Family Counselling :
ఈ పరిస్థితి ఎన్నాళ్ళు?
Q.నాకు 31 సంవత్సరాలు. పెళ్లి కాలేదు. అన్నయ్యకు కూడా కాలేదు. మా నాన్న ప్రభుత్వోద్యోగం చేసి రిటైర్ అయ్యారు. నా సమస్య అమ్మ,నాన్న, అన్న. నేను ఏం చెప్పినా తప్పు అంటున్నారు. నాన్న ఎప్పుడూ తాగుతూ ఉంటారు. అమ్మ అనవసర వాదనలు చేస్తుంది. పనికి వచ్చే మాటఒక్కటీ మాట్లాడదు. నాన్న, అన్నా కూడా అంతే. నేను చెప్పింది ముగ్గురూ తప్పు అంటారు. అదే బైటివాళ్ళతో చెప్పిస్తే వింటారు. అది వాళ్ళు చెప్పినంతవరకే. కాసేపటికే మళ్ళీ మొదటికి వస్తారు. ఏమైనా అంటే అంత మీ నాన్న చేసాడు అని అమ్మ నాన్న పెళ్లి రోజు నుంచి చెప్తుంది. మా నాన్న సంపాదన మొత్తం బయటవాళ్ళకే ఇచ్చాడు. పోతే పోనీ కానీ ప్రశాంతత లేదు. 24 గంటల్లో 10 గంటలు గొడవలు. ఒకరి మీద ఒకరు కోపంతో అన్న, నాన్న తాగుడే పనిగా పెట్టుకున్నారు. నా పరిస్థితి కూడా అలానే అవుతోంది. మా ఇంటి పరిస్థితి మారే అవకాశం ఉందా?
-వేణుగోపాల్
A. మీ ఇంటి పరిస్థితి చాలా బాధాకరం. అయితే మీరుగానీ మీ అన్నయ్య గానీ ఏం చదువుకున్నారో ఏం చేస్తున్నారో రాయలేదు. నిష్క్రియాపరత్వం వల్ల ఇలా ఉన్నారేమో! మీ తల్లిదండ్రులంటే వయసు,సరయిన చదువు లేక అలా ఉన్నారనుకోవచ్చు. మీ అన్నదమ్ములకేమయింది? ఏదన్నా ఉద్యోగం చేసుకుంటే ఏ సమస్యా ఉండదుగా! పైగా పెళ్లి కాలేదని బాధపడుతున్నారు. ఏ పనీ చేయకుండా తాగుతూ కూర్చునే వారికి ఎవరుమాత్రం పిల్లనిస్తారు? ఇంత బాధపడుతూ కూడా మీరు తిరిగి అలానే అయిపోతానేమో అనుకుంటున్నారంటే ఎంత నిస్పృహలో ఉన్నారో అర్థమవుతుంది. తాగుడు వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో నిత్యం చూస్తూ కూడా ఆ ఊబి లోనే కూరుకు పోవడం చాలా విచారకరం. అయితే ఇంటి పరిస్థితి పట్ల బాధ, ఆలోచన ఉన్న వ్యక్తిగా మీరు చొరవ తీసుకోవచ్చు. దానికి ముందు మీకంటూ ఒక ఉద్యోగం, సంపాదన అవసరం. అప్పుడే మీ మాటకు విలువుంటుంది. మీరు చెప్తే వింటారు. ఆ తర్వాత మెల్లగా మీ ఇంట్లో వాళ్లకు నచ్చచెప్పండి. లేదా కొన్నాళ్ళు దూరంగా వెళ్ళండి. మనుషులు దూరంగా ఉంటే విలువ తెలుస్తుంది. ముందు బాధ్యత తెలిస్తే పరిస్థితులు మెల్లగా కుదుట పడతాయి.
Family Counselling:
-కె.శోభ,
ఫ్యామిలీ కౌన్సెలర్,
హార్ట్ టు హార్ట్,
[email protected]
Also Read:
Also Read: