Thursday, March 19, 2026
HomeTrending News2023-24లో 6.5శాతం వృద్ధి -పార్లమెంటుకు ఆర్థికసర్వే నివేదిక

2023-24లో 6.5శాతం వృద్ధి -పార్లమెంటుకు ఆర్థికసర్వే నివేదిక

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ ఇవాళ పార్లమెంటులో ఆర్థికసర్వేను ప్రవేశపెట్టారు. ఇవాళ ఉదయం 11 గంటలకు పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభంకాగానే ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కీలక ప్రసంగం చేశారు. అనంతరం నిర్మలాసీతారామన్‌ ఆర్థిక సర్వేను పార్లమెంటుకు సమర్పించారు. భారత స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) 2023-24లో 6 నుంచి 6.8 శాతం ఉండగలదని ఈ సర్వే ప్రొజెక్ట్ చేసింది. అయితే ఇది మూడేళ్ల కనిష్టం కావడం గమనార్హం. 2021-22 సంవత్సరంలో ఆర్థిక వృద్ధి రేటు 8.7 శాతంగా నమోదు కాగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అది 7 శాతంగా ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా సవాళ్లు ఎదురుకానున్న నేపథ్యంలో వృద్ధి రేటు అంచనాలను తగ్గించింది. ఇది 6.5 శాతంగా నమోదవుతుందని ఆర్థిక సర్వే పేర్కొంది.

పార్లమెంట్ బడ్జెట్ సెషన్ ఆరంభంలో ప్రధాని నరేంద్ర మోడీ ఈ కేంద్ర బడ్జెట్ 2023 సామాన్యుల ఆకాంక్షలను నెరవేరుస్తుందన్నారు. ప్రపంచం కూడా భారత్ వైపే చూస్తోందన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ బడ్జెట్ ఆ దిశలోనే ఉండగలదన్నారు. నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్నారు. కాగా నేడు ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేను ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్థిక వ్యవహారాల శాఖ రూపొందించింది. దానిని ముఖ్య ఆర్థిక సలహాదారు డాక్టర్ వి. అనంత నాగేశ్వరన్ మార్గనిర్దేశనలో రూపొందించారు. ఆర్థిక సర్వే అన్నది బడ్జెట్‌కు మార్గనిర్దేశనంగా, వచ్చే ఆర్థిక సంవత్సరంలో స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) వృద్ధిని ప్రొజెక్ట్ చేసేదిగా ఉంటుంది.

ఆర్థిక సర్వే అనేది చాలా ముఖ్యమైన నివేదిక. ఇది గత సంవత్సర ఖాతాలను, వచ్చే సంవత్సరానికి సంబంధించి సవాళ్లను, పరిష్కారాలను గురించి ప్రస్తావిస్తుంది. ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు పర్యవేక్షణలో ప్రతి ఏటా దీన్ని రూపొందిస్తారు. ఆర్థిక మంత్రి పార్లమెంట్‌లో సమర్పించిన అనంతరం మీడియా సమావేశంలో మీడియా అడిగే ప్రశ్నలకు కూడా ముఖ్య ఆర్థిక సలహాదారు సమాధానాలు ఇస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular