Facing The Bjp Without The Congress Is A Dream :
కూటమి ఎక్కడ ఉంది, మనుగడలో ఉందా అని తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి. మమత బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు దీటుగా స్పందించారు. కాంగ్రెస్ భాగస్వామ్యం లేకుండా ఎలాంటి కూటమి ఏర్పడినా జాతీయ స్థాయిలో బిజెపి ని నిలువరించటం అసాధ్యమని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. బిజెపితో పోరాటం చేసేందుకు కాంగ్రెస్ తో కలిసి వచ్చే పార్టీలకు స్వాగతమని, వేరు కుంపటి పెట్టుకుని బిజెపిని ఎదుర్కొంటామనే పార్టీలకు కూడా అభినందనలు తెలుపుతామని దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు. ఎవరికీ తోచిన విధంగా వారు నడుచుకునేందుకు ప్రజాస్వామ్యంలో అవకాశం ఉందని ఢిల్లీలో ఈ రోజు ఆయన అన్నారు. దేశంలో అన్ని పార్టీలు ఎదో ఒక సందర్భంలో బిజెపితో ఎన్నికల పొత్తులు, అధికారం పంచుకున్నాయని, కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమె బిజెపితో ఎలాంటి అవగాహన కుదుర్చుకోలేదని దిగ్విజయ్ సింగ్ గుర్తు చేశారు.
మత రాజకీయాలను ఎగదోస్తున్న బిజెపిని గద్దె దించేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంటే, కొన్ని పార్టీలు లోపాయికారిగా బిజెపికి సహకరిస్తున్నాయని రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లిఖార్జున ఖర్గే విమర్శించారు. రాహుల్ గాంధీ మీద మమత బెనర్జీ వ్యాఖ్యలు అక్షేపనీయమని ఖర్గే అన్నారు. దేశంలో ఎలాంటి సమస్య తలెత్తినా కాంగ్రెస్ పార్టీ మాత్రమె ప్రస్తావిస్తోందన్నారు. రాబోయే ఎన్నికల్లో విపక్ష పార్టీలు ఏకతాటి మీద నిలబడితేనే బిజెపి ఓటమి సాధ్యమని, లేదంటే మరోసారి బిజెపికి అవకాశం దక్కినట్టే అని ఖర్గే తేల్చి చెప్పారు.
యూపీఏ కూటమికి గుండె కాయ లాంటి కాంగ్రెస్ లేకుండా బిజెపిని గద్దె దింపటం సాధ్యం కాదని కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్ అనగా కాంగ్రెస్ సహకారం లేకుండా బిజెపిని ఎదుర్కోవటం ప్రస్తుత పరిస్థితుల్లో పగటికలగా చెప్పవచ్చని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ పేర్కొన్నారు.
Also Read : ప్రాంతీయ పార్టీలతో బిజెపికి గడ్డు కాలమే