Sunday, January 19, 2025
HomeTrending Newsతగ్గనున్న రెండు డోసుల వ్యవధి..

తగ్గనున్న రెండు డోసుల వ్యవధి..

ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా రూపొందించిన కొవిషీల్డ్‌ (Covishield) డోసుల మధ్య కనీస వ్యవధిని తగ్గించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రెండు డోసుల మధ్య గడువు 84రోజులుగా ఉంది. దీన్ని మరింత తగ్గించనున్నారు. కొవిషీల్డ్‌ డోసుల వ్యవధి తగ్గింపును ఇప్పటికే పరిశీలిస్తున్నామని.. వీటిపై నేషనల్‌ టెక్నికల్‌ అడ్వైజరీ గ్రూప్‌ ఆన్‌ ఇమ్యూనైజేషన్‌ (NTAGI) నిపుణులతో చర్చించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

భారత్‌లో సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (SII) తయారు చేస్తోన్న కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ పంపిణీని ఈ ఏడాది జనవరి నెలలో చేపట్టారు. రెండు డోసుల్లో తీసుకునే ఈ వ్యాక్సిన్‌ వ్యవధిని తొలుత నాలుగు నుంచి ఆరు వారాలుగా పేర్కొన్నారు. తర్వాత ఆ గడువును 6 నుంచి 8 వారాలకు పెంచారు. అనంతరం మే నెలలో మరోసారి సమీక్షించిన కేంద్ర ప్రభుత్వం.. కొవిషీల్డ్‌ రెండు డోసుల మధ్య వ్యవధిని 12 నుంచి 16వారాలకు పెంచింది. ప్రస్తుతం 84రోజుల తర్వాతే రెండో డోసును అందిస్తున్నారు. బ్రిటన్‌లో చేపట్టిన నివేదికల ఆధారంగా కొవిషీల్డ్‌ రెండో డోసు గడువును పెంచినట్లు కేంద్రం వెల్లడించింది. కానీ, బ్రిటన్‌ మాత్రం రెండు డోసుల మధ్య గడువును తగ్గిస్తూ నాలుగు నెలల కిందటే నిర్ణయం తీసుకుంది. దీంతో భారత్‌ కూడా వీటిని తగ్గించే యోచనలో ఉంది.

దేశవ్యాప్తంగా కొవిషీల్డ్‌ డోసుల మధ్య వ్యవధిని పెంచడం పలు ప్రశ్నలకు దారితీసింది. కేవలం దేశంలో వ్యాక్సిన్‌ కొరత కారణంగానే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందనే ప్రచారం జరిగింది. వాటిని ఖండించిన కేంద్ర ప్రభుత్వం.. డోసుల మధ్య గడువు పెంచడం వల్ల ఎక్కువ యాంటీబాడీలు వృద్ధి చెందుతున్నాయని కొవిడ్‌ వర్కింగ్‌ గ్రూపు ఛైర్మన్‌ ఎన్‌కే ఆరోరా పేర్కొన్నారు. తద్వారా వైరస్‌ నుంచి పూర్తి రక్షణ కలుగుతుందని వెల్లడించారు. తాజాగా కొత్త వేరియంట్ల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని కొవిషీల్డ్‌ గడువుపై పునసమీక్షించనున్న కేంద్రం.. వ్యవధిని తగ్గించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక, భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ (Covaxin) రెండు డోసుల మధ్య గడువు మాత్రం ముందునుంచి ఒకేవిధంగా ఉంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్