ ఉద‌యం 7 గంట‌ల‌కు 200.8గా రికార్డు అయిన‌ట్లు కాలుష్య బోర్డు తెలిపింది. దీపావళి కారణంగా కోల్‌కతా, ముంబై నగరాలు కూడా తీవ్ర వాయుకాలుష్యంలో చిక్కుకున్నాయి.
Yellow Alert To Delhi
ఇటీవల టపాకాయలు, లైట్లు, చివరకు దివ్వెలు కూడా చైనా నుంచి దిగుమతి కావటం దురదృష్టకరం. కొనేవారు లేకపోతే అమ్మవారు ఉండరు. డిమాండ్ సప్లయి సూత్రం అనుగుణంగా జరుగుతోంది. నాణ్యతలేని చైనా వస్తువులతో వాతావరణ కాలుష్యం వేగంగా జరుగుతోంది. సంప్రదాయాలు పాటించాల్సిందే…అయితే పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని దేశమంతా తమిళ పల్లెల తరహాలో వేడుకలు చేసుకుంటే భవిష్యత్ తరాలకు మేలు చేసిన వారమవుతాం.
-దేశవేని భాస్కర్
RELATED ARTICLES

Most Popular

న్యూస్