పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వాలని దేశంలో వేల పోరాటాలు జరిగాయని, కానీ పేదలకు పట్టాలు ఇవ్వడానికి  ప్రభుత్వమే సుదీర్ఘ న్యాయపోరాటం చేసి సుప్రీంకోర్టుకు వెళ్లిమరీ 50వేల మందికి ఇళ్లస్థలాలు ఇవ్వడం ఒక చారిత్రక ఘటన అని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభివర్ణించారు. ఇళ్లస్థలాలు ఇవ్వకుండా మారీచులు, రాక్షసులు అడ్డుపడ్డారని… ఇలాంటివి చూస్తే ఆశ్చర్యం కలుగుతుందని వ్యాఖ్యానించారు. తుళ్ళూరు మండలం వెంకటపాలెంలో జరిగిన కార్యక్రమంలో 1400 ఎకరాల్లో.. 25 లే అవుట్ల ద్వారా 50 వేల మందికి ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జగన్ అంతకుముందు జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ ఇళ్ళ పట్టాల పంపిణీతో ఇక నుంచి ఇది మనందరి అమరావతి, సామాజిక అమరావతి అవుతుందన్నారు.  వారంరోజులపాటు లబ్ధిదారులకు వారి స్థలాలు చూపించి ఫొటో తీసి, జియో ట్యాగింగ్‌ చేయడంతో పట్టాలు పంపిణీ పూర్తవుతుందని, జులై 8న వైయస్సార్‌ జయంతి రోజున ఈ స్థలాల్లో ఇల్లు కట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుడతామని హామీ ఇచ్చారు.

ఈ పట్టాలతో పటు సీఆర్డీయే ప్రాంతంలో 5,024 మందికి పూర్తైన టిడ్కో ఇళ్లను కూడా అందిస్తున్నామని జగన్ తెలిపారు.  టిడ్కో ఇళ్ళపై చంద్రబాబు ఎప్పుడూ అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. 300 చదరపు అడుగుల ఫ్లాటు కట్టడానికి దాదాపుగా రూ.5.75లక్షలు ఖర్చవుతుందని, మౌలిక సదుపాయాలకోసం రూ.1 లక్ష అవుతుందని… వీటిలో  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో లక్షన్నర ఇస్తే, మిగిలిన డబ్బును బ్యాంకులనుంచి అప్పుగా తీసుకుని, 20 ఏళ్లపాటు ఆ లబ్ధిదారుడు కట్టుకుంటూ పోవాల్సి  ఉంటుందని వివరించారు.  మొత్తంగా రూ.7.2లక్షలు ప్రతి పేదవాడూ చెల్లించాల్సి ఉంటుందన్నారు. వాస్తవ పరిస్థితి ఇదయితే తాము ఇళ్ళు కట్టినా అవి పేదలకు ఇవ్వలేదంటూ బాబు, ఎల్లోమీడియా వక్రభాష్యాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు.

చంద్రబాబు తన పాలనలో ఒక్క ఇంటి పట్టాకూడా ఇవ్వలేదని,  ఎన్నికల సమయంలో ప్రజలకు హామీ ఇచ్చి ఆ తర్వాత మోసం చేసే చంద్రబాబును నమ్మవద్దని, ‘నరకాసురుడినైనా నమ్మొచ్చు కాని, నారా చంద్రబాబునాయుడ్ని మాత్రం నమ్మకూడదు’ అంటూ ప్రజలకు పిలుపు ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *