కరోనా వైరస్ ని అరికట్టేందుకు డిఆర్డిఓ రూపొందించిన 2డి ఔషధం ఈరోజు నుంచి అందుబాటులోకి వచ్చింది. ఢిల్లీ లో జరిగిన ఓ కార్యక్రమంలో రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్ చేతుల మీదుగా ఢిల్లీ లోని పలు ఆస్పత్రులకు మొత్తం 10 వేల డోసులను పంపిణి చేశారు.
డిఆర్డిఓ భాగస్వామ్యంతో హైదరాబాద్ కు చెందిన రెడ్డీస్ లాబొరేటరి ఈ మందును తయారు చేసింది. అత్యవసర సమయంలో ఈ మందును వినియోగించేందుకు భారత ఔషధ నియంత్రణ మండలి (డిజిసిఐ) అనుమతి మంజూరు చేసింది. తీవ్ర లక్షణాలున్నవారికి ఈ మందు బాగా పని చేస్తుందని డిఆర్డిఓ వెల్లడించింది.
ఈ ఔషదం వినియోగానికి సంబందించి రెండు, మూడు దశల్లో జరిపిన క్లినికల్ ట్రయల్స్ మంచి ఫలితాలు రాబట్టాయి. కోవిడ్ రోగులు ఎక్కువ సేపు ఆక్సిజన్ పై ఆధారపడకుండా ఈ మందు బాగా పనిచేస్తుందని, ఈ మందు వాడిన తరువాత ప్రత్యేకంగా ఆక్సిజెన్ ఇవ్వాల్సిన అవసరం ఉండదని వైద్య నిపుణులు చెబుతున్నారు. పొడి రూపంలో ఉన్న ఈ మందును నీళ్ళతో కలిపి వినియోగించాలి.