మీడియా దిగ్గజం, ఈనాడు గ్రూపు సంస్థల ఛైర్మన్ చెరుకూరి రామోజీరావు కన్నుమూశారు. ఆయన వయసు 88సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి నిన్న మధ్యాహ్నం మరింత దిగజారింది. వెంటనే ఆయనను హైదరాబాద్ లోని స్టార్ హాస్పిటల్ లో చేర్పించారు. శ్వాసకోస సమస్య తలెత్తడంతో వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించారు కానీ ఫలితం లేకపియింది. ఈ తెల్లవారుజామున 4 గంటల 50నిమిశాలకు ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. కాసేపట్లో ఆయన భౌతిక కాయాన్ని ఫిల్మ్‌సిటీ లోని ఆయన నివాసానికి తరలించనున్నారు. రేపు అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది.
రామోజీరావు కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 1936 నవంబరు 16న రైతుకుటుంబంలో జన్మించాడు. తల్లి వెంకటసుబ్బమ్మ, తండ్రి వెంకట సుబ్బారావు. రామోజీరావు పూర్వీకులు పామర్రు మండలంలోని పెరిశేపల్లి గ్రామానికి చెందినవారు గుడివాడలోనే డిగ్రీ వరకు చదువుకున్నారు. తల్లిదండ్రులు ఆయనకు రామయ్య అని పేరు పెట్టగా.. పాఠశాలలో తన పేరు రామోజీరావు అని చెప్పి పరిచయం చేసుకున్నారు. అప్పటినుంచి ఆయన పేరు రామోజీరావుగా మారింది.
బీఎస్సీ పూర్తి చేసి ఢిల్లీలోని ఓ యాడ్ ఏజెన్సీలో చేరారు. 1962లో ‘మార్గదర్శి’ని ప్రారంభించారు. అదే ఆయన తొలి బిజినెస్. తర్వాత అనేక వ్యాపారాలు మొదలుపెట్టారు. 1974లో ‘ఈనాడు’ను స్థాపించారు. ఫిల్మ్ సిటీతో గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కారు. అనేక సినిమాలు నిర్మించారు. 2016లో భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ సత్కరించింది.