Sunday, November 24, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంసకుటుంబ విహారయాత్రలు

సకుటుంబ విహారయాత్రలు

చిన్నతనంలో అమ్మానాన్నలతో వెళ్లే పర్యటనలకు పిల్లల మనసులో ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎంత పెద్దయినా మరిచిపోలేరు. మరచిపోయేది తల్లిదండ్రుల అవసరాలని. నెమ్మదిగా ఉద్యోగం, పెళ్లి, పిల్లలు…అనేక జంజాటంలో అమ్మానాన్నలు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళని తీసుకుని టూర్స్ కి వెళ్లడం అనే ఆలోచనే రాదు. మహా అయితే పుణ్యక్షేత్రాలకు తీసుకెళ్తారేమో! అక్కడికే ఎన్నో నిట్టూర్పులు… విసుగు. ఈమధ్య పెద్దవాళ్ళని తీసుకుని పిల్లలు టూర్స్ వెళ్లడం పైన, ఎదురయ్యే ఇబ్బందులపై ఒక కథనం వచ్చింది. అది చదివాక వచ్చిన ఆలోచనలు…

మనం పిల్లలతో పర్యటించేటపుడు ఎంతో జాగ్రత్తగా ఉంటాం. పెద్దవాళ్ళ దగ్గరికి వచ్చేసరికి జాగ్రత్తలు అవసరమని అనుకోము. అందుకే వారితో ప్రయాణిస్తుంటే కోపం వస్తూ ఉంటుంది. మా అమ్మానాన్నలతో పిల్లలుగా మేము చేసిన ప్రయాణాలు, తర్వాత పిల్లలతో వాళ్ళు చేసిన ప్రయాణాలు ఓ మాటు గుర్తు చేసుకుంటే …

చిన్నతనంలో మాది ఆరుగురు సభ్యుల కుటుంబం. మా నాన్నగారు నేను మూడో క్లాస్ లో ఉన్నప్పుడు మమ్మల్ని మొదటిసారి మద్రాసు- తిరుపతి తీసుకెళ్లారు. చాలా బాగా ఎంజాయ్ చేసిన ట్రిప్. వుడ్ ల్యాండ్ హోటల్ లో పేపర్ దోస, మెత్తని ఇడ్లిల రుచి ఇంకా గుర్తే. తిరుమలలో కూడా స్వామి దర్శనం అప్పుడు జరిగినంత బాగా మరెప్పుడూ జరగలేదు. కుటుంబంతో సహా యాత్రలు చెయ్యడం అనేది అలా అలవాటైంది. ఆ తర్వాత ఢిల్లీ తీసుకెళ్లి బస్ లో సిటీ టూర్ తీసుకెళ్లారు. జర్నలిస్టు కావడం వల్లేమో ప్రయాణాలంటే ఆయనకి బలే ఇష్టం. మంచి కాఫీ అన్నా కూడా. మేము పెరిగి పెద్దవాళ్లమయ్యే కొద్దీ ఆయన పద్ధతులు కొన్ని ఇబ్బందిగా ఉండేవి. నాన్నతో వాదించేవాళ్ళం. నా పెళ్ళికి ముందు కూడా నన్ను, తమ్ముడిని షిర్డీ, ఔరంగాబాద్ తీసుకెళ్లారు. పిల్లల పెళ్ళిళ్ళయి మనవలు పుట్టాక కూడా తిరుపతి, షిర్డీ వెళ్ళేవాళ్ళం. కుటుంబమంతా కలసి గోవా, పాపికొండలు, శ్రీశైలం వెళ్లినవి తీపిగుర్తుల్లా ఉండిపోయాయి. టూర్ అనగానే ట్రైన్ టికెట్స్ రిజర్వేషన్స్ దగ్గరనుంచి నాన్నే చూసుకునేవారు. అందర్నీ హడావుడి పెట్టేవారు. ట్రైన్ లో ప్యాంట్రీ కార్ లోకి వెళ్లి చిక్కటి కాఫీ చేయించుకునే వారు. మెల్లగా విమానయానం అందుబాటులోకి రావడంతో ప్రయాణాలు,ఏర్పాట్లు పిల్లల చేతుల్లోకి వచ్చాయి.

మాతో అమ్మానాన్నలు
పిల్లలందరివీ వేర్వేరు సంసారాలు. ఎవరన్నా టూర్ వెళ్తుంటే వాళ్ళతో అమ్మానాన్నలు వెళ్ళేవాళ్ళు. అక్కవాళ్ళతో ఎక్కువగా తిరుపతి, షిర్డీ వెళ్లేవారు. మాతో కేరళ, రాజస్థాన్, ముంబయి, థాయిలాండ్ వచ్చారు. ప్రతిచోటా మా అబ్బాయితో సమంగా పోటీ పడేవారు. అంతా బాగానే ఉండేది గానీ నాన్నకి కొద్దిగా మతిమరపు మొదలయ్యాక పర్యటనల్లో ఇబ్బందులు మొదలయ్యాయి. బ్యాంకాక్ వెళ్ళినప్పుడు, మాల్స్ లో తిరగడం కష్టమైంది. అమ్మని, నాన్నని ఒక చోట కూర్చోబెట్టి మేము వెళ్ళేవాళ్ళం. అలాగే అక్కడ ఎయిర్పోర్ట్ లో అమ్మ సూట్ కేస్ ఒకటే రాలేదు. ఇక చూడాలి ఆవిడ కంగారు. చీర తప్ప ఏదీ కట్టుకోదు. ఆవిడకి ధైర్యం చెప్పి బజార్ కెళ్ళాం ఎక్కడన్నా చీరల షాపులు ఉంటాయేమో అని. దొరకలేదు. తీరా హోటల్కి వచ్చేసరికి అమ్మ పెట్టె వచ్చేసింది. ఎయిర్ పోర్ట్ వాళ్ళు జాగ్రత్తగా ఫుకెట్ రిసార్ట్ కి తెచ్చి ఇచ్చారు. ఇక పెద్ద వాళ్ళకి ఫుడ్ కూడా సమస్యే. ఇంట్లో అయినా బ్రెడ్ తింటారు గానీ బయట అన్నం, ఇడ్లి కావాలి. ఒకపూట దొరికింది. ఒకరోజు సరిగా దొరకలేదు. ఇబ్బంది పడ్డారు. బ్యాంకాక్ లో మాత్రం ఇండియన్ ఫుడ్ దొరికింది. అయితే ట్రిప్ మాత్రం బాగా ఎంజాయ్ చేశారు. మతి మరపు పెరిగేకొద్దీ తన స్వగ్రామం, అన్నదమ్ములను తల్చుకునేవారు నాన్న.

ఒకసారి అవకాశం వస్తే అందరం కలసి మా ఊరు బయలుదేరాం. కాకినాడ ట్రైన్ లో ఆయన అస్సలు పడుకోలేదు. మమ్మల్ని పడుకోనివ్వలేదు. ఉన్నట్టుండి కనిపించలేదు. కంగారుగా వెతుకుతుంటే పక్క బోగీలో తెలిసిన బంధువుల దగ్గర కబుర్లు చెప్తున్నారు. కాకినాడ వెళ్లి హోటల్ లో దిగగానే మళ్ళీ మాయమయ్యారు. వెతగ్గా కింది ఫ్లోర్ లో ఉన్న కిచెన్ కెళ్ళి వంటవాళ్ళతో కబుర్లు చెప్తున్నారు. అప్పుడు బలే కోపం వచ్చింది. విసుక్కున్నాం. తర్వాత చిన్నప్పుడు మద్రాసులో నేను రోడ్ దాటలేక ఒక్కతినే ఉండిపోతే నాన్న వచ్చి రోడ్ దాటించిన విషయం గుర్తువచ్చింది. అప్పుడు ఆయన్ని విసుక్కున్నందుకు బాధ. ఎలాగైతేనేం నాన్నకి స్వగ్రామం చూపించి, బంధువులను కలిపించి హమ్మయ్య అనుకున్నాం. అప్పటినుంచి టూర్స్ లేవు. ఆ తర్వాత మా అక్క ఇంటికి అహమ్మదాబాద్ వెళ్ళినప్పుడు ఇంకా వింతగా ప్రవర్తించారు. మతిమరపు పెరిగేకొద్దీ మా ఇళ్ల కొచ్చినా కంగారు పడేవారు. అందుకని ఎక్కువ తిప్పేవాళ్ళం కాదు. ఆయన పోయాక అమ్మ డీలా పడటంతో ఆవిడా ఎక్కువ తిరగలేకపోతోంది. ఏమైనా పెద్దవాళ్ళని పర్యటనలకు తీసుకెళ్లాలంటే కుటుంబమంతా కలసి వెళ్తేనే కొన్ని సమస్యలు రాకుండా ఉంటాయి. వచ్చినా ఎవరో ఒకరు చూసుకుంటారు. అయితే వారితో తిరగడం మాత్రం మరచిపోలేని అనుభూతులు చాలా అందిస్తుంది.

-కె. శోభ

Previous article
RELATED ARTICLES

Most Popular

న్యూస్