Sunday, June 14, 2026
Homeసినిమాఇసుమంత ఓపిక లేదా?

ఇసుమంత ఓపిక లేదా?

సినిమాతారల జీవితాలు ఎంత ఆసక్తి కలిగిస్తాయో సమంత, నాగ చైతన్య విడాకుల వ్యవహారం మరోసారి కళ్ళకు కట్టింది. ఎంతో హుందాగా వారిద్దరూ విడాకుల నిర్ణయం ప్రకటించారు. కానీ మాయదారి లోకం నిర్దయగా దాడి మొదలెట్టింది. మీడియా సమంతకు అండగా ఉండటం కొందరికి నచ్చలేదు. దాంతో ఆమెని బదనాం చేయడానికి కొందరు పెయిడ్ ఆర్టిస్టులు రంగం లో కొచ్చారు. పైగా వీరు ఫ్యామిలీ కౌన్సిలర్లు, డాక్టర్లు బోర్డులున్నవారు. అందరి ఎజెండా ఒక్కటే. సమంత ప్రవర్తనే ఆమె విడాకులకు కారణమని. ఎంత దారుణంగా మాట్లాడారంటే అసలు చదువుకున్నవారేనా అనిపించింది. పైగా అక్కినేని కుటుంబ భజన కూడానూ. ఏం? ఆ కుటుంబంలో ఎవరూ విడాకులు తీసుకోలేదా? ఎవరితో అఫైర్స్ లేవా? అవి మాట్లాడకుండా కేవలం సమంతని టార్గెట్ చేసి మాట్లాడటం దారుణం.

ఒకాయన డాక్టర్నని చెప్పుకుంటాడు. అక్కర్లేని విషయముండదు. ఎస్పీబీ ఎలా  పోయాడనే విషయం మొదలు సమంత విడాకుల వరకు అన్నీ తనకే తెలుసని చెప్పుకుంటాడు. అదీ చెత్తవాగుడు. ఆయనగారి దృష్టిలో ఆదర్శ భార్య ఎవరయ్యా అంటే హేమమాలిని, ఐశ్వర్యరాయ్ అట. సమంత, చైతన్య గొడవల గురించి ఇంట్లో దూరి చూసినట్టు అడ్డంగా చెప్తున్నాడు.  మరి మహిళాసంఘాలవారి దృష్టి ఎందుకు పడలేదో!

మరొకావిడ  ఫ్యామిలీ కౌన్సిలర్ నని చెప్పుకొంటుంది. అక్కినేని కుటుంబ భజన, సమంత శీల పరీక్ష తప్ప ఇంకోటి మాట్లాడలేదు. వీళ్ళందరికీ సమంత ఇంటిపట్టున ఉండాలి. పిల్లల్ని కనాలి. అత్తమామల మాటకు ఎదురు చెప్పకూడదు. ఎంత పెద్ద హీరోయిన్ అయినా పెళ్లయ్యాక భర్త చాటునే ఉండాలి. ఆమెకంటూ ఆశలు, కెరీర్ గురించి ఆశయాలు ఉండకూడదు. స్నేహితులు ఉండకూడదు. మళ్ళీ ఈ సూత్రాలు ఆ బాబులకు వర్తించవు.  వ్యక్తిగత ప్రచారం కోసం చవకబారు ఎత్తుగడలకు పాల్పడే ఇటువంటి చదువుకున్న మూర్ఖుల బారినుంచి సమాజాన్ని, సమంతను ఆ దేవుడే ఏదో మాయ చేసి కాపాడాలి.

-కె. శోభ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular