Saturday, November 23, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంమెదడులో ఎలాన్ మస్క్

మెదడులో ఎలాన్ మస్క్

A Chip Can Do…వేదిక మీద బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సుఖాసీనులై ఉన్నారు. ముందువరుసలో ఉన్న అష్టదిక్పాలకులు పాత ఫైల్స్ అన్నీ పదే పదే చెక్ చేసుకుంటున్నారు. ప్రజాపతులు ఏకకాలంలో దేవగురువు బృహస్పతి, రాక్షస గురువు శుక్రాచార్యుడితో అకెడెమిక్ విషయాలు మాట్లాడుతున్నారు. ధర్మదేవత నాలుగు కాళ్లు నిటారుగానే ఉన్నాయని వెటర్నరీ ధన్వంతరి వైద్యుడు సర్టిఫై చేయగానే సభ మొదలయ్యింది.

బ్రహ్మ:-
అధ్యక్షుల వారి అనుమతితో ఈ పద్నాలుగు భువనభాండాల అసాధారణ అత్యవసర విస్తృత ధర్మాసనం ప్రత్యేక సమావేశాన్ని ప్రారంభిస్తున్నాను. మొన్న ఒకరోజు యమధర్మరాజు నాదగ్గరికొచ్చి కంటికి మంటికి ఏకధారగా ఏడ్చాడు. ఆ ఏడుపులో ఔచిత్యం ఉండడంతో అదే ఏడుపు నేను కూడా విష్ణువు ముందు ఏడ్చాను. పైగా యమధర్మరాజుకంటే దీనికి ఎక్కువగా ఏడవాల్సింది నేనే. దాంతో ఆయన నన్ను ఓదార్చి…పరమశివుడిని ఒప్పించి…ఎన్నో వ్యయప్రయాసలతో ఈ విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు.

బృహస్పతి, శుక్రాచార్యుడు డ్రాఫ్ట్ చేసి సరస్వతి అనుమతి పొందిన అజెండా ప్రకారం ఈ సమావేశం జరుగుతుంది. మొదట ప్రార్థన. అందరూ లేచి నిలుచుని ధర్మదేవతకు ప్రతిరూపమయిన శివుడి వాహనం ఎద్దుకు నమస్కరించి మీ మీ స్థానాల్లో కూర్చోండి.

ఇప్పుడు దక్షిణ దిక్కుకు అధిపతి అయిన యముడు వేదికమీదికి వచ్చి తన అనుభవాలను మనతో పంచుకుంటారు. నిజానికి ఈ ప్రత్యేక సమావేశానికి ప్రోద్బలం ఆయనే కాబట్టి…ఒళ్లంతా చెవులు చేసుకుని జాగ్రత్తగా వినండి.

యమధర్మరాజు:-
రోజుకు సగటున ఒకటిన్నర లక్షల మందిని మా భటులు పాశం వేసి ప్రాణాలు తీస్తుంటారు. ఇందులో 0.00000001 శాతం తప్ప మిగతావారంతా నరకానికే వస్తున్నారు. ఒక్కో వారమయితే వందశాతం నరకానికే వస్తున్నారు. ఈమధ్య వీరందరి మెదళ్లలో ఒక సెల్ ఫోన్ సిమ్ లాంటి చిప్ ఉండడాన్ని మా చిత్రగుప్తుడి దగ్గర పనిచేసే సాంకేతిక బృందం పసిగట్టింది.

కొన్ని కోట్ల కోట్ల మన్వంతరాలుగా మనుషుల మెదళ్లలో ఎన్నడూ లేనిది ఏదో దొరకడంతో వెంటనే మా హార్డ్ వేర్ టీమును పిలిపించి విచారించాను. ఎంతగా ట్రయ్ చేసినా వారేమీ కనుక్కోలేకపోయారు. దాంతో బ్రహ్మ దగ్గరికి పరుగెత్తుకెళ్లా. ఆయనక్కూడా మొదట అర్థం కాలేదు. కాసేపు ధ్యానం చేసి దివ్యదృష్టితో చూసి…ఆయన స్పృహదప్పి పడిపోయాడు. పక్కనే కమండలంలో ఉన్న గంగాజలానికి కొంచెం సరస్వతీ నది జలం కూడా కలిపి నేను, తల్లి సరస్వతి మూడు సార్లు నాలుగు మొహాల మీద చల్లగా…మెల్లగా తేరుకుని…చల్లబడిపోయాడు.

బ్రహ్మ సృష్టికి ప్రతి సృష్టిలా టెస్లా- ట్విట్టర్ ఎలాన్ మస్క్ తయారుచేసిన సరికొత్త మనిషి మెదడు చిప్పులట అవి. ఆ చిప్పలు బిగించుకున్నవారు ఆలోచిస్తే చాలు…బయట ఆ కమాండ్లను రిసీవ్ చేసుకునే యంత్రాలు వాటంతటవే పనిచేస్తాయి. మీకు సులభంగా అర్థం కావడానికి ఒక ఉదాహరణతో చెప్తాను. మీరు కంప్యూటర్ ను ఆన్ చేయాలని మెదడులో అనుకోగానే…ఆ ఆలోచనే ఒక కమాండ్ సిగ్నల్ గా వెళ్లి కంప్యూటర్ ఆన్ అయిపోతుంది. వెళ్లి స్విచ్ ఆన్ చేసి, లాగిన్ కావాల్సిన పనే లేదు. అవతలి మెదడులో ఏముందో ఇవతలి మెదడు చదివేస్తుంది.

ఇంకా చాలా చాలా ఉన్నాయి కానీ అవన్నీ ఇక్కడ అనవసరం. దీన్ని ఇలాగే వదిలేస్తే…ఇక సృష్టికర్త బ్రహ్మ ఎందుకు? పాశం వేసి ప్రాణాలు తీయడానికి నేనెందుకు? ఇందులో మంచి- చెడులు మాకనవసరం.

మా డ్యూటీ మేము చేసుకోలేక దిక్కులేని రెక్కతెగిన అక్కు పక్షులమయినప్పుడు దక్షిణ దిక్కూ వద్దు. ఉత్తర దిక్కూ వద్దు. మాక్కూడా అలాంటి చిప్పులేవో ఇవ్వండి…చిప్ప చేత పట్టుకుని ఏ కైలాసం ముందో…వైకుంఠం వాకిట్లోనో ఆలోచనల కమాండ్ తో ఆటోమేటిక్ బెగ్గింగ్ చేసుకుంటూ బతుకుతాం.

సభలో గుండుసూది పడితే ప్రళయంలా వినిపించే నిశ్శబ్దం. అందరి కళ్లల్లో నీళ్లు. విష్ణువు నాలుగు చేతులతో అందరినీ ఓదారుస్తున్నాడు. శివుడు అయిదు ముఖాలతో అందరికీ సర్ది చెప్తున్నాడు. బృహస్పతి సంతాప సందేశాలు రాస్తున్నాడు. శుక్రాచార్యుడు చదివి వినిపిస్తున్నాడు.

వాదనలు ముగిశాయి. చివర పరమశివుడు తీర్పు చెప్పాలి.
“వినాశ కాలే విపరీత చిప్పు” అన్నాడు శివుడు దిక్కులు పిక్కటిల్లేలా.

ఇది-
తీర్పో!
నిట్టూర్పో!
ఓదార్పో!
మార్పో!
తెలియక సభ ముగిసింది.

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

జయహో మస్క్

RELATED ARTICLES

Most Popular

న్యూస్