Saturday, January 18, 2025
HomeTrending Newsనేతల అండతోనే ఏపిలో భద్రాద్రి భూముల ఆక్రమణ - వినోద్ కుమార్

నేతల అండతోనే ఏపిలో భద్రాద్రి భూముల ఆక్రమణ – వినోద్ కుమార్

భద్రాద్రి రామాలయానికి సంబంధించిన సుమారు 650 ఎకరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యదేచ్చగా దురాక్రమాలకు గురయ్యాయని, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ చర్యల వల్లే భద్రాద్రి రాముని భూముల దురాక్రమాలకు ఆస్కారం కలిగాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ఆరోపించారు. రాముని పేరిట రాజకీయాలు చేయడం తప్ప భద్రాద్రి రాముని భూముల రక్షణలో బిజెపి కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకుండా పోయిందని వినోద్ కుమార్ అన్నారు. శుక్రవారం భద్రాచలం నుంచి న్యాయవాదులు, పలువురు ప్రజా ప్రతినిధులు, స్థానిక ప్రముఖులు హైదరాబాద్ లోని మంత్రుల నివాసంలో వినోద్ కుమార్ ను కలిసి భద్రాద్రి రాముని భూముల ఆక్రమణల గురించి వివరించారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ భద్రాద్రి రాముని భూముల అన్యాక్రాంతానికి బిజెపి కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలలో బలవంతంగా, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఏకపక్షంగా ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేసిందని, దీంతో భద్రాద్రి రాముని భూములకు రక్షణ లేకుండా పోయిందని వినోద్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం పురుషోత్తపట్నం గ్రామంలో భద్రాద్రి రామాలయం దేవస్థానానికి చెందిన 899 ఎకరాల భూములు ఉండగా.. అందులో సుమారు 650 ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయని వినోద్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ భూములను ఆక్రమణదారుల నుంచి కాపాడాలని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ అధికారులకు, ఎండోమెంట్స్ అధికారులకు, పోలీసు అధికారులకు భద్రాచలం దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఫిర్యాదులు చేసినా, విన్నవించినా.. పట్టించుకునే నాధుడే లేకుండా పోయారన్నారు. దీనిపై తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారని వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ, టీ.డీ.పీ. నాయకుల ప్రోద్భలంతోనే భద్రాద్రి రాముని భూములు ఆక్రమణలకు గురవుతున్నాయని వినోద్ కుమార్ తెలిపారు.

పోలవరం ప్రాజెక్టులో ముంపునకు గురి కాకుండా ఉన్న ఏడు మండలాలలోని గ్రామాలను తిరిగి తెలంగాణకు స్వాధీన పర్చాలని, అందుకు పార్లమెంటులో చట్టం తీసుకుని రావాలని వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Also Read : కేంద్రం మొండివైఖరి వీడాలి వినోద్

RELATED ARTICLES

Most Popular

న్యూస్