బాబ్బాబూ!
కోనోకార్పస్ మొక్కలమీద త్వరగా ఏదో ఒకటి తేల్చండి నాయనా!
మా అపార్ట్ మెంట్లో గోడ చుట్టూ పచ్చటి ప్రకృతి గోడగా ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన కోనోకార్పస్ ను కూకటివేళ్లతో పెకలించి…అవతల పారేయడానికి ప్రత్యేక అత్యవసర సర్వసభ్య సమావేశం పెట్టుకున్నాము. సోషల్ మీడియాలో వాట్సాప్ సర్వజ్ఞసింగ పండితులు అశాస్త్రీయంగా చెప్పిన అనేక విషయాలమీద సశాస్త్రీయంగా చర్చించాము. కోనోకార్పస్ చెట్ల నరికివేతకు ప్రభుత్వ అనుమతి తీసుకుని…లక్షలు ఖర్చు పెట్టి తీసి పారేశాము.
అంతెత్తున ఆ చెట్లు ఉన్నన్ని రోజులూ…
కొందరికి ఊపిరాడలేదు. కొందరికి మెతుకు మింగుడు పడలేదు. కొందరు ఆక్సిజన్ ను వదిలి కార్బన్ డై ఆక్సయిడ్ ను పీల్చుకున్నారు. కొందరు పసి పిల్లలను బయటికి పంపడానికి భయపడ్డారు. కొందరు వాటిని చూడ్డానికే భయపడ్డారు. పచ్చటి కోనోకార్పస్ తెర తొలగింది. పక్కన కాంక్రీట్ బిల్డింగులు. పైన ఆకాశం.
Youtube : https://www.youtube.com/@dhatritvtelugu
Facebook : https://www.facebook.com/dhatritelugutv
Instagram: https://www.instagram.com/dhatritelugutv/
Twitter :https://x.com/Dhatri_Tv
ఒక్కసారిగా ఆక్సిజన్ పీల్చుకుంటున్న అనుభూతితో ప్రాణవాయువుకు ఊపిరులూదినట్లు ఏదో తెలియని పరవశం పచ్చటి మా లాన్లో పదిలంగా పరచుకుంది. అంతంత చెట్లు పోతే పోయాయి…ఇప్పుడు కంటికి ఎడారిలా…శూన్యంలా ఉన్నా…ప్రాణానికి ఏదో తెలియని భరోసా దొరికినట్లయ్యింది.
…అలా కోనోకార్పస్ రహిత ప్రదేశంలో హాయిగా గుండెలమీద చేయేసుకుని నిద్రపోతున్న వేళ…ఈ వృక్షశాస్త్రవేత్తలేమిటి ఇలా మా నెత్తిన పిడుగు వేశారు! కోనోకార్పస్ ఆక్సిజన్ తీసుకుని…కార్బన్ డై ఆక్సయిడ్ వదలడం అబద్ధమని; మిగతా చెట్లకంటే కోనోకార్పస్సే ఆక్సిజన్ ను ఎక్కువగా విడుదల చేస్తుందని; ఆ చెట్లు ఎంతమాత్రం ప్రాణాపాయం కాదని ప్రయోగశాలలో రుజువైన శాస్త్రీయ ఆధారాలతో చెబుతున్నారు!
ఇప్పుడు మేము వాట్సాప్ మిథ్యా యూనివర్సిటీ మేధావులను నమ్మి కూకటివేళ్ళతో కోనోకార్పస్ చెట్లను పెకలించినందుకు బాధపడాలా? శాస్త్రీయంగా నిజమేమిటో కనుక్కోకుండా…అన్ని చెట్లకంటే ఎక్కువ ఆక్సిజన్ ఇచ్చే చెట్లను చేతులారా నరుక్కున్నామే! అని బాధపడాలా?
ఆత్రేయ చెప్పినట్లు-
“ఉన్నది వదిలేవు…లేనిది కోరేవు…” అని ఏడవాలా?
అయినా ముత్యాలముగ్గులో రావుగోపాలరావుచేత ముళ్ళపూడి చెప్పించినట్లు-
“ఆ ముక్క ముందు చెప్పాలి కదా!”
తెలంగాణ అసెంబ్లీలో స్పీకర్ మొదలు అందరూ కానోకార్పస్ మీద విరుచుకుపడి…అందరూ ఆ చెట్లను నరికి…నేలలను చదును చేసిన తరువాత…ఇప్పుడు చెబుతారా!
తూచ్…మేమొప్పుకోము!!
హైదరాబాద్ కంచలో వందెకరాల చెట్ల పునర్వికాసం మీద సుప్రీం కోర్టు చాలా తీవ్రస్వరంతో హెచ్చరికలు చేసింది. అదే నోటితో కానోకార్పస్ మీద కూడా ఎవరైనా చెప్పిస్తే బాగుణ్ణు. కనీసం మిగిలినవైనా బతికిపోతాయి!
శాస్త్రీయ వివరణ:-
ఈ చెట్లు మిగతా మొక్కలన్నిటి కంటే అత్యధిక కార్బన్ డై ఆక్సైడ్‌ను తీసుకొని.. అత్యధిక ఆక్సిజన్‌ను అందిస్తున్నట్లు పరిశోధనలో తేలిందని; ఈ చెట్ల ఆకులు తింటే ఒంట్లో చక్కెర శాతం, గొంతులో ఇన్ఫెక్షన్ తగ్గుతుందని పరిశోధనల్లో తేలిందని; ప్రభుత్వం కోనోకార్పస్ చెట్లను నరికితే సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తామని ప్రముఖ వృక్ష శాస్త్రవేత్త, యోగి వేమన విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఏఆర్ రెడ్డి బహిరంగంగా ప్రకటించారు.
కానోకార్పస్ చెట్ల మీద లేనిపోని భయాలు సృష్టించి అనవసరంగా చెట్లను నరికేస్తున్నారని, ప్రభుత్వం కలుగజేసుకుని చెట్లను కాపాడాలని తెలంగాణా రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు గూడూరు లక్ష్మీ నరసింహారెడ్డి కూడా కోరుతున్నారు.
Youtube : https://www.youtube.com/@MahathiBhakthi
Facebook : https://www.facebook.com/mahathibhakthi
Instagram: https://www.instagram.com/mahathibhakthi/
Twitter : https://x.com/Dhatri_Tv
ఇప్పటికైనా ప్రభుత్వం చొరవతీసుకుని శాస్త్రీయంగా పరీక్షలు జరిపి…నిజాలేమిటో అధికారికంగా ప్రకటించకపోతే…అసలు యూనివర్సిటీల నిజమైన శాస్త్రవేత్తలకంటే వాట్సాప్ యూనివర్సిటీల నకిలీ శాస్త్రవేత్తలదే పైచేయి అవుతుంది. ప్రాణవాయువునిచ్చే పచ్చని చెట్లను కొట్టేసుకుని…ప్రాణవాయువుకోసం పరితపించడం ఎవరికీ మంచిది కాదు.
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు