Tuesday, September 24, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఫ్యామిలీ, మ్యారేజ్ కౌన్సిలింగ్

ఫ్యామిలీ, మ్యారేజ్ కౌన్సిలింగ్

ఒకప్పుడు ఇల్లే విశ్వ విద్యాలయం. వైద్యాలయం కూడా. చిన్న చిన్న ఆరోగ్య మానసిక సమస్యలు, చదువులకు సంబంధించిన సందేహాలు తీర్చడానికి వంటింట్లో పోపులడబ్బా, కుర్చీలో నానమ్మ- తాతయ్య, మరోపక్క మామయ్యలు , బాబాయిలు, పిన్నులు, అత్తలు ఉండేవారు. పండగైనా పబ్బమైనా కలసి జరుపుకునేవారు. ఎవరూ పెద్దగా బాధపడిన సందర్భాలు ఉండేవి కాదు. కాలం మారే కొద్దీ ఉద్యోగాల పేరుతో పట్నాలకు పరుగెత్తడం ప్రారంభమయ్యాక పరిస్థితి తారుమారయ్యింది. ఎవరి ప్రపంచం వారిదయ్యింది. ఇవన్నీ తప్పని అనలేం. ఇప్పటికీ తమ వారిని పండగలకు కలిసే వారు ఉన్నారు. కానీ ఇప్పటి తరానికి బంధుత్వాలు తెలియవు. మహా అయితే తాతయ్య, అమ్మమ్మ తెలుస్తారేమో! పెద్దమ్మలు , అత్తలు, మామయ్యలు … అందరినీ ఆంటీ అంకుల్ అని సరి పెట్టేస్తున్నారు. అన్న, వదిన, బావ ఎవరైనా కజినే. ఇంటా బయటా ఇవే పిలుపులు. ఇక బంధాలు బలహీనపడటంలో ఆశ్చర్యమేముంది? లింగు లిటుకూ అంటూ భార్యాభర్తలు ఇద్దరే ఉంటే వారిమధ్య వచ్చే తగాదాలు తీర్చేదెవరు? చిన్నకుటుంబాల్లో వచ్చే అపార్థాలు, అత్తా కోడళ్ల సమస్యలు, టీనేజ్ ట్రబుల్స్, వైఫల్యాలు, ఇవన్నీ ఏ డాక్టర్ వచ్చి తీర్చాలి?

మరో పక్క విడాకులు తీసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. చదవలేక డిప్రెషన్ లోకి వెళ్తున్న విద్యార్థులు, దురలవాట్లతో దారి తప్పుతున్నవారు, డిజిటల్ మానియా … ఇలా లెక్కలేనన్ని సమస్యలు. వీటన్నిటికీ పరిష్కారం ఒకేచోట లభిస్తే?.. చక్కటి ఆలోచన కదా! నిజానికి ఇదేమీ కొత్త ఆలోచన కాదు. నల్సార్ యూనివర్సిటీ వాళ్ళు ఎప్పటినుంచో ఫ్యామిలీ కౌన్సిలింగ్ లో డిప్లొమా కోర్సునిర్వహిస్తున్నారు. అనుకున్నంతగా ఆదరణ లభించడం లేదంతే. నిజానికి ప్రతి స్కూల్, కాలేజీ, ఆఫీసుల్లో కౌన్సెలర్లను నియమిస్తే చాలా ఉపయోగం.

కోఠి లోని తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం నాలుగేళ్ళ క్రితం ఫ్యామిలీ, మ్యారేజ్ కౌన్సిలింగ్ కోర్స్ ప్రారంభించింది. మొదట్లో యువతులకే పరిమితమైన ఈ కోర్సులో తాజాగా అందరికీ ప్రవేశం కల్పించారు. దాంతో లాయర్లు, చదువుకున్న మహిళలు, రిటైర్ అయిన పెద్దవారు ఈ కోర్స్ చేసి అనుబంధాల పునాదులను పటిష్టం చేసే సంధాన కర్తలుగా సేవలందిస్తున్నారు. ఆన్లైన్ లో కూడా చదివే సౌకర్యం ఉంది. రాష్ట్రంలో మరి కొన్ని కళాశాలల్లో కూడా ఫ్యామిలీ కౌన్సిలింగ్ కోర్స్ ఉంది. ప్రభుత్వాలు ఇంకాస్త ఆలోచించి ఇటువంటి కోర్సులు పాఠశాల స్థాయినుంచి మొదలుపెడితే ఇంకా ఉపయోగంగా ఉంటుందేమో! ఏమైనా మనిషిని యంత్రంతో పోటీ పడేలాకాక మనసు తెలుసుకుని ఓదార్చే కోర్స్ ప్రారంభించడం సమాజానికి శుభసూచకం.

-కె.శోభ

RELATED ARTICLES

Most Popular

న్యూస్