Wednesday, July 3, 2024
HomeTrending Newsకరువు కోరల్లో సుడాన్

కరువు కోరల్లో సుడాన్

పశ్చిమ దేశాల పట్టుదలతో మూడో ప్రపంచ దేశాలు కరువు కోరల్లోకి జారుకుంటున్నాయి. రాజ్యాధికారం కోసం జరుగుతున్న తిరుగుబాట్లతో ఆఫ్రికా దేశాల్లో అలజడి రేగుతోంది. ఈ కోవలోనే సూడాన్ అంతర్యుద్ధంలో మునిగిపోయింది. రాజధాని ఖార్టూమ్‌లో విధ్వంసం రాజ్యమేలుతోంది. ఆఫ్రికా దేశం ఇప్పుడు ఆకలి, పేదరికం, కరువు వంటి పరిస్థితులను ఎదుర్కోవల్సిన పరిస్థితికి చేరుకుంది. ప్రపంచం ఉక్రెయిన్-రష్యా, ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధంలో చిక్కుకుంది. అయితే సూడాన్ కరువు అంచుకు చేరుకుంది. ఈ మేరకు అమెరికా అధికారులు హెచ్చరించారు.

40 సంవత్సరాల క్రితం ఇథియోపియా తర్వాత ప్రపంచంలోనే అత్యంత దారుణమైన కరువును సుడాన్ ఎదుర్కొంటోందని, ఆహార సరఫరాకు యుద్ధంలో దెబ్బతిన్న సైన్యాలు ఆటంకం కలిగిస్తున్నాయని అమెరికా అధికారులు చెబుతున్నారు. సుడాన్ ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన మానవతా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. తక్కువ మీడియా కవరేజీ, ప్రపంచవ్యాప్త ఆందోళనతో చారిత్రాత్మక స్థాయిలో మానవ విపత్తు వైపు వెళుతోంది.

ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి లిండా థామస్-గ్రీన్‌ఫీల్డ్ మాట్లాడుతూ మన కళ్లముందే జరుగుతున్న విధ్వంసంపై ప్రపంచానికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. సూడాన్‌లో పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ , సైన్యం మధ్య అంతర్యుద్ధం జరుగుతోంది. ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ ఏప్రిల్ 2023 నుండి సుడానీస్ సాయుధ దళాలతో పోరాడుతోంది. ఆధిపత్య పోరు కోసం ఇరు సేనల సైన్యాధిపతులు తమ సత్తా చాటుతున్నారు. సుడానీస్ సాయుధ దళాల చీఫ్ అబ్దెల్ ఫత్తా అల్-బుర్హాన్.. ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ చీఫ్ మహమ్మద్ హమ్దాన్ దగాలో సాధారణ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇరు సేనల జనరల్స్ మధ్య జరిగిన పోరు దేశాన్ని ముక్కలు చేసింది.

సూడాన్ అంతర్యుద్ధం ఇప్పటికే 14,000 మందిని చంపింది. 10 మిలియన్ల మంది తమ ఇళ్లను విడిచిపెట్టవలసి వచ్చింది. ఎల్ ఫాషర్ నగరం ముట్టడిని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ బ్రిటన్ రూపొందించిన తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి గురువారం ఆమోదించింది, అయితే శుక్రవారం పోరాటం తీవ్రమైంది. సుడానీస్ సాయుధ దళం ఒక పెద్ద ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ దాడిని విఫలం చేసినట్లు పేర్కొంది. ఈ దాడిలో భారీ నష్టం వాటిల్లింది. సుడాన్ కోసం అమెరికా మానవతా సహాయంగా 315 మిలియన్ డాలర్లను ప్రకటించింది.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్