అతిరథ మహారథులు వెంటరాగా రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము రాజ్యసభ సెక్రటరీ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు అందించారు. నామినేషన్ దాఖలు సమయంలో రాష్ట్రపతి అభ్యర్ధి ముర్ము వెంట ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, కేంద్ర మంత్రి అమిత్ షాతో పాటు ఎన్డీఏ కూటమి పక్షాలున్నాయి. ముర్ము నామినేషన్ ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపాదించారు. అంతకు ముందు పార్లమెంట్ ఆవరణలో ద్రౌపది ముర్ము గాంధి విగ్రహం వద్ద నివాళులర్పించారు.
సీనియర్ కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షడు జేపీ నడ్డా నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. రాష్ట్రపతి పదవికి నామినేషన్ దాఖలు చేయడానికి ఒడిశా నుండి ద్రౌపది ముర్ము గురువారం భువనేశ్వర్ నుండి ఢిల్లీకి చేరుకున్నారు. నిన్ననే ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ లతో ఆమె సమావేశమయ్యారు. ముర్మును ఎన్డీఏ రాష్ట్రపతి పదవికి అభ్యర్ధిగా ప్రకటించడంతో నితీష్ కుమార్ కు చెందిన జనతాదళ్ (యునైటెడ్) ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ లు ఇప్పటికే మద్దతు ప్రకటించారు.
ఏపీ సీఎం వైఎస్ నేతృత్వంలోని వైసీపీ కూడా ముర్ము అభ్యర్ధిత్వానికి మద్దతు ప్రకటించింది. జార్ఖండ్ లో కాంగ్రెస్ తో కలిసి సంకీర్ణ ప్రభుత్వం నడుపుతున్న జేఎంఎం కూడా ముర్ము అభ్యర్ధిత్వానికి మద్దతు పలికే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. ఈ రోజు నుంచే ముర్ము తన ప్రచారాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, టీఎంసీ చీఫ్, బెంగాల్ సీఎం మమత బెనర్జీ, ఎన్సీపీ చీఫ్ శదర్ పవార్ లకు కూడా ముర్ము ఫోన్ చేసి తనకు మద్దతివ్వాలని కోరారు.
Also Read : ద్రౌపది ముర్ము గెలుపు నల్లేరు మీద నడకే…