Saturday, January 18, 2025
HomeTrending Newsదండకారణ్యం జల్లెడ పడుతున్న బలగాలు

దండకారణ్యం జల్లెడ పడుతున్న బలగాలు

నక్సల్స్ ఏరివేత ముమ్మరం చేసిన పోలీసు బలగాలు దండకారణ్యంలో ఆణువణువు గాలిస్తున్నాయి. మహారాష్ట్ర, తెలంగాణా, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల సరిహద్దుల్లోని అటవీ ప్రాంతాల్లో మావోల కోసం జల్లెదపడుతున్నాయి. మూడు రాష్ట్రాల పోలీసులు, కేంద్ర బలగాలు సమన్వయంతో చేస్తున్న కూంబింగ్ తో మావోలకు తీవ్ర స్థాయిలో నష్టం జరుగుతోంది.

తాజాగా తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో భద్రతాబలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగున్నాయి. ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మరణించాడు. ఆ ప్రాంతంలో ఇంకా ఆపరేషన్‌ కొనసాగుతున్నదని పోలీసు అధికారులు తెలిపారు. ఘటనా స్థంలో భారీగా ఆయుధ సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎన్‌ కౌంటర్‌లో మావోయిస్టులు  భారీగా నష్టం వాటిల్లిందని తెలుస్తున్నది. దీనికి సంబంధించి పూర్తివివరాలు తెలియాల్సి ఉన్నది.

రెండు రోజుల క్రితం మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లోని దండకారణ్యంలో మావోయిస్టులు, భద్రతా దళాలకు జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మరణించారు. ఓ ఎస్సై, ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా వండోలి గ్రామ సమీపంలో సుమారు 15 మంది మావోయిస్టులు ప్రచారం నిర్వహిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో భద్రతా దళాలు గాలింపు చేపట్టయి. ఈ క్రమంలో బలగాలకు మావోయిస్టులు తారసపడటంతో కాల్పులు మొదలయ్యాయి. సుమారు ఐదు గంటల పాటు ఏకబిగిన జరిగిన ఎదురుకాల్పుల్లో ఎస్‌ఐ సతీశ్‌ పాటిల్‌, ఇద్దరు జవాన్లు గాయపడగా వారిని హెలికాప్టర్‌లో తరలించారు.

కాల్పుల అనంతరం జరిగిన గాలింపులో 12 మంది మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మూడు ఏకే-47లు, రెండు ఇన్‌సాస్‌లు, ఒక కార్బైన్‌, ఒక ఎస్‌ఎల్‌ఆర్‌, ఇతర వస్తు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో తిప్పగఢ్‌ దళానికి చెందిన డీవీసీఎం లక్ష్మణ్‌ ఆత్రం, విశాల్‌ ఆత్రం ఉన్నట్టు పోలీసులు ధ్రువీకరించారు. ఇటీవలి కాలంలో ఇదే అతిపెద్ద ఆపరేషన్‌. మహారాష్ట్ర ప్రభుత్వం గడ్చిరోలి పోలీసులను అభినందిస్తూ.. వారికి 51 లక్షల రివార్డు ప్రకటించింది.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. డ్రోన్ల ద్వారా.. మావోలు, వారి సానుభూతి పరులు వాడుతున్న సెల్ ఫోన్లతో వారి కదలికలు సులువుగా గుర్తిస్తున్నారు. మావోల అంశంలో ఆయా రాష్ట్రాలు, కేంద్రప్రభుత్వం పోలీసులకు పూర్తి స్వేఛ్చ ఇవ్వటంతో క్షేత్రస్థాయిలో ఇన్ఫార్మర్ వ్యవస్థ బలోపేతం చేశారు. దీంతో నక్సల్స్ కదలికలు క్షణాల్లో పోలీసులు తెలుస్తుండగా… వెనువెంటనే బలగాలు దాడులకు దిగుతున్నాయి.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్