బిపర్‌జాయ్ తుఫాను నేడు గుజరాత్ తీరాన్ని తాకనుంది. సాయంత్రం 4 నుంచి 8 గంటల మధ్య పాకిస్థాన్ తీరం సమీపంలోని కచ్‌లో ఉన్న జఖౌ పోర్టు జకావ్ పోర్టు వద్ద అది కేంద్రీకృతమవుతుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం గుజరాత్ తీరానికి 200 కిలోమీటర్ల దూరంలో బిపర్‌జాయ్ తుఫాను పయణిస్తున్నదని తెలిపింది. దీనిప్రభావంతో గంటకు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంగా గాలులు వీస్తున్నాయి. దీంతో అరేబియా సముంద్రంలో అల్లకల్లోలం ఏర్పడింది. రాకాసి అలలు తీరం వద్ద ఎగసిపడుతున్నాయి. పోర్‌బందర్, రాజ్‌కోట్, మోర్బీ, జునాగఢ్, సౌరాష్ట్ర, ఉత్తర గుజరాత్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
తుఫాను హెచ్చరికలతో దేవభూమి ద్వారకలోని ద్వారకాధిశ్ ఆలయాన్ని అధికారులు మూసివేశారు. దేవాలయంలోకి భక్తులను అనుమతించేది లేదని తెలిపారు. కాగా, బిపర్‌జాయ్ తుఫాను ప్రభావంతో గుజరాత్ తీర ప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే 70 గ్రామాలకు చెందిన 75 వేల మంది ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. త్రివిధ దళాలు సహా ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాయని గుజరాత్ ప్రభుత్వం వెల్లడించింది. గాలుల వేగం పెరగడంతో తీర ప్రాంతాల్లో 4 వేల హోర్డింగులను తొలగించినట్టు అధికారులు వెల్లడించారు.
బిపర్‌జాయ్ తుఫాను ఈ నెల 16న రాజస్థాన్‌పైనా ప్రభావం చూపనుందని ఐఎమ్‌డీ వెల్లడించింది. మరోవైపు తుఫాను తమ జీవనోపాధిపై ప్రభావం చూపవచ్చని నౌకల తయారీదారులు ఆందోళన చెందుతున్నారు. తీర ప్రాంతంలోనే నౌకలను తయారు చేస్తామని, 3 వేల టన్నుల బరువుండే చెక్క నౌకల తయారీకి రెండేండ్లు పడుతుందని, వాటిని ఇప్పుడు సురక్షిత ప్రాంతాలకు తరలించలేమని వారు వాపోతున్నారు.