Thursday, November 21, 2024
HomeTrending Newsఛత్తీస్ ఘడ్ లో ఎదురు కాల్పులు - పదిమంది నక్సల్స్ మృతి

ఛత్తీస్ ఘడ్ లో ఎదురు కాల్పులు – పదిమంది నక్సల్స్ మృతి

మావోయిస్టుల అణచివేతే లక్ష్యంగా ఛత్తీస్ ఘడ్ లో పోలీసులు వేట సాగిస్తున్నారు. ఈ రోజు(మంగళవారం) జరిగిన ఎదురుకాల్పుల్లో 10 మంది మావోయిస్టులు చనిపోయారు. బీజాపూర్‌ – దంతెవాడ జిల్లాల సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలు ఉన్నాయన్న సమాచారంతో భద్రతా బలగాలు ఆపరేషన్‌ ప్రారంభించాయి. కూంబింగ్ సమయంలో భద్రతా బలగాలకు నక్సల్స్ తారసపడ్డారు. ఈ క్రమంలో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఎన్‌కౌంటర్‌లో ఇప్పటి వరకూ 10 మంది నక్సలైట్లు హతమైనట్లు సమాచారం. ప్రస్తుతం ఆపరేషన్‌ కొనసాగుతోంది. మృతి చెందిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

దంతెవాడ – బీజాపూర్‌ జిల్లా సరిహద్దు ప్రాంతంలో పశ్చిమ బస్తర్‌ డివిజన్‌కు చెందిన మావోయిస్టులు ఉన్నట్టు సమాచారం అందింది. పోలీసులు అర్ధరాత్రి ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఈరోజు ఉదయం 6 గంటల సమయంలో మావోయిస్టులు – పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు ప్రారంభమయ్యాయి. ఎన్ కౌంటర్ కొనసాగుతోందని దంతెవాడ పోలీసులు తెలిపారు. ఎదురుకాల్పుల్లో చనిపోయినవారి వివరాలు తెలియాల్సి ఉంది.

చత్తీస్ ఘడ్ లో బిజెపి ప్రభుత్వం ఏర్పడ్డాక మావోయిస్టుల నిర్మూలనే టార్గెట్ గా పోలీసులు దూకుడు ప్రదర్శిస్తున్నారు. నాలుగు నెలలుగా జరుగుతున్న ఎదురుకాల్పుల్లో నక్సల్స్ కు కోలుకోలేని స్థాయిలో నష్టం వాటిల్లింది. 120 రోజుల్లో సుమారు 150 మంది మవోలను పోలీసులు హతమార్చారు. రాష్ట్రంలో వారం రోజుల క్రితం పర్యటించిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా 2026 నాటికి దేశంలో నక్సల్స్ లేకుండా చేస్తామని ప్రకటించారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా నక్సల్స్ ప్రభావిత ఏడు రాష్ట్రాల పోలీసు అధికారులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా నక్సల్స్ ఎరివేతపై పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారని సమాచారం.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్