Q.నా గురించి ఎక్కువ వివరాలు రాయలేను. అయితే నాకు మీ సలహా కావాలి. నా సమస్య ఏమిటంటే, చాలా త్వరగా భావోద్వేగానికి గురవుతూ ఉంటాను. కుటుంబ సభ్యులతో మాట్లాడేటపుడు మరింత ఏడుపు వచ్చేస్తుంది. వాళ్ళు నాకు ఏం చెప్పబోయినా కన్నీళ్లు వచ్చేస్తాయి. ఇలా అయితే పెళ్లయ్యాక అత్తవారింట్లో చాలా సమస్యలు ఎదుర్కోవాలని మా అక్క అంటూ ఉంటుంది. నాకు పెళ్లి చేసుకోవాలని ఏమీ లేదు గానీ నా సమస్య నుంచి బయటపడాలని ఉంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నా. నన్ను నేను అదుపులో పెట్టుకోడానికి, ఏడవకుండా ఉండడానికి ఏం చెయ్యాలి?
-ప్రియాంక
A. మీ నిర్ణయం ఏడవకుండా ఉండాలన్నది అయితే మొదటి అడుగు పడినట్టే. మీరేం చదివారో, కుటుంబ నేపథ్యం ఏమిటో రాయలేదు. ఎటువంటి సందర్భాల్లో ఏడుపు వస్తుందో స్పష్టంగా చెప్పలేదు. సున్నిత మనస్కులకు, ఇంట్లో ఆఖరివారికి ఇటువంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అదేమంత తప్పు కాదు గానీ మీ అక్క అన్నట్టు భవిష్యత్తులో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. రేప్పొద్దున్న మీరు ఇంటర్వ్యూలోనో, ఉద్యోగంలోనో ఇలా బాధపడి ఏడిస్తే మీకే కదా నష్టం!మనసును, భావోద్వేగాలను అదుపులో ఉంచుకోడానికి యోగా, మెడిటేషన్ వంటివి సహాయపడతాయి. అలాగే ఎప్పుడెప్పుడు మీకు బాధగా ఉంటోందో గమనించండి. దాన్ని దాటడానికి మార్గాలు చూడండి. అసాధ్యం కాదు. అధైర్యపడకండి. ఒక్కసారిగా మార్పు సాధ్యం కాకపోవచ్చుకానీ ప్రాక్టీస్ చేస్తే త్వరగానే ఫలితం వస్తుంది.
-కె.శోభ,
ఫ్యామిలీ కౌన్సెలర్,
హార్ట్ టు హార్ట్,
[email protected]