Wednesday, January 22, 2025
HomeTrending NewsPakistan: పాకిస్తాన్ ఎన్నికలు...అసంతృప్తి జ్వాలలు

Pakistan: పాకిస్తాన్ ఎన్నికలు…అసంతృప్తి జ్వాలలు

పాకిస్తాన్ లో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రజల అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. రాజకీయ పార్టీలు ఎన్నికల్లో గెలుపు కోసం ఎత్తులు వేస్తుంటే…సామాన్య ప్రజలు పూట గడవక మదనపడుతున్నారు. ద్రవ్యోల్భణం రాకెట్ వేగంతో పెరుగుతున్నా తమకు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్న ప్రధాన పార్టీలు…నేతల వైఖరిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చమురు ధరలు ఆకాశాన్నంటాయి. పాకిస్థాన్‌లో ప్రస్తుతం పెట్రోల్ ధర రూ.267.34కు లీటర్, హై స్పీడ్ డీజిల్ రూ. 276.21 లీటర్, లైట్ స్పీడ్ డీజిల్ రూ. 164.64 లీటర్ గా ఉంది. దీంతో అన్ని రకాల నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి.

పాకిస్థానీలు కోడి గుడ్లను కొనాలంటేనే భయపడుతున్నారు. పౌల్ట్రీలో ఉపయోగించే సోయాబీన్‌ సరఫరా తగ్గిపోవడంతో, గుడ్ల ధరలు అమాంతం పెరిగిపోయాయి. 30 డజన్ల గుడ్ల ధర రూ.10,500 నుంచి రూ.12,500కు పెరగడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డజను గుడ్లను రూ.360కి విక్రయించాలని ప్రభుత్వం చెప్పినప్పటికీ, రిటైల్‌ వ్యాపారులు రూ.389కి అమ్ముతున్నారు. ఒక్కో గడ్డు ధర రూ.32కి చేరుకుంది.

సోయాబీన్స్‌ దిగుమతికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ ఇంకా నోటిఫికేషన్‌ను జారీ చేయలేదు. ద్రవ్యోల్బణం పెరుగుదల కొనసాగుతున్నట్లు ఆల్‌ పాకిస్థాన్‌ బిజినెస్‌ ఫోరం తెలిపింది. ఆహారం, ఇంధనం ధరలు పెరుగుతున్నాయని పేర్కొన్నది.

మరోవైపు దేశాన్ని పూర్తిస్థాయి ఇస్లాం చాందసవాదంపై మళ్ళించేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి. పాకిస్థాన్‌ నేషనల్‌ అసెంబ్లీ, ప్రొవిన్షియల్‌ అసెంబ్లీలకు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే ఎన్నికల్లో పాకిస్థాన్‌ మర్కజి ముస్లిం లీగ్‌ (పీఎంఎంఎల్‌) పోటీ చేస్తున్నది. 2008 నవంబరు 26న ముంబై లో జరిగిన ఉగ్రవాద దాడుల సూత్రధారి హఫీజ్‌ సయీద్‌ ఈ పార్టీకి మద్దతిస్తున్నాడు.

హఫీజ్‌ను ఐక్యరాజ్య సమితి ఉగ్రవాదిగా ప్రకటించింది. అమెరికా అతని తలకు 10 మిలియన్‌ డాలర్లు వెల కట్టింది. భారత్‌ మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్ట్‌ హఫీజ్‌. వచ్చే ఫిబ్రవరి 8న జరిగే ఈ ఎన్నికల్లో దాదాపు అన్ని స్థానాలకు పీఎంఎంఎల్‌ పోటీ చేస్తున్నది. హఫీజ్‌ సయీద్‌ కొడుకు తల్హా సయీద్‌ లాహోర్‌ నేషనల్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తున్నది.

బిలావల్ భుట్టు నేతృత్వంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, నవాజ్ షరీఫ్ నాయకత్వంలోని పాకిస్తాన్ ముస్లిం లీగ్, ఇమ్రాన్ ఖాన్ కు చెందిన పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ పార్టీలు సంపూర్ణ మెజారిటీ సాధించకపోతే….స్వల్ప సీట్లు సాధించిన అతివాద పార్టీలతో పొత్తు పెట్టుకోవల్సివస్తుంది. కొన్ని సీట్లు సాధించినా ప్రభుత్వంలో చక్రం తిప్పాలని పాకిస్థాన్‌ మర్కజి ముస్లిం లీగ్‌ ప్రణాలికలు వేస్తోంది.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్