భారత – అమెరికా సంబంధాల్లో కొత్త శకం ప్రారంభం కాబోతోంది. భారత్‌లో అమెరికా రాయబారిగా లాస్ఏంజెల్స్ మాజీ మేయర్‌, అధ్యక్షుడు జో బైడెన్‌ సన్నిహితుడైన ఎరిక్‌ గార్సెట్టీ ప్రమాణం చేశారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య జరగిన కార్యక్రమంలో ఆయనతో ఉపాధ్యక్షురాలు కమలా హారీస్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ నెల 16న ఆయన నామినేషన్‌కు సెనెట్‌ 52-42 మెజార్టీతో ఆమోదించిన విషయం తెలిసిందే. అయితే గార్సెట్టీని 2021 జులై 9న అధ్యక్షుడు జో బైడెన్ భారత రాయబారిగా నియమించారు. కానీ సెనెట్ ఆమోదం పొందడానికి 20 నెలల సమయం పట్టింది. రెండేళ్లకు పైగా ఖాళీగా ఉన్న భారత్ లో అమెరికా రాయబారి పదవిని ఎరిక్‌ గార్సెట్టీతో భర్తీ చేయటం ఇండియాకు లబ్ది చేకూరుస్తుంది అనటంలో అనుమానం లేదు. యూదు జాతీయుడైన ఎరిక్‌ రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి.

డెమొక్రటిక్ పార్టీకి చెందిన గార్సెట్టీ అధ్యక్షుడు బైడెన్‌కు అత్యంత విశ్వాసపాత్రుడు. బైడెన్ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఆయన కీలక పాత్ర పోషించారు. గార్సెట్టీ అమెరికా నేవీలో అధికారిగా 12 ఏళ్లపాటు పని చేశారు. 2013లో లాస్ఏంజెల్స్ మేయర్‌గా ఎన్నికయ్యారు. దీంతో లాస్ఏంజెల్స్ వందేళ్ల చరిత్రలో ఈ పదవిని చేపట్టిన అతి పిన్న వయస్కుడిగా, తొలి యూదు జాతీయుడిగా ఎరిక్ చరిత్రలో నిలిచారు. తొమ్మిదేళ్లపాటు ఆయన మేయర్‌గా పని చేశారు.

గార్సెట్టీ కీలక సహాయకుడైన రిక్ జాకబ్స్‌పై 2020లో ఓ కేసు నమోదైంది. జాకబ్స్ తనను అనుచితంగా తాకారని, లైంగికంగా వేధించారని గార్సెట్టీ బాడీగార్డ్‌ అయిన మాథ్యూ గాజ్రా ఆరోపించారు. దీంతో జాకబ్స్ తన విధుల నుంచి తప్పుకున్నారు. జాకబ్స్ ఇలా చేసిన విషయం తనకు తెలీదని గార్సెట్టీ చెప్పుకొచ్చారు. అయితే విషయం ఆయనకు తెలిసినప్పటికీ.. చర్యలు తీసుకోలేదని లేదని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ వివాదం కారణంగానే గార్సెట్టీకి బైడెన్‌ కేబినెట్ పదవి దక్కకుండా పోయింది.

భారత రాయబారిగా గార్సెట్టీ నియామకానికి గతేడాది జనవరిలోనే సెనేట్ విదేశీ వ్యవహారాల కమిటీ ఆమోదం తెలిపింది. కానీ జాకబ్స్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అమెరికా సెనెటర్ చక్ గ్రాస్లీ ఈ నిర్ణయాన్ని నిలిపి ఉంచారు. దీంతో ఏకగ్రీవంగా గార్సెట్టీ నియామకానికి వీల్లేకుండాపోయింది. రిపబ్లికన్లు సైతం ఆయన నామినేషన్‌ను వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో గార్సెట్టీ ప్రాథమిక నామినేషన్ తప్పిపోగా.. బైడెన్ ఈ ఏడాది ఆరంభంలో మరోసారి నామినేట్ చేయాల్సి వచ్చింది.

రెండేళ్లకుపైగా సుదీర్ఘ విరామం తర్వాత భారత్‌లో తన రాయబారిని అమెరికా నియమించింది. ఇంత కాలంపాటు ఢిల్లీలో రాయబారిని నియమించకపోవడం ఇదే తొలిసారి. 1993లో 14 నెలలపాటు అమెరికా ఢిల్లీలో తన రాయబారిని నియమించలేదు. అప్పట్లో ఏడాది కంటే తక్కువ కాలమే భారత రాయబారిగా పని చేసిన థామస్ పికెరింగ్‌ను మాస్కోకు బదిలీ చేశాక.. క్లింటన్ ప్రభుత్వం తదుపరి రాయబారిని నామినేట్ చేయడానికి సమయం తీసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *