దేశవ్యాప్తంగా ఫారెస్టు ఎంట్రీ పాయింట్ల వద్ద ఫాస్టాగ్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ అందుబాటులోకి రానున్నది. ఈ మేరకు నాగార్జునసాగర్- శ్రీశైలం టైగర్ రిజర్వ్, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ ఇండియన్ హైవేస్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా అటవీ ప్రాంతంలోకి వాహనాల ప్రవేశాలకు మార్గం సుగమంకానున్నదని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. టైగర్ రిజర్వ్‌లోని వివిధ ప్రవేశ ద్వారాల వద్ద వసూలు చేసే ఎకోసిస్టమ్ మేనేజ్‌మెంట్ కోఆర్డినేషన్ రుసుమును ఫాస్టాగ్ ద్వారా వసూలు చేయనున్నారు. ఫాస్టాగ్ ఆధారిత చెల్లింపులను ప్రారంభించడం వల్ల వాహనాల సుదీర్ఘ క్యూలు, జాప్యాన్ని నివారించవచ్చు. తద్వారా సందర్శకులు అటవీ ప్రాంతాలలోని అందాలను, అహ్లాదకర వాతావరణాన్ని, వన్యప్రాణులను ఎలాంటి అవాంతరాలు లేకుండా అస్వాదించవచ్చు.