Everyday Has To Be A No Tobacco Day :
మనకు అన్నిటికీ రోజులున్నాయి. ఇన్నాళ్లూ అవి ఒక రోజుకే పరిమితం.
‘నో టొబాకో డే ‘ మాత్రం ఒకింత ప్రత్యేకం. కరోనా కాలం పొగరాయుళ్లకు పోయేకాలం అవనుందని ప్రపంచ ఆరోగ్యసంస్థ మొత్తుకుంటున్న నేపథ్యంలో అనేక దేశాలతో కలసి సంవత్సరం పాటు ‘కమిట్ టు క్విట్ టొబాకో’ కార్యక్రమాలు నిర్వహించాలనుకోవడం విశేషం.
రింగులు రింగులుగా పొగవదులుతూ తన్మయత్వం చెందే పొగరాయుళ్లని ప్రధానంగా మార్చడమే ఈ ఏడాది డ్రైవ్ లక్ష్యం.
మామూలుగానే హడలెత్తించే కరోనాకు పొగతాగే వారిపై ప్రేమ మరింత ఎక్కువట (40-50 శాతం)
నమ్మొచ్చా ?
దేన్నయినా తద్దినంలా ఒకరోజుకే పరిమితం చేయడం మనకి అలవాటు. మరోపక్క పొగ తాగడాన్ని అద్భుత ఆనంద మకరంద సూత్రంలా కన్నుల కింపుగా చూపించే ప్రకటనదారులు, వారిద్వారా వచ్చే ఆదాయం.. ఇవన్నీ చూసుకుంటే ఎన్నేళ్లు ఎన్ని డ్రైవులు చేసినా ఒరిగేదేంటి అనిపించడం సహజం.
మాస్కు పెట్టుకుంటే బతికిపోతారని బతిమాలుతున్నా లొంగని కఠినాత్ములు పొగతాగితే కరోనా వస్తుందంటే మాత్రం మారిపోతారా?
అయితే ‘పొగాకు వదిలేద్దాం’ కార్యక్రమంలో భాగంగా యువత భాగస్వామ్యం, ప్రభుత్వ విధానాల్లో మార్పులు,ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ, ప్రత్యేక క్లినిక్ లు, నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ, సోషల్ మీడియా ద్వారా సలహాలు…ఇలా ఆరు నెలల్లో 100 కోట్ల మందిని మార్చాలని ప్రపంచ ఆరోగ్యసంస్థ ఆశయం.
మంచిదే. ఊపిరి ఆగిపోతున్నవేళ పొగతో ఉక్కిరిబిక్కిరి కాకుండా ప్రతిరోజూ నో టొబాకో డే కావాలని కోరుకుందాం.
-కె. శోభశ్రీ