ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేలా 2023-24 బడ్జెట్ రూపొందించామని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పన సహా పలు కీలక రంగాలకు ప్రాధాన్యతనిచ్చినట్లు మంత్రి చెప్పారు. శాసన సభలో 2023-24 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో సచివాలయంలోని తన కార్యాలయంలో మంత్రి బుగ్గన ప్రత్యేక పూజలు నిర్వహించారు. బడ్జెట్ ప్రతులను స్వామి చిత్రపటం వద్ద ఉంచారు. అనంతరం వేదపండితుల ఆశీర్వాదం తీసుకున్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ఐదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం రావడం సంతోషకరమన్నారు. ఆర్థిక లోటు, కోవిడ్-19 వంటి ప్రత్యేక పరిస్థితులను ఎదుర్కోవడం సవాలుగా తీసుకుని ముందుకువెళ్లామన్నారు. అదే ఆత్మవిశ్వాసంతో 2023-24 బడ్జెట్ ను కూడా ప్రవేశపెట్టేందుకు సమాయత్తమైనట్లు మంత్రి బుగ్గన పేర్కొన్నారు. మహిళలు, పిల్లల కోసం ప్రత్యేకంగా కేటాయింపులకు పెద్దపీట వేసినట్లు మంత్రి పేర్కొన్నారు. మహిళా సాధికారతే ధ్యేయంగా జెండర్ బేస్డ్ బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్ రావత్, ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, ఆర్ధిక శాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, సీఎఫ్ఎంఎస్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి సునీల్ తదితరులు పాల్గొన్నారు.