Dr Govindaraju Chakradhar ….: కొన్ని అనుభవాలు అవి జరిగినప్పుడు చెప్పడం కన్నా అవి విశేషంగా చెప్పగలిగిన సమయం, సందర్భం వచ్చినప్పుడు చెబితేనే వాటికి ఆ ప్రాధాన్యత, ప్రత్యేకత ఏర్పడుతుంది. ఇప్పుడు నేను చెప్పబోయేది అలాంటి విషయం, విశేషాల గురించే. మన ప్రధాని మోదీ ఒకప్పుడు ఛాయ్ వాలా, సూపర్ స్టార్ రజనీకాంత్ బస్సు కండక్టర్, మహరాష్ట్ర సి.ఎం.ఏక్ నాథ్ షిండే ఆటో వాలా అని ఇప్పుడు చెప్పుకోవడం విశేషంగా వుంటుంది. నిజానికి అప్పట్లో వాళ్లు ఆ వృత్తుల్లో వుండగా చెప్పుకోవడం న్యూనతగా వుంటుంది. ఆ స్థాయి నుంచి వాళ్లు అంచలంచెలుగా ఎదిగి ఉన్నత స్థానాల్లో కుదురుకున్నాక అప్పటి విషయాలు చెబితే ఇప్పుడవి ఆసక్తిగా వుంటాయి. నేడు సీనియర్ జర్నలిస్ట్ గా అందరికీ తెలిసిన గోవిందరాజు చక్రధర్ గారు ఒకప్పుడు ఆటోవాలా అని చెప్పడం కూడా ఆ కోవలోకే వస్తుంది.
కుక్క మనిషిని కరిస్తే వార్త కాదు, మనిషి కుక్కని కరిస్తే వార్త అవుతుందనేది జర్నలిజం విద్యార్థులకు చెప్పే పాఠ్యాంశాల్లో ఒకటి. జర్నలిజం కళాశాల ప్రిన్సిపాల్ గా, రచయితగా అలాంటి మెళకువలెన్నో విద్యార్థులకు నేర్పించిన చక్రధర్ గారు తన జీవిత విశేషాలను చెప్పడంలోనూ ఆ నేర్పరితనాన్ని చూపించారు. ఆ అనుభవాల్ని అక్షరబద్ధం చేస్తూ ఆ ‘ఇజ్జత్ కా కహానీ’ని ‘చెబితే శానావుంది ‘ ‘వన్ టు త్రీ గో’ అంటూ ‘గ్రాడ్యుయేట్ ఆటో సర్వీస్’ పుస్తకంగా మన ముందుంచారు. పాఠకుల కళ్లను అక్షరాల వెంట పరుగులు పెట్టించారు.
ప్రతి కథకు ముందు అందులోని కంటెంట్ ని చిన్న ఇన్ట్రో గా ఇస్తూ చదువరులలో ఆసక్తి రేకెత్తిచ్చారు. రాని ఉద్యోగాల కోసం వెంపర్లాడేకంటే స్వతంత్రంగా ఓ వృత్తిని ఎంచుకోవాలనే తపనే తన ఆటోవాలా అంకానికి అవతారిక అయ్యింది. వర్క్ ఈజ్ వర్షిప్, డిగ్నిటీ ఆఫ్ లేబర్ వంటి సూక్తులు ఎన్నిచెప్పినా అవన్నీ శుష్క నినాదాలే కాయకష్టమనేది చదువులు రాని వారికేననే భావన నేటికీ వుందని ‘ఇజ్జత్ కీ కహాని’ ముందు పలుకుల్లో చెప్పారు. గ్రాడ్యుయేట్ అయివుండీ ఆటోలు నడపడంపై అయినవారి నుండి కొంత అభ్యంతరం వ్యక్తమైనా దానినే ఓ అదనపు ఆకర్షణగా ప్రమోట్ చేసుకోవడం ఆయనలోని సమయస్పూర్తికి నిదర్శనం. అలాగే ఆయన సామాజిక వర్గమూ ఈ వృత్తికి ఆమోదయోగ్యం కాదనే అనుభవాన్నీ చవిచూశారు. తొలినాళ్లలో ఇవి కొంత ఇబ్బందికరంగా అనిపించినా తర్వాతి రోజుల్లో అంతకు మించిన ఆటుపోట్లెన్నో ఆయన ఎదుర్కొన్నారు. ‘రౌడీలు, వ్యభిచారులు’ మోసగాళ్లు, కష్టాల కొలిమిలో కాగేవారు, మానవత్వం పరిమళించే వాళ్లు ఇలా ఎందరెందరో తనకు తారసపడినట్లు ‘బతుకు పుస్తకం’ మాటల్లో రచయిత పేర్కొన్నారు.
తాను ఆటోలు కొనుక్కోవడానికి రుణం ఇచ్చిన బ్యాంకు అవతరణ నేపథ్యాన్ని కీర్తిస్తూ రాసిన కథలో మామూలు కష్టమర్లకు తెలియని ఆసక్తికరమైన విషయాలున్నాయి. తన రెండు ఆటోలకూ సంప్రదాయబద్ధంగా ‘లక్ష్మీ’, ‘పార్వతి’ అని పేర్లు పెట్టుకున్నా బ్యాంకు షరతుల మేరకు సింబాలిక్ గా కుక్క బొమ్మలు వేయడం, అప్పటి నుండి అందరూ వాటిని కుక్కపిల్ల ఆటోలని చెప్పుకోవడడం నవ్వు తెప్పించే అంశమైంది.
అర్ధరాత్రి వంటరిగా వచ్చిన యువతిని కొందరు ఆటో వాలాలు కాముక దృష్టితో చుట్టుముట్టగా సకాలంలో స్పందించి తన తోటి డ్రైవర్ సహాయంతో ఆమెను సురక్షితంగా గమ్యానికి చేర్చడం, ఓ ప్రేమ జంటనూ సరైన మార్గంలో మళ్లించడం, ప్రాణాపాయ స్థితిలో వున్న పిల్లాడిని ఆత్రుతగా ఆసుపత్రుల చుట్టూ తిప్పి ఊపిరి కొడిగట్టే లోపే స్వస్థలానికి చేర్చడం, మరో సందర్భంలో అంబులెన్స్ లు నిర్దయగా తిరస్కరించగా బాధితుల అభ్యర్ధన మేరకు తన ఆటోలో మృతదేహాన్ని వాళ్ల ఇంటికి తరలించడం వంటి సంఘటనలు చక్రధర్ గారిలోని మానవీయ కోణాన్ని మనకు పట్టిస్తాయి.
నేనప్పుడు అలా ప్రవర్తించకుండా వుండా ల్సింది, అప్పుడు ఆ సహాయం చేసి వుంటే బాగుండేది అని మరొక విషయంలో పశ్చాత్తాపపడిన రెండు ఉదంతాలను ‘మానని గాయం’, ‘కంచికి చేరని కథ’ ల్లో మనం చూడవచ్చు. నిజానికి ఇలాంటి పశ్చాత్తాప సందర్భాలు ఎప్పుడో ఒకసారి మనకి కూడా కలగడం సహజం. మనసున్న మనుషుల్లోనే ఈ రకమైన మార్పును చూడగలం.
అలనాడు గోపికల కోకలెత్తుకెళ్లి కేళీవిలాసాన్ని చూపిన ఆ కృష్ణయ్యే మరో ఘటనలో చీరలందించి ద్రౌపది మాన సంరక్షణ చేసిన పురాణ కథనం మనందరికీ తెలిసిందే. వ్యక్తి ఒకరే విభిన్నంగా ప్రవర్తించిన సందర్భాలు మాత్రం వేరు వేరు. అప్పుడు ఆ చక్రధారి లాగానే ఇప్పుడు ఈ చక్రధర్ కూడా భిన్న సందర్భాల్లో విభిన్నంగా వ్యవహరించిన తీరును ఓ రెండు కథల్లో మనం చదువుతాము. ఓ అర్ధరాత్రి తన ఇంట బస చేసే అవకాశాన్నిచ్చిన యువతి పట్ల ‘మోహపు చూపు’ చూసిన చక్రధర్ ఇంకో సందర్భంలో కాముకుల బారి నుండి మరో యువతిని రక్షించడం ఓ వైచిత్రి.
‘చూడు.. ఒకవైపే చూడు…మరో వైపు చూడకు…తట్టుకోలేవు’ బాలయ్య సినిమాలోని ఈ డైలాగ్ లో చెప్పినట్లు గానే ఓ రచయిత విషయంలో తనకు ఎదురైన ఓ అనుభవం అప్పటికే రచయితగా తొలి అడుగులు వేస్తున్న ఈయనను విస్మయ పరచింది. దానిని ‘ఇది ఎవరూ రాయని అమరావతి కథ’ పేరుతో పాఠకులతో పంచుకున్నారు. ఆ టైటిల్ పెట్టడంలోనే ఆ రచయిత ఎవరో మనకు స్ఫురించేలా చేశారు.
తన హాల్ టికెట్ నెంబర్, ఆటో నెంబర్ యాదృచ్ఛికంగా ఒకటే కావడం వెనుక మర్మమేమిటో తెలుసుకోవాలనే కుతూహలం రచయితతో బాటు మనకూ కలిగించే కథ ‘సాంబయ్య మాస్టారు’.
పరిస్థితులు సజావుగా సాగినంతకాలమే మర్యాదలు, మన్ననలు ఏ కొద్దిపాటి తేడాలొచ్చినా వాదోపవాదాలే కాదు, బాహాబాహీలు తప్పవని తోటి ఆటోవాలాలతో ఎదురైన తన చేదు అనుభవాల్ని ‘యారో యారో మారో మారో’ తదితర కథల్లో కళ్లకు కట్టినట్లు చూపించారు. కేవలం తన అనుభవాల్నే కాదు ఇలా ఆటోలతో ముడిపడి ఆటుపోట్లని ఎదుర్కొన్న మహిళలతో సహా మరికొందరి స్ఫూర్తిదాయకమైన వాస్తవ గాథలకి కూడా ఈ పుస్తకంలో చోటు కల్పించడం ఎంతో సందర్భోచితంగా, సముచితంగా కూడా వుంది.
మొత్తం మీద విభిన్న అనుభవాల సమాహారంగా రూపుదిద్దుకున్న ఈ 120 పేజీల పుస్తకం వెల కూడా 120 రూపాయలే. ఆసక్తి గల వారు 9849870250 నెంబర్ కి ఫోన్ పే, లేదా గూగుల్ పేలో ఆర్డర్ ఇచ్చి తెప్పించుకోవచ్చు.
_ డి. స్వాతి
వెటరన్ జర్నలిస్ట్
Also Read :
Also Read :
Also Read :