మానవ విజ్ఞానం బహుముఖంగా అనంతంగా విస్తరిస్తూ ఉంది. ఈ విజ్ఞాన విస్తరణకు వాహిక భాష. ఎంత సాంకేతికాభివృద్ధి జరిగినా, ఎన్ని యంత్రాలు వచ్చినా భాష ఉపయోగం పెరిగేదే కాని తరిగేది కాదు. భాషాభివృద్ధికి ఎటువంటి అడ్డంకులూ ఉండవు. భాష దినదిన ప్రవర్ధమానం. భాషా స్వభావం గురించీ, భాషా నిర్మాణం గురించీ ఎంతో పరిశోధన జరిగింది. ప్రపంచంలో అనేక భాషలకు వ్యాకరణాలు వచ్చాయి. సంస్కృత భాషకు పాణిని రచించిన అష్టాధ్యాయి అన్న వ్యాకరణం అసమానమైనదిగా ప్రపంచ భాషా శాస్త్రవేత్తలు వేనోళ్ళ కొనియాడుతున్నారు. ఏ భాషకైనా సమగ్రమైన నిర్దుష్టమైన, నిర్దిష్టమైన వ్యాకరణ రచన ఒక ఆదర్శమే. భాష కాల పరిణామంలో పొందిన అభివృద్ధినీ, మార్పులనూ విశ్లేషిస్తూ నిరంతరంగా వ్యాకరణ రచన కూడా కొనసాగుతూ ఉండాలి. వ్యాకరణం కంటే కూడా క్షణక్షణ పరిణామాలకు లోనయ్యేది నిఘంటువు. మన విజ్ఞానం పెరిగేకొద్దీ నిఘంటువులో కొత్త మాటలు వచ్చి చేరుతూ ఉంటాయి. మన భాషలో ఉన్న పదజాలంతోనే చిరుమార్పులతో కొత్త పదాలను సృష్టించుకోవచ్చు. పదాల కూర్పుతో, మార్పులతో కొత్త భావాలను ప్రకటించవచ్చు. అవసరమైనప్పుడు అరువు తెచ్చుకోవచ్చు. ప్రతిభాషలోనూ పెరుగుదలకు విస్తృతమైన అవకాశం ఉంటుంది.
మన భాషకు ఏడెనిమిది వందల సంవత్సరాల నుండి లిఖిత వ్యాకరణాలున్నాయి. గత శతాబ్దం వరకు కంఠస్థం చేయడానికి అనుగుణంగా పద్యాలలో వ్యాకరణాలను రచిస్తే గత శతాబ్దం నుండి వచనంలో సూత్ర వ్యాకరణాల రచన ప్రారంభమయింది. అయితే ఈ వ్యాకరణాలలో ఎక్కువ భాగం మన కావ్య భాషను వర్ణించేవి. వాడుక భాషను వర్ణించేవి కావు. గత శతాబ్దం వరకు మన నిఘంటువులు కూడా పద్య రూపంలోనే ఉండేవి. ఇవి పర్యాయ పద నిఘంటువులు. అర్థ వివరణ వీటిలో ఉండదు. ఈ నిఘంటువుల పరిమాణం కూడా పరిమితమయిందే. గత శతాబ్దంలో అకారాది క్రమంతో అర్థ వివరణాత్మకమయిన వచన నిఘంటువులు ప్రారంభమయ్యాయి.
తెలుగు భాషకు అటు కావ్యభాషకు కాని, ఇటు వాడుక భాషకు గాని లిఖిత రూపంలో ఒక సమగ్ర వ్యాకరణం కాని, ఒక సమగ్ర నిఘంటువు కాని లేవు. కిందటి శతాబ్దం చివరి పాదంలో మహామహుల ఉద్యమాల ఫలితంగా వాడుకభాష రచనా భాషగా రూపొందింది. ఆధునిక రచనాభాష/ ప్రమాణభాష రూపుదిద్దుకొంది. ఈ ఆధునిక రచనాభాషకు ఒక మంచి వ్యాకరణమూ, ఒక మంచి నిఘంటువూ రావలసిన అవసరం ఎంతో ఉంది. అట్లాగే భాషా పరిణామాన్ని నిరూపించే వ్యాకరణాలూ, నిఘంటువులూ రావాలి.
భాషా ప్రాధాన్యం మనకు తెలుసు. అయినా భాషా ప్రయోగంలో మనం తగినంత శ్రద్ధ చూపించడం లేదు. ఈ అశ్రద్ధ రాయడంలోనూ ఉంది. సలక్షణ మయిన భాషను నిరూపించడంలోనూ ఉంది. ఒక ఇంగ్లీషు మాటను రాసేటప్పుడు ఆ మాట వర్ణక్రమం (స్పెల్లింగు) లోనూ, ఔచిత్యవంతమయిన ప్రయోగంలోనూ ఎంతో జాగ్రత్తగా ఉంటాం. సంస్కృతమయినా, హిందీ అయినా మరే ఇతర భాష అయినా అంతే. మాతృభాషను వాడడంలో మనకు కొంత నిర్లక్ష్యం ఉందనడంలో సందేహం లేదు. దుకాణాల పేర్ల బోర్డులు కానీ, గోడలమీద రాసిన నినాదాలు, అడ్వర్టయిజుమెంట్లుగాని, పోస్టర్లుకాని, కరపత్రాలు కాని చూసినప్పుడు ఈ విషయం అర్థమవుతుంది. ఇప్పుడు కొంత మెరుగుదల కనిపిస్తున్నా ఇంకా ఎంతో మార్పు రావలసిన అవసరం ఉంది. ఇంతమంది తెలుగు వారిలో ఆధునిక రచనాభాషను సలక్షణంగా వాడగలిగిన వారి సంఖ్య పరిమితమే. మన ఉపన్యాసాలు కూడా అటు గ్రాంథికమూ, ఇటు వ్యావహారికమూ కాని సంకర భాషలో ఉంటాయి. ప్రతి తెలుగు వాడూ చక్కని తెలుగు మాట్లాడగల, రాయగల సామర్థ్యాన్ని సాధించాలి. సర్వ సామర్థ్యాలకూ మూలం భాషా సామర్థ్యం. మన పాఠశాలల్లోనూ, కళాశాలల్లోనూ భాషా బోధనకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఏ భాషను విషయంగా తీసుకుంటే ఎక్కువ మార్కులు వస్తాయి అన్న దృష్టితో మనం వ్యవహరించడం దురదృష్టకరం. ఏ భాషను నేర్చుకోవడమూ దోషం కాదు. కాని మాతృభాషను వదిలిపెట్టడం సరికాదు.
పాఠశాలల్లో భాషా బోధనకు ఎక్కువ సమయం వినియోగించాలి. భాషా బోధనలో అధ్యాపకులకు మంచి శిక్షణ ఇవ్వాలి. ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలల్లో ఏ అధ్యాపకుడయినా భాషను బోధించవచ్చునన్న అభిప్రాయాన్ని మార్చుకోవాలి. ప్రాథమిక పాఠశాలల్లోనే ఎక్కువ సామర్థ్యం ఉన్న, శిక్షణ పొందిన ఉపాధ్యాయుల అవసరం ఉంటుంది. ఈ ఉపాధ్యాయులను ప్రోత్సహించవలసిన అవసరం చాలా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా భాషా బోధనలో జరుగుతున్న పరిశోధనల ఫలితాలను ఎప్పటికప్పుడు వీరికి అందించవలసిన అవసరం ఉంది. పత్రికలు సమాచారాన్ని అందించడమే కాక ప్రజల భాషా సామర్థ్యాలను పెంచగలవు కూడా. అందువల్ల పత్రికలు తాము అందించే భాష విషయంలో తగినంత జాగ్రత్త వహించాలి.
భాషను గురించి ఎంతచెప్పినా తరిగేదికాదు. చదువుతున్న కొద్దీ, ఆలోచిస్తున్న కొద్దీ ఎన్నో కొత్త విషయాలు స్ఫురిస్తుంటాయి. పాత విషయాలను మళ్ళీ గుర్తు చేసుకోవడం, కొత్త వాటిని గురించి ఆలోచించడం నిరంతరమూ జరగవలసిందే. మన అభిప్రాయాలను నలుగురితోనూ పంచుకోవడానికి పత్రికలు బాగా ఉపయోగ పడతాయి. భాషాజ్ఞానానికి ఈ రచన ఏమాత్రం తోడ్పడినా కృతార్థుణ్ణి.
-డి. చంద్రశేఖర రెడ్డి
98661 95673
రేపు:-
మన భాష- 4
“ఇది వచనయుగం”