ఓహో! నైపుణ్యాభివృద్ధికి ఉపయోగపడే బెట్టింగ్ యాప్ లకే ప్రచారం చేస్తున్నారా? అరెరే! ఈ పోలీసు సజ్జాన్నారులేమిటి ఇలా అపార్థం చేసుకుంటున్నారు? స్కిల్ డెవెలప్ మెంట్ కోసం ప్రభుత్వాధినేతలు కాలికి బలపం కట్టుకుని అతిశీతల స్విస్ ఆల్ఫ్స్ పర్వత దావోస్ దాకా ఎక్కే విమానం- దిగే విమానంలా తిరుగుతుంటే…చూడలేక…స్కిల్ డెవెలప్ మెంట్ ఇంత సులభంగా వచ్చే బెట్టింగ్ యాపులకు ప్రచారకర్తలుగా ఉన్నారు తప్ప…ఇందులో మరో దురుద్దేశం లేనే లేదు!
పుట్టుకతో ఎవరికీ ఎందులోనూ నైపుణ్యం రాదు. ఓపికగా నేర్చుకోవాలి. నేర్చుకున్నది మరచిపోకుండా రోజూ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసింది ప్రపంచానికి చూపించాలి. ఇదంతా ఒక దీపం మరొక దీపాన్ని వెలిగించినట్లు జ్ఞానాన్ని జ్ఞానం లేనివారికి ప్రవహింపజేయడం, లేదా ప్రసాదించడం లాంటిది.
స్కిల్ డెవెలప్ కు ఉపకరించే బెట్టింగ్ యాపులకే తమ హీరో ప్రచారం చేస్తున్నారు- అది కూడా చట్టం అనుమతించినవే- అనే అర్థం వచ్చేలా ఒకానొక హీరో పబ్లిక్ రిలేషన్స్ టీం పబ్లిగ్గా సోషల్ మీడియాలో వివరణ ఇచ్చి లోకంలో ఎందరికో కనువిప్పు కలిగించింది. ముఖ్యమంత్రి అసెంబ్లీలో చేసిన ఒకానొక ప్రకటన మీద వెంటనే కౌంటర్ గా ప్రెస్ మీట్ పెట్టి అల్లు అర్జున్ వివరణ ఇవ్వాలని ఆయన పి ఆర్ టీమ్ సూచించిందో! లేక ఆయనే అనుకున్నారో! తెలియదు కానీ…ఇలాంటి సెల్ఫ్ గోల్స్ చేసిన గాయాల తరువాత కూడా సెలెబ్రిటీలు గుణపాఠాలు నేర్చుకోరు.
నిజమే. జూదం 64 కళల్లో ఒకటి. సప్తమహా వ్యసనాల్లో ఒకటి. రకరకాల విద్యల్లో జూదం ఒకటి అని మాత్రం ఎక్కడా చెప్పలేదు. జూదం ఆడడానికి చాలా నైపుణ్యం ఉండాలన్న విషయంలో మాత్రం మరో అభిప్రాయం ఉండాల్సిన పనిలేదు. కానీ…జూదంలో ఆధునిక నిరుద్యోగ భారతం కోరుకునే స్కిల్ డెవెలప్ మెంట్ ను దర్శించిన ఈ హీరో పి ఆర్ టీముకు ఈ యేటి అత్యుత్తమ ఉద్యోగ కల్పన, నైపుణ్యాభివృద్ధి ఐడియా అవార్డు ఏదన్నా ఒకటి సృష్టించి…ఇవ్వాలేమో!
వీరిప్రకారం ఇకపై ఉద్యోగాలకు ఇంటర్వ్యూ సందర్భాలు ఇలా ఉండవచ్చు!
ఇంటర్వ్యూ బోర్డు:-
మీ గురించి చెప్పండి!
నిరుద్యోగి:-
నేను డిగ్రీ మధ్యలో ఆపేశాను సార్. అప్పుడు మా ఫ్రెండ్ ఒకతను మన అభిమాన హీరో ప్రమోట్ చేసిన గేమింగ్ యాప్ ఉంది. దాన్ని డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేయి- అని దేవుడిలా నన్నాదుకున్నాడు. అది జూదమని నేను దూరంగా ఉండేవాడిని. మా అభిమాన దేవుడి తరపున దైవదూతగా మా ఫ్రెండ్ చెప్పాక అది స్కిల్ డెవెలప్ మెంట్ యాప్ గా, కోటి సూర్యుల వెలుగుగా నాకు దర్శనమిచ్చింది. రెండేళ్లలో ఆ యాప్ ద్వారా మా అమ్మానాన్న అప్పుచేసి ఇచ్చిన రెండు లక్షలు పోగొట్టుకున్నాను. పోతే పోయింది కానీ…నాలో స్కిల్ బాగా డెవెలప్ అయ్యింది. ఇప్పుడు రెండు చేతులతో రెండు ఫోన్లలో ఒకేసారి నాలుగు యాపుల్లో బెట్టింగ్ స్కిల్ ను ప్రదర్శించగలుగుతున్నాను. నాలో ఆత్మవిశ్వాసం పురులువిప్పి నాట్యం చేస్తోంది.
బోర్డు:-
ఇక చాలు. చెప్పక్కర్లేదు. యూ ఆర్ సెలెక్టెడ్. వెంటనే జాయిన్ అవ్వు. వెను వెంటనే పని మొదలుపెట్టు!
నిరుద్యోగి:-
సార్! ఇంతకూ నా ఉద్యోగం ఏమిటి?
బోర్డు:-
రోజుకు పదిమంది కొత్తవారిని చేర్చి…వారిని నీలాగా ఈ ఆన్ లైన్ బెట్టింగ్ స్కిల్ లో డెవెలప్ చేయడం.
నిరుద్యోగి:-
థాంక్ యూ సార్. రోజుకు మినిమమ్ వంద మందిని చేరుస్తా. నా స్కిల్ చూస్తారుగా…
(బోర్డు సభ్యులు స్పృహదప్పి పడగా…నిరుద్యోగి చల్లటి నీళ్ళు చల్లగా…లేచి నడిచే స్కిల్ కోసం దిక్కులు చూస్తున్నారు!)
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు