Sunday, January 19, 2025
HomeTrending Newsబలోచిస్తాన్ ప్రావిన్సులో భారీ భూకంపం

బలోచిస్తాన్ ప్రావిన్సులో భారీ భూకంపం

పాకిస్తాన్లో ఈ రోజు వేకువజామున వచ్చిన భారీ భూకంపంతో 20మంది మృత్యువాత పడ్డారు. మరో మూడు వందల మంది తీవ్రంగా గాయపడ్డారు. బలోచిస్తాన్ రాష్ట్రంలోని హర్నై జిల్లా కేంద్రానికి సమీపంలో ఉదయం ౩.౩౦ గంటలకు సంభవించిన భూప్రకంపనలతో నిద్రలోనే అనేక మంది చనిపోయారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.9 గా నమోదైందని అమెరికా జియాలజికల్ సర్వే సంస్థ వెల్లడించింది. భూకంప కేంద్ర స్థలానికి 14 కిలోమీటర్ల విస్తీర్ణంలో ప్రభావం అధికంగా ఉంది. హర్నై, శాహ్రగ్ పట్టణాల్లో అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చి అత్యవసర వైద్య సహాయం అందించి సమీపంలోని ఆస్పత్రులకు తరలిస్తున్నారు.

హర్నై జిల్లాలో పాకిస్తాన్ ప్రభుత్వం అత్యవసర పరిస్థితి ప్రకటించింది. జిల్లాలోని అనేక గ్రామాలు, పట్టణాల్లో ఎం జరుగుతుందో తెలియక ప్రజలు ఇళ్ళ నుంచి బయటకు పరుగులు తీశారు. వేల మంది ప్రజలు ఆరుబయట  వేకువజామునే సామూహిక ప్రార్థనలు చేశారు. బలోచిస్తాన్ రాజధాని క్వెట్ట నగరంలో భూప్రకంపనలు ప్రజల్ని భయాందోళనకు గురిచేశాయి. పేదరికంతో అల్లాడుతున్న బలోచిస్తాన్ ప్రావిన్స్లో కరువుకు తోడు భూకంపం రావటంతో విషాదచాయలు అలుముకున్నాయి.

మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబుల్ కు దక్షిణాన ఈ రోజు భూకంపం రాగా రిక్టర్ స్కేలుపై 4.2 గా నమోదైంది.  కాబుల్ కు ఐదు వందల కిలోమీటర్ల దూరంలో భూప్రకంపన కేంద్రంగా గుర్తించారు. పాక్ బలోచిస్తాన్ రాష్ట్రంలో జరిగిన గంట తర్వాత ఆఫ్ఘన్లో భూకంపం వచ్చింది. ఆస్తి, ప్రాణ నష్టాల వివరాలు తెలియాల్సి ఉంది.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్