ఉమ్మడి రాష్ట్రంలో ప్రత్యేక అస్థిత్వం కోసం ఆరాటపడిన తెలంగాణ, రాష్ట్ర సాధన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు నాయకత్వంలో పునర్ నిర్మాణ ఎజెండాను సిద్దం చేసుకుంది. దశాబ్దాల పాటు నిర్లక్ష్యానికి గురైన తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చుకునేందకు నడుం కట్టింది. సంక్షేమం, అభివృద్ది పథకాలకు తోడుగా రాష్ట్రాన్ని అత్యంత నివాసయోగ్యమైన పచ్చని ప్రాంతంగా మార్చాలని ముఖ్యమంత్రి తలచారు. ఆ ఆలోచనల్లోంచి పుట్టిందే తెలంగాణకు హరితహారం.
రాష్ట్రం ఏర్పాటైన తొలినాళ్లలోనే తీసుకున్న అత్యంత ప్రాధాన్యతా పథకాల్లో తెలంగాణకు హరితహారం ఒకటి. మన వారసులకు, రానున్న తరాలకు ఆస్తులు పంచడం కన్నా స్వచ్చమైన గాలిని, నివాస యోగ్యమైన పచ్చని ప్రకృతి పరిసరాలను అందించాలనే గొప్ప సంకల్పమే హరితహారానికి పునాది. ఇలా ఆలోచించటంతో పాటు, ఆ దిశగా ప్రజలను ఒక సామాజిక కార్యక్రమంలో పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావుకి దక్కింది.
తాను నమ్మిన ప్రకృతి పునరుజ్జీవనాన్ని తెలంగాణ సమాజంలో ప్రతీ మదికీ ఎక్కేలా చేయటంలో ముఖ్యమంత్రి సఫలం అయ్యారు. ఆ కృషి, పట్టుదల ఫలితాలే దశాబ్ది తెలంగాణలో మన కళ్ల ముందు ఆకు పచ్చగా పరుచుకున్నాయి. ఇన్నేళ్లుగా నాటిన మొక్కలు చెట్లుగా మారి ఆక్సీజన్ తో పాటు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. హరిత తెలంగాణ సాధనలో ప్రభుత్వ సంకల్పం, ప్రజల భాగస్వామ్యమే పచ్చని విజయానికి సాక్షిగా నిలిచింది. ఇలా రాష్ట్రమంతటా పచ్చదనం వెల్లివిరియాలంటే తెలంగాణకు హరితహారం నిరంతర ప్రక్రియలా కొనసాగాలి. మొక్కలు నాటడం, వాటి సంరక్షణ మన జీవన విధానంలో భాగం కావాలి.