బెంగళూరులో ఒక శునక ప్రేమికుడు యాభై కోట్లు పెట్టి ఒక అపురూపమైన సంకరజాతి కుక్కను విదేశంలో కొన్నాడని …స్వదేశానికి తెచ్చుకున్నాడని…దాని ఆలనా పాలనకు నెలకు లక్షల్లో ఖర్చు పెడుతున్నాడని దేశమంతా మెయిన్ స్ట్రీమ్ మీడియాతోపాటు సామాజిక మాధ్యమాల్లో మారుమోగిపోయినప్పుడు ఐ ధాత్రి ప్రచురించిన వార్త లింక్ ఇది:-
సాధారణంగా అంతంత పెద్ద మొత్తాల్లో విదేశాల్లో చెల్లింపులు చేసినప్పుడు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్- ఈ డి రంగప్రవేశం చేస్తుంది. చెల్లింపులన్నీ సక్రమ మార్గంలో జరిగాయా? లేక హవాలాలాంటి అక్రమ మార్గంలో జరిగాయా? అని విచారిస్తుంది.
“యాభై కోట్ల కుక్క” అంటూ అడగని వారినికూడా పిలిచి మరీ చెప్పుకుంటున్నాడు ఈ కుక్క యజమాని సతీష్. ఈ వార్తల దాడి తట్టుకోలేక…ఈ డి దాడి చేసింది. యాభై కోట్లు కాదు కదా…కనీసం కోటి కూడా కాదని…మహా అయితే మూడు, నాలుగు లక్షలు మాత్రమే ఉండవచ్చని తేలింది. ప్రచార యావకోసం దాన్ని యాభై కోట్లు పెట్టి కొన్నట్లు చెప్పుకుంటున్నాడని అర్థమయ్యింది. బహుశా ఈ డి అధికారులు అతడిని మందలించి ఉంటారు. అతడు నవ్వుకుని ఉంటాడు.
సామాజిక మాధ్యమాల విజృంభణలో “ఎద్దు ఈనింది అంటే…గాటకు కట్టేయండి” అన్నట్లే ఉంటుంది వ్యవహారం. నిజానిజాల నిర్ధారణకు సమయం లేదు, ప్రయత్నమూ లేదు. “పదుగురాడు మాట పాడి అయి ధర చెల్లు…” అన్నట్లు అందరూ కథలు కథలుగా ప్రచురించారు కదా అని ఐ ధాత్రి కూడా ఈ వార్తను ప్రచురించింది. అందుకు విచారం వ్యక్తం చేస్తూ…ఈ వివరణ.
శునకానందానికి నిర్వచనం కావాల్సినవారు బెంగళూరులో సతీష్ ను సంప్రతించగలరు!