Sunday, January 19, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఉగాది కవితా! నీవెక్కడ?

ఉగాది కవితా! నీవెక్కడ?

Traditions-Trending: తెలుగు ఉగాదులు, సంవత్సరాల పేర్లు తెలుగులా ఇంగువకట్టిన గుడ్డ. ఉన్నాయనుకుంటే ఉంటాయి. లేవనుకుంటే లేవు. ఉన్నా లేనట్లే. లేకపోయినా ఉన్నట్లే. అందుకే బహుశా కృష్ణశాస్త్రి-
“నాకుగాదులు లేవు;
ఉషస్సులు లేవు”
అన్నాడేమో తెలియదు.

పెద్దబాలశిక్షను కక్షగట్టిన పెద్ద శిక్షగా భావించి యాభై ఏళ్ల కిందటే శిక్షించి అటకెక్కించాము. ఇప్పుడు అరవై తెలుగు సంవత్సరాల పేర్లు గూగుల్ చెబితే ఉన్నట్లు. లేకుంటే ఆ సంవత్సరాలకు ఎప్పుడో సంవత్సరీకాలు జరిగినట్లు.
తెలుగువారికి ఉగాది సంవత్సరాది. తొలి పండుగ. ఉగాదికి కవిత్వానికి ప్రత్యక్ష సంబంధముంది. తెలుగు వెలిగిన రోజుల్లో ఉగాదికి ఊరూరా కవి సమ్మేళనాలు జరిగేవి. కవిత్వం కూడు పెట్టినా, పెట్టకపోయినా కవిత్వాన్ని నమ్ముకుని, కొంతవరకు అమ్ముకుని కొన్ని తరాలు బతికాయి. కవి కులం రాజ్యమేలిన రోజులు ఉండేవి. ప్రబంధ ప్రణయ సుందరుల నుండి, లేని ప్రేయసి ఊహాలోకాలనుండి కవితను భూమార్గం పట్టించి- కష్టజీవికి అటు ఇటు నిలుచున్నవాడే క వి అని కొత్త నిర్వచనం చెప్పారు. ఒక కులం సంకెళ్లనుండి కవితను అన్ని కులాలకు పంచారు. కులకవులు, వాద కవులు పుట్టుకొచ్చారు. ఎవరి వాదం వారే వినిపించుకోవాలన్నది ఇందులో సిద్ధాంతం. గ్లోబలైజేషన్ మీద గ్లోబ్ పట్టనంత కవిత్వం వచ్చింది. ఇప్పుడు డిజిటల్ యుగం. జూమ్ వీడియో సమావేశాల్లో కవితలు డిజితలుగా రూపాంతరం చెందాయి.

రోజులెంతగా మారినా కవిత్వం ఒక వృత్తిగా చేపట్టడానికి అంతులేని తెగింపో, అమాయకత్వమో, ఈ రెండిటి కలగలుపో ఉండి ఉండాలి.

కవులంటే అభిమానం, గౌరవం, అసూయ, ఆరాధనలు కలిగినవారు నేటి కవికి ఉండాల్సిన లక్షణాలు ఇవి అని నిర్ణయించారు. నిజానికి కవి నిరంకుశుడు అని నిర్వచనం. ఈ లక్షణాల్లోకే కవిని బంధించాలనుకోవడం దుస్సాహసమవుతుంది. కాకపోతే స్థూలంగా ఇలా అనుకోవచ్చు.

1. భాష తెలియకపోయినా ఎదుటివారికి చెప్పాలన్న పట్టుదల/పగ/ప్రతీకారం బలంగా ఉండాలి!

2. ఙ్ఞానశూన్యులయిన లోకులకు తన జ్ఞానం ప్రసారం చేయాలన్న ఉదారత ఉండాలి!

3. వ్యాకరణం, ఛందస్సు తెలియకపోయినా చివరి అక్షరాలు ప్రాస పేర్చే కవితాకుడ్య నిర్మాణ తాపీ మేస్త్రీ విద్య వచ్చి ఉండాలి.

4 . పత్రికల్లో సాహితీ పేజీలు నిర్వహించేవారి వాదంతో ఏకీభవించే కవితలే రాయగలిగి, వాటికి ప్రచురణార్హత కలిగించుకునే నేర్పు ఉండాలి.

5. కవితలకు సమీక్షకులను కూడా తోడునీడగా వెతికి పెట్టుకుని పాజిటివ్ ప్రచారం కలిగించుకునే లౌక్యం తెలిసి ఉండాలి.

6. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాలి.

7. నైజీరియాలో, జపాన్ లో, ఆస్ట్రియాలో వస్తున్న కవితలను ఎప్పటికప్పుడు చదువుతూ అప్ డేట్ గా ఉండాలి. చైనా చలి మంచు కవితను తెలుగు సింగరేణి మండుటెండల్లో చర్చించాలి.

8. వాదమేదయినా వామదృష్టి ప్రతిఫలించాలి.

9. ప్రతీకలు, సంకేతాలు ఇనుప గుగ్గిళ్లకంటే కఠినంగా ఉండి తెలుగుపదాలే అయినా తెలుగు నిఘంటువులకు కూడా అర్థం కాకుండా ఉండాలి.

10. కవికి మామూలు చూపు కాకుండా వైవిధ్యమయిన చూపు ఉండాలి. కవి అందరిలా కాకుండా భిన్నంగా మాట్లాడాలి. భిన్నంగా నడవాలి. భిన్నంగా ఆలోచించాలి. పైకి ఒకలా, లోపల ఒకలా అర్థం కావాలి.

11 . కవిత్వం వెయ్యి పుస్తకాలు ప్రచురించి అమ్ముకోలేక అబిడ్స్ రోడ్లమీద ఫుట్ పాత్ బుక్ సెల్లర్స్ కు ఉచితంగా ఇచ్చుకోవాలి. లేదా ఎదురొచ్చిన ప్రతివారికి అభినందనలతో అని రాసి సంతకం చేసి ఇస్తూ ఉండాలి.

12 . ఇంకా కొన్ని ఇతరేతర విద్యలు, నేర్పులు వచ్చి ఉండాలి. సభామర్యాద దృష్ట్యా వాటి చర్చ అనవసరం

తెలుగు సినిమా పాటల్లో తెలుగును కాపాడుతున్న గీతరచయితలకు తెలుగు కవితా సరస్వతి ఎప్పటికీ రుణ పడి ఉంటుంది. సినిమా పాటకు సాహిత్యంతో పనేమిటి? అన్నది కూడా ఒక ప్రామాణిక ప్రశ్న. ట్యూన్ కు ఏది పడితే అది; ఏది దొరికితే అది తెలుగు పదమనుకుని పెడితే కోదాడ దాటాక బెజవాడే వస్తుంది. క్లాసు మీటు గ్లాసు మీటుకే పనికి వస్తాడు. బిగబట్టిన గొంతుతో సంగీత దర్శకుడే మూలుగుతూ పాడతాడు. తను చేసిన లోకోత్తర ట్యూన్ కు తనే సాహిత్యాన్ని కూడా అందిస్తాడు. అంతకంటే గొప్పగా రాయలేని రచయిత ఆ ఇనుప గుగ్గిళ్లను పొగుడుతూ ఉంటాడు. గుర్రం గుర్రం పని మరచి వేరే పని చేసిన సామెత ఇక్కడ అప్రస్తుతం.

అయినా మన పిచ్చికానీ- కథలో తండ్రి చనిపోవడంతో అర్జంటుగా లండన్, అమెరికా నుండి విమానం వేసుకుని వేటపాలెం, దేవరకొండ కొండ గుట్టల్లో వ్యవసాయానికి వ్యవసాయం నేర్పాల్సిన శ్రీమంతులు, రైతు మహర్షులు ఇంగ్లీషు యాసలో తెలుగు మాట్లాడితేనే అందం. సందర్భ శుద్ధి. పాత్రకు న్యాయం. తెలుగు అక్షరాలను ఇంగ్లీషులో రాసుకుని డైలాగులు చెప్పే హీరో- హీరో ఇన్ లు ఈ మాత్రం తెలుగు చెప్పడమే మన పూర్వ జన్మల పుణ్య ఫల విశేషం. నిజానికి తెలుగు సినిమా పాటల్లో అర్థమయినా, కాకపోయినా, అసలు అన్వయమే కుదరకపోయినా గ్రాంథిక భార తెలుగు పదబంధాలు వాడుతున్నందుకు తెలుగువారిగా మనం గర్వించాలి. ఆయా గీత రచయితలకు మనం రుణపడి ఉండాలి.

అయినా- తెలుగు కవిత్వం చిరంజీవి. ఎన్ని దాడులు, హత్యలు, అరాచకాలు జరిగినా మళ్లీ కొత్త చిగుళ్లతో పుడుతూనే ఉంటుంది.
కత్తిపట్టిన ప్రతివాడూ సైనికుడే!
కలం పట్టిన ప్రతివాడూ కవే!
స్మార్ట్ ఫోన్లో తెలుగు టైప్ చేయడం వచ్చిన ప్రతివాడూ ఈరోజుల్లో డిజిటల్/వర్చువల్ కవే!

జంధ్యాల ఫేమస్ డైలాగ్:-
“నాది కవిత్వం కాదన్నవాడిని కత్తితో పొడుస్తా!”

Ugadi

ధర్మవరపు సుబ్రహ్మణ్యం జగమెరిగిన హాస్యనటుడు. పద్యనాటకాలు, తెలుగు సాహిత్యాన్ని బాగా ప్రేమించినవాడు. ఆనందో బ్రహ్మ పేరిట పాతికేళ్ల క్రితం దూరదర్శన్ లో వారం వారం ఒక హాస్య కదంబ కార్యక్రమం నిర్వహించేవాడు. అందులో ఒక ఉగాదికి కవి సమ్మేళనంలో ధర్మవరం రాసి-చదివి-వినిపించిన కవిత ఇది.

“గది గదిలో ఉగాది!
మది మదిలో ఉగాది!
ఆ గదిలో ఉగాది!
ఈ మదిలో ఉగాది!
ఆ మది గదిలో ఉగాది!
ఈ గది మదిలో ఉగాది!
ఈ ఉగాది ఎగాదిగాది!
ఈ ఉగాది అనాది దగాది!
అయినా మనదయినదీ ఉగాది!”

ఉగాది శుభాకాంక్షలతో…

-పమిడికాల్వ మధుసూదన్
[email protected]

Also Read :

దేవుళ్లకయినా వచనాలు తప్పదు

RELATED ARTICLES

Most Popular

న్యూస్