పాట ఒక ప్రవాహం.
అది గంగ పొంగులా ప్రవహిస్తూ ఉండాలి. ఆ పొంగు ప్రవాహం తెలిసి రాసేవారు ఇప్పుడున్నారా?
పాట ఒక రచనా శిల్పం.
యతి ప్రాసలు, ధ్వనులు, శ్లేషలు, అలంకారాలతో ప్రతి పాటను అందమయిన శిల్పంగా తీర్చిదిద్దే గేయ శిల్పులు ఇప్పుడున్నారా?
పాట ఒక సందేశం.
మాటల మధ్య మాటలు మోయలేనంత భావాన్ని దట్టించి, ఒక్కొక్క మాటలో ఒక్కో గ్రంథమంత సందేశాన్ని నింపేవారు ఇప్పుడున్నారా?
పాట ఒక సంగీతం.
వెంట వస్తుంది. మళ్లీ మళ్లీ వినాలనిపించేలా వీనుల విందు అవుతుంది. ఆ సంగీత స్వరాక్షరాల్లోకి ఒదిగేలా అక్షరాలను కూర్చడం ఒక కళ. అది చివరి ప్రాస అక్షరాన్ని ముందు రాసి…తరువాత అక్షరాలను పేర్చుకుంటూ పొతే వచ్చే నీచ ప్రాసల ప్రహసన విద్య కాదు. ఒకే మాటకు అనేకానేక పదాలు వెంటపడి మమ్మల్ని వాడుకో అని రచయితను మొహమాటపెట్టే పద సంపద సముద్రాన్ని ఔపోసన పట్టిన సిద్ధ విద్య. సాధ్య విద్య. ఇలాంటి సిద్ధ, సాధ్య విద్యలతో పాటలు రాసేవారు ఇప్పుడున్నారా?
పాట ఒక ధర్మం.
ఒక దేశానికి తనదయిన సంస్కృతి, ఆచార వ్యవహారాలు, వారసత్వం, విలువలు, ఆదర్శాలు ఉంటాయి. కాలపరీక్షలో అవి నిలిచి ఉంటాయి. అవి ఒక ధర్మంగా రూపుదిద్దుకుంటాయి. సమాజం పాటించి తీరాల్సిన ధర్మంగా వాటిని పాటల్లో ప్రతిఫలింపచేయడం ఒక తపస్సు. ఇలా తపస్సుగా పాటలు రాసేవారు ఇప్పుడున్నారా?
పాట ఒక భాష.
మాట్లాడేదంతా భాషే. రాసేదంతా భాషే. శ్లోకంలో, పద్యంలో, పాటలో, జానపదంలో, కవితలో, వచనంలో, చివరికి మాటగా బయటికి పలకకకుండా లోలోపల అనుకున్నా…అంతా భాషే. ప్రతి భాషకు దాని సొంత వ్యక్తీకరణ పద్ధతి, ఉచ్చారణ, నుడికారాలు ఉంటాయి. మాట్లాడుతున్నంత సహజంగా పాట రాయడం కుదరదు. ఆ రాస్తున్న పాటలో అలవోకగా నుడికారపు అందచందాలను పట్టి అలంకరించడం ఇంకా కష్టం. ఇలా మాటను పాటగా చేసి, ఆ పాటలో పదహారణాల తెలుగుకు పట్టం కట్టేవారు ఇప్పుడున్నారా?
పాట ఒక ఓదార్పు.
తెగిన రెక్కలకు పాట తన చరణాలతో కొత్త రెక్కలు తొడుగుతుంది. కొడిగట్టిన దీపం ప్రమిదలో చమురుపోసి మళ్లీ దీపాన్ని వెలిగించి కొత్త వెలుగులు పంచుతుంది. అలుముకున్న చీకట్లలో చిరువెలుగులు తెస్తుంది. కాళ్లు తెగిపడుతున్నా నడిచే సత్తువను కూడగడుతుంది. భుజం తట్టి ప్రోత్సహిస్తుంది. వెన్ను తట్టి నిలబెడుతుంది. కర్తవ్యం బోధిస్తుంది. కొత్తదారులు చూపూతుంది. ఇలా పాటకొక పరమ ప్రయోజనం ఉందని తెలిసి పరమ ప్రమాణాలతో పాట రాసేవారు ఇప్పుడున్నారా?
పాట భాషకు ఒక సోపానం.
ఇప్పుడొస్తున్న తెలుగు పాటలో తెలుగు వెతుక్కోవడం ఎలా అని కొందరికి నిర్వేదం.
పాట ఒక చర్చ.
పాటల్లో ప్రయోగించిన మాటల మీద గంటలు గంటలు మాట్లాడుకుంటూ…అర్థాన్వయాలను విడమరచి చెప్పుకుంటూ…అలౌకిక ఆనందాలు పొందే ఘడియలు ఇప్పుడున్నాయా?
పాట ఒక సందర్భం.
వృక్షాల్లేని చోట…ఆముద వృక్షమే మహా వృక్షంగా అంగీకరించాల్సి వస్తుందన్న కొందరు తెలుగు భాషాభిమానుల నిర్వేదాన్ని పోగొట్టే సందర్భాలు వస్తాయా?
“శ్మశానాలవంటి నిఘంటువులు దాటి, వ్యాకరణాల సంకెళ్లు విడిచి…”
అన్న మహాకవి శ్రీ శ్రీ చెవుల్లో తెలుగు గీతాల కల్కి ‘నిధన’ నిఘంటు నినాదాలు వినపడితే ఏమవుతుందో!
ఏమవుతుంది?
ఏమీ కాదు.
పాటల పూదోటల పాదుల్లో గ్రోమోర్ ఎరువుగా ‘నిధన’ పదాలు ‘ప్రక్షాళించడాన్ని’ కళ్లారా చూసి…ప్రమోదిస్తాడు. ప్రహర్షిస్తాడు. పరమ ‘పదం’ ఇదేనని పరమోత్సాహంగా ప్రహ్లాదిస్తాడు!
నిదానంగా అయినా నిఘంటు విధి విధానాలను పట్టుకుని… అప్పటికీ అర్థం కాకపొతే విశ్వనాథలాంటివారిని వెతికి పట్టుకుని…అడిగి… ‘నిధనాలను’ అర్థం చేసుకుని…నిధనమైన నిఘంటువుల శ్మశానాలు దాటి…ఇష్టం లేకపోయినా…
“స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః” అన్న భగవద్గీత శ్లోకం పాడుకుంటూ…జనజీవన, నిజజీవన పద స్రవంతిలోకి వచ్చేస్తాడు. రాకతప్పదు. మరో మార్గం కూడా ఉండదుగాక ఉండదు!
“ఈ పదములె చాలు రామ రామా!
‘నిధన’పద ధూళులే పదివేలు!”
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు