Friday, October 18, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంవెంటాడే నాటకం

వెంటాడే నాటకం

Masterpiece: నాటకం ఒక సమాహార కళ. సంగీతం, సాహిత్యం, నటన, సెట్లు, లైట్లు, సన్నివేశానికి సన్నివేశానికి మధ్యలో మార్చాల్సిన బ్యాక్ గ్రవుండ్లు, సెట్ ప్రాపర్టీస్…ఇలా ఎన్నెన్నో కలగలిస్తే నాటకం. సినిమాలో టేకుల మీద టేకులు కేకుల్లా తింటూ నిర్మాతలను అప్పుడల్లా నమిలి మింగేయడానికి ఆస్కారముంటుంది. నాటకంలో అంతా ప్రత్యక్ష ప్రసారం. ఆ క్షణం అలా జరిగిపోవాలి. అంతంత పద్యాలు, సుదీర్ఘ సమాస పదబంధుర డైలాగ్ లు గుర్తుంచుకుని రాగయుక్తంగా, భావయుక్తంగా పాడాలి. పలకాలి. అభినయించాలి. పాత్రకు జీవం పోసి రక్తి కట్టించాలి. అందుకే “కావ్యేషు నాటకం రమ్యం” అని కావ్యాల్లో నాటకమే గొప్పదని తేల్చి చెప్పారు.

గుంటూరులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న నాటకపోటీల్లో “ఎర్ర కలువ” నాటకం నన్ను వెంటాడుతోంది.  హైదరాబాద్ శ్రీ కళా నికేతన్ వారు ప్రదర్శించిన ఈ నాటకం రచన- ఆకురాతి భాస్కర చంద్ర; దర్శకత్వం- డా. వెంకట్ గోవాడ; గానం- విద్యాసాగర్.

సంగ్రహంగా కథ:-
దేశభక్తుడు, సిపాయి మంగళ్ పాండేను ఉరి తీసిన సందర్భం.
బ్రిటీషు వారి దగ్గర ఒక సంప్రదాయ బ్రాహ్మణుడు టెలిఫోన్ నెట్ వర్క్ ను ఏర్పాటు చేసే టెలికమ్యూనికేషన్స్ ఉన్నతోద్యోగిగా పనిచేస్తూ ఉంటాడు. బ్రిటీషువారు నిర్మిస్తున్న రైల్వే లైన్లు, టెలిఫోన్ వ్యవస్థల వల్ల భారతీయులకు ఎంతో ఉపయోగం అని అతను వాదిస్తూ ఉంటాడు. ఇంట్లో భార్యతోపాటు బంధువులు అందరు బ్రిటీషువారిని గుడ్డిగా నమ్మద్దు అని చెప్తూ ఉంటారు. అతని ఇంట్లో పనిమనుషులు రహస్యంగా బ్రిటీషువారికి వ్యతిరేకంగా పని చేస్తూ ఉంటారు.

చివరికి అతడిని అనుమానించిన బ్రిటీషు పోలీసులు అతడి ఇంట్లోనే తుపాకీతో కాల్చి చంపేస్తారు. భార్య ఒడిలో కన్ను మూస్తూ…దేశం కోసం అతడు కన్న కలల గురించి చెప్పే మాటలు మరణవాంగ్మూలం అవుతాయి. బ్రిటీషువారి కమ్యూనికేషన్ వ్యవస్థతో బ్రిటీషువారిపైనే ఎలా గెలవదలుచుకున్నాడో చెప్పే మాటలు కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తాయి. బ్రిటీషువారి రైల్వేలు, ఇతర రవాణా సదుపాయాలతో వృత్తులు కోల్పోయినవారు ఉద్యమం బాట పడతారు.

ఈ నాటకంలో సన్నివేశాలు మారే ఒకటి, రెండు నిముషాల వ్యవధిలో ఆ కథా సన్నివేశానికి సంబంధించిన పాటలను ప్రవేశపెట్టడం చాలా బాగుంది. చక్కటి యతి, ప్రాసలతో అర్థవంతంగా ఉన్న ఈ పాటలను నూజివీడు త్రిబుల్ ఐ టీ లో మ్యూజిక్ టీచర్ గా పనిచేస్తున్న శ్రీకాకుళం యువకుడు విద్యాసాగర్ హృదయం ద్రవించేలా గొప్పగా పాడాడు. లోపల హల్ ప్రేక్షకులతో నిండిపోతే…బయట ఎల్ ఈ డి స్క్రీన్ ముందు కూడా కూర్చుని కనురెప్ప వేయకుండా చూసి ప్రేక్షకులు మైమరచిపోయారు.

ఆ పాటలే నన్ను వెంటాడుతున్నాయి. ఆ పాటలు పాడిన గాయకుడు విద్యాసాగర్ ను నాటకమయిన వెంటనే కలిసి…కౌగలించుకుని…అభినందించాను. అతను పొంగిపోయాడు.

ఇలాంటి ఎన్నెన్ని ఎర్ర కలువలు వికసించి…గుర్తింపు లేకుండా వాడిపోయాయో! వికసించడానికి ముందే కొలనుల్లో కుచించుకుపోయాయో!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

RELATED ARTICLES

Most Popular

న్యూస్