ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా దబ్బమర్క పోలీస్ క్యాంప్ నుంచి కోబ్రా 208 బెటాలియన్, ఎస్‌టీఎఫ్ జవాన్లు సంయుక్త ఆధ్వర్యంలో సాకిలేర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల ఆపరేషన్‌కు బయల్దేరారు. భద్రతా బలగాల రాకను పసిగట్టిన మావోయిస్టులు జవాన్లపై మెరుపుదాడికి దిగారు. గ్రానైట్ లాంచర్లను జవాన్లపై ప్రయోగించారు. జవాన్లు అప్రమత్తమై మావోయిస్టులపై ఎదురు కాల్పులు జరిపారు. ఇరువర్గాల మధ్య సుమారు 15 నిమిషాలపాటు కాల్పులు జరిగినట్టు తెలుస్తున్నది. జవాన్ల ధాటికి తాళలేక మావోయిస్టులు కాల్పులు జరుపుతూనే దట్టమైన అటవీ మార్గంలోకి పారిపోయారు. ఈ ఘటనలో కోబ్రా 208 బెటాలియన్‌కు చెందిన ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. ఎదురుకాల్పుల్లో సుమారు ఆరుగురు మావోయిస్టులు గాయపడినట్టు పోలీసులు భావిస్తున్నారు.