AP Sweets:
అనంతపురం- హోళిగలు
కర్నూలు- కోవా పూరీ
చిత్తూరు- కోవా జాంగ్రీ
కడప- ???
ఒంగోలు- అల్లూరయ్య మైసూర్ పాక్
తాపేశ్వరం- కాజాలు
పెద్దాపురం- పాలకోవా
నెల్లూరు- మలై కాజాలు
పెనుకొండ- పాకం కర్జికాయలు
బందరు- హల్వా
బందరు- లడ్లు
తణుకు- బెల్లం జిలేబీ
గరివిడి- కాజాలు
మాడుగుల- హల్వా
పెరుమాళ్ పురం- పాకం గారెలు
కాకినాడ- కోటయ్య కాజాలు
గుంటూరు- మాల్ పూరీ
ఆత్రేయపురం- పూతరేకులు
ఇవన్నీ స్వీట్ షాపులో అమ్మకం కోసం పెట్టిన డిస్ప్లే ఐటమ్స్ కావు. ఒక పెళ్లి రిసెప్షన్ బఫే భోజనంలో అతిథులు ఆరగించడం కోసం తెప్పించి…పెట్టిన తెలుగు తీపులు.
విజయవాడలో పగలంతా పనులు చూసుకుని సాయంత్రం నలుగురు మిత్రులం ఒక పెళ్లి రిసెప్షన్ కు వెళ్లాము. సాధారణంగా పెళ్లిళ్లు, రిసెప్షన్లలో మన మానం, ఆత్మాభిమానం ఒత్తిడికి గురవుతూ ఉంటాయి. అర్థం లేనివి అవుతూ ఉంటాయి. అక్షింతలు చల్లడానికి క్యూలో నిలుచుని అపరాధభావంతో మన వంతుకోసం నిరీక్షించాలి. భోజనాల దగ్గర సోమాలియా శరణార్థులకు ఐక్యరాజ్యసమితి ఆహార పొట్లాలు పంచుతున్నప్పుడు దీనంగా బొచ్చె పట్టుకుని నిలుచున్నట్లు బఫే క్యూల్లో నిలుచోవాలి. “ఆకలితో అలమటించే సింహం పస్తులైనా ఉంటుంది కానీ… గడ్డి మేస్తుందా?” అన్న ఏనుగు లక్ష్మణ కవి అనువాద పద్యం గుర్తొచ్చి…ఎంత ఆలస్యమైనా ఇంటికొచ్చి అన్నం తిన్న సందర్భాలు లెక్కలేనన్ని.
ఇక్కడ అలాంటి అవమానాలకు ఆస్కారం లేకుండా అతిథి మర్యాదలకు ఏర్పాట్లు చక్కగా ఉన్నాయి. వేదిక మీద పెళ్లి కూతురు- పెళ్లి కొడుకు వచ్చేలోపు ఏయే టిఫిన్లు, స్నాక్స్, స్వీట్లు, భోజనం మెయిన్ కోర్స్ ఐటమ్స్ ఉన్నాయో ఒకసారి చూసి…వద్దాం పదండి అని ఆప్యాయంగా చేయి పట్టుకుని…డైనింగ్ హాల్లోకి తీసుకెళ్లడం మొదటి శుభసూచకం. చెరుకు రసం వెల్కమ్ డ్రింక్ రెండో శుభసూచకం. ఫలానా ఐటమ్స్ చేయించాము, ఫలానా ఐటమ్స్ తెప్పించాము- మీకు ఏవి ఇష్టమయితే అవి తినాలి- అని పెళ్లి కొడుకు తండ్రి మాకో మనిషిని కాపలా పెట్టి వెళ్లారు. ఇది మూడో శుభసూచకం.
అసలే మాకు స్వీట్ల బలహీనత. స్వీట్లు భోంచేసే రకం. అలాంటిది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రఖ్యాత స్వీట్లన్నీ ఒక్కచోటే పెడితే…మా పరిస్థితి ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. మా బృందంలో ఒక డాక్టర్ ఉండడంతో ఇన్ని స్వీట్లను ఎలా తినాలో చెప్పమని ఆయన వైద్య సలహా అడిగాము. “ఒక్కో స్వీట్ ప్లేట్లో పెట్టుకుని వద్దాము. ఒక జాంగ్రీ ముక్కనే నాలుగు భాగాలు చేద్దాం. నలుగురూ పంచుకుని తిందాం. అలా ప్రతి ఐటెంను పంచుకుని కొద్ది కొద్దిగా తినవచ్చు…దేన్నీ వదలకుండా అన్నీ రుచి చూడవచ్చు…” అని ఒక బృహత్ స్వీట్ ఈటింగ్ మారథాన్ ప్రణాళిక రచించి…పక్కాగా అమలు చేశాము.
ఆత్రేయపురం పూతరేకుతో ప్రారంభించి…చిత్తూరు కోవా జాంగ్రి దగ్గర బరువెక్కిన పొట్టలతో ముగించాము. స్వీట్ల వల్ల జరిగే అనర్థాలు, ఆరోగ్యసమస్యల గురించి సమగ్రంగా, సాధికారికంగా మాట్లాడుకుంటూ స్వీట్లు తిన్నాము. ఏమిటో ఈ పాడు స్వీట్లు తింటే ఇక అన్నం ఏమి తింటాము? అని విసుక్కుంటూ స్వీట్లు తిన్నాము.
సంస్కృతంలో “మధురేణ సమాపయేత్” అని భోజనాన్ని స్వీట్ తో పరిపూర్తి చేయాలని వాడుక మాట ఉందని చెబుతూ నాకు నేను ఇరుక్కున్నాను. అన్నం, పెరుగు, మీగడ కలుపుకుని దాంట్లోకి మరోసారి చిత్తూరు కోవా జాంగ్రీ తింటూ “సమాపయేత్” అని చెప్పాల్సివచ్చింది!
ఇన్ని జిల్లాలకు ఇంత మధురన్యాయం జరిగిన పందిట్లో నేను పుట్టిన కడప జిల్లాకు జరిగిన అన్యాయం మాత్రం తీయటి బాధగా వెంటపడింది. సంక్రాంతులకు కడప ప్రత్యేకంగా చేసుకునే అత్తిరసాలు పెట్టి ఉంటే…-అదిరిపోయేది!
ఇంకెప్పుడూ స్వీట్లు తినకూడదని ఇదే లాస్ట్ అని…ఇప్పటికి కొన్ని వేల సార్లు గట్టిగా నిర్ణయించుకుని…స్వీట్లు కనపడగానే ఒట్టు తీసి స్వీట్లో పెట్టడం ఒక మధురమయిన భావన.
కొసతీపి:-
కొన్ని డ్రై స్వీట్స్ పార్సిల్ కట్టి కార్లో పెట్టమంటారా? అని పెళ్లికొడుకు చిన్నాన్న మొహమాటపెట్టాడు. అబ్బే! మాకు స్వీట్లు అస్సలు పడవండి…వద్దే వద్దు అని మొహమాటం లేకుండా చెప్పాము!
ఫలశ్రుతి:-
“దీపనాగ్నినై జీవ దేహముల అన్నములు
తీపుల నరగించేటి దేవుడ నేను
యేపున నిందరిలోని హృదయములోననుందు
దీపింతు తలపు మరపై దేవుడ నేను”
అని అన్నమయ్య అన్నట్లు మా కడుపుల్లో తీపులను ఆ దేవుడే కరిగించాలి!
డిస్ క్లైమర్:-
స్వీట్లు పడనివారు దీన్ని చదివి ఇగ్నోర్ చేయవలెను. లేనియెడల వారికి షుగర్, అజీర్తి పెరుగును!
-పమిడికాల్వ మధుసూదన్
9989090018