Saturday, June 29, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంచూడు చూడు అమెరికా-1

చూడు చూడు అమెరికా-1

జీవితం సప్తసాగర గీతం వెలుగునీడల వేదం
సాగనీ పయనం కల ఇల కౌగిలించే చోట..
కల ఇల కౌగిలించే చోట

ఏది భువనం? ఏది గగనం? తారా తోరణం…
ఈ చికాగో సిరిసీ టవరే స్వర్గ సోపానమూ..

ఏది సత్యం? ఏది స్వప్నం? డిస్ని జగతీలో…
ఏది నిజమో! ఏది మాయో! తెలీయనీ లోకమూ..

చేతనాత్మాక శిల్పం
మతి కృతి పల్లవించే చోట…
మతి కృతి పల్లవించే చోట…

ఆ లిబర్టీ శిల్ప శిలలలో
స్వేచ్చా జ్యోతులూ..
ఐక్య రాజ్య సమితిలోనా కలిసే జాతులూ

కృషి ఖుషి సంగమించే చోట..”
అన్న వేటూరి గీతాసారాన్ని మననం చేసుకుంటూ ఒక తెలుగు జర్నలిస్ట్ అమెరికాలో తిరుగుతున్నప్పటి కొన్ని సంగతులివి:-

డబ్బు మంచి నీళ్ల ప్రాయం

అమెరికాలో తాగేనీళ్లు చాలా కాస్ట్లీ. ఇంట్లో …బయట అందరూ వాటర్ బాటిల్ కొని తాగుతారు. ఒక లీటర్ బాటిల్ నాలుగు డాలర్లు. అర లీటరు బాటిల్ రెండు డాలర్లు. అంటే అమెరికాలో ఒక లీటరు బాటిల్ మన కరెన్సీలో 320 రూపాయలు. సింగిల్ బాటిల్ అమ్మరు. కనీసం అర డజన్ లేదా డజన్ తీసుకోవాలి. అమెరికాలో స్టోర్స్ లో మాత్రమే ఈ రేట్లు. రెస్టారెంట్లు… ఫైవ్ స్టార్ హోటల్లో ఇదే బాటిల్ 500 రూపాయలు వరకు వేస్తారు. అందుకే ఇంటి నుంచి బయలు దేరే ముందు కారులో పది వాటర్ బాటిల్స్ పెట్టుకుంటారు. ఇండియాలో లీటర్ బాటిల్ కొంటే ఇరవై రూపాయలు మాత్రమే. ఇక మామూలు బ్రేక్ ఫాస్ట్, లంచ్ ..డిన్నర్ బయట చేయాలంటే కనీసం 15 నుంచి 30 డాలర్లు 2500 రూపాయలు అవుతుంది.

కళ్లు తిరిగే కారు పార్కింగ్ ఫీజు

అమెరికాలో కారు పార్కింగ్ అతిపెద్ద సమస్య. ఇంటి నుంచి బయటికి వెళితే జేబుకు చిల్లే. న్యూయార్క్, Washington లాంటి సిటీలకు వెళితే పార్కింగ్ కోసం కిలోమీటర్ల దూరం వెళ్ళాలి. ఎక్కడపడితే అక్కడ పార్కింగ్ పెట్టడానికి వీల్లేదు. గంటకు ఇరవై డాలర్లు కారు పార్కింగ్ ఫీజు ఉంటది. రోజంతా పార్కింగ్ చేస్తే 60 డాలర్ల దాకా ఉంటుంది. అంటే ఐదు వేల రూపాయలు కేవలం పార్కింగ్ కోసమే అవుతుంది. న్యూయార్క్ లో ఒక రాత్రి కారు పార్కింగ్ కోసం 70 డాలర్లు అంటే 6 వేలు పే చేశాం. రోడ్డు వెంట కూడా వెహికిల్ పార్కింగ్ చేయడానికి… హైవే పై ఆపడానికి కుదరదు. పార్కింగ్ కోసం ప్రత్యేకంగా స్థలాలు ఉంటాయి. అమెరికాలో లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్. మనం అక్కడ డ్రైవ్ చేయాలంటే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అమెరికాలో పబ్లిక్ రవాణా తక్కువ.

కన్వెన్షన్లు.. హోటళ్ళు

అమెరికాలో కన్వెన్షన్ సెంటర్లు వందల ఎకరాల్లో ఉంటాయి. వేలమంది సమావేశాలకు హాజరయ్యేందుకు వీలుగా ఏసీ హాల్స్ ఉంటాయి. మనలాగా పార్టీ సమావేశాలు… సదస్సులు… మీటింగ్స్ బహిరంగ ప్రదేశాల్లో పెట్టరు. ఈ హాల్స్ తిరగాలంటే కిలోమీటర్ల కొద్దీ నడవాలి. లేదంటే ఎలక్ట్రిక్ కార్లు తీసుకోవాలి. కన్వెన్షన్ లకు ఆనుకుని పెద్ద పెద్ద ఫైవ్ హోటల్స్ … టవర్స్ ఉంటాయి. ఒక్కో హోటల్లో వెయ్యి… రెండు వేల రూమ్లు ఉంటాయి. ఒక్కో రూం కనీసం 20 వేలు ఉంటుంది.

చికెన్

చికెన్ కిలో వెయ్యి రూపాయలు. హలాల్ చేసిన స్టోర్ లు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. మనలాగా చికెన్ షాప్ వెళ్లి కిలో చికెన్ ఇవ్వమని అడగరు. కనీసం పది.. పదిహేను రకాల చికెన్ అందుబాటులో ఉంటాయి. చికెన్ స్ట్రిప్, చికెన్ బ్రెస్ట్, చికెన్ కౌష , చికెన్ హోల్…ఇలా … ఎలాంటి చికెన్ కావాలో ప్రత్యేకంగా ప్యాక్ చేసి ఉంటాయి. ఏది కావాలో అది తీసుకోవాలి. ఫ్రెష్ కూరగాయల కంటే చికెన్ ధర తక్కువ. చికెన్ కంటే టమోటో ధర ఎక్కువ.

ఫామ్ లాండ్

అమెరికాలో కొన్ని చోట్ల ఫామ్ లాండ్ తక్కువకు దొరుకుతాయి. యాబై వేల రూపాయలకే ఎకరం పొలం వస్తుంది. ఐతే వ్యవసాయ పొలాలు రిమోట్ ఏరియాలో ఉంటాయి. ఒక ఎకరా రెండు ఎకరాలు ఉండవు. వంద… రెండు వందలు.. ఎకరాలు అమ్మకానికి ఉంటాయి. అమెరికాలో వ్యవసాయానికి సబ్సిడీ చాలా ఎక్కువ ఉంటుంది. ఏరియా ను బట్టి ధర ఉంటుంది.

హార్వర్డ్ యూనివర్శిటీ

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యూనివర్శిటీ. అమెరికా లోని Massachusetts రాష్ట్రంలో బోస్టన్ దగ్గర కేంబ్రిడ్జ్ అనే ప్రాంతంలో ఉంది. టీచింగ్, పరిశోధన కు పెట్టింది పేరు. రెండు వందల ఏళ్ల చరిత్ర ఈ యునివర్సిటీ సొంతం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని వర్గాల వాళ్ళు ఇందులో చదువుకునే అవకాశం ఉంది. ఎంతో మంది నోబెల్ ప్రైజ్ గ్రహీతలు ఇక్కడి విద్యార్థులే. అమెరికా అధ్యక్షుడు ఒబామా లాంటి వాళ్ళు కూడా ఇందులో చదువుకున్నారు. సముద్ర ఒడ్డున చిన్న బిల్డింగ్ లో మొదలై బిజినెస్ , సైన్స్ , రీసెర్చ్ రంగాలుగా వందల ఎకరాల్లో విస్తరించి ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ హార్వర్డ్ వర్సిటీకి అదే క్రేజ్. ఇక్కడ అడ్మిషన్ వస్తే చాలు అనుకుంటారు ఇప్పటికి కూడా.

(రెండో భాగం రేపు)

-సోమగోపాల్ కడిమెట్ల
99483 75129

RELATED ARTICLES

Most Popular

న్యూస్