Friday, March 29, 2024
HomeTrending Newsఉపరాష్ట్రపతి వెంకయ్యకు ఘనంగా వీడ్కోలు

ఉపరాష్ట్రపతి వెంకయ్యకు ఘనంగా వీడ్కోలు

ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్‌ అయిన ఎం వెంకయ్యనాయుడు పదవీకాలం ఈ నెల 10వ తేదీతో  ముగియనున్న నేపథ్యంలో సోమవారం ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. ఇది భావోద్వేగ క్షణమన్నారు. తాను వెంకయ్యతో కలిసి పని చేశానని వివిధ సందర్భాల్ని ప్రస్తావించారు. తాను రాజకీయాల నుంచి రిటైరయ్యాను. కానీ ప్రజా జీవితం నుంచి అలసిపోలేదని చాలాసార్లు వెంకయ్య చెప్పారని గుర్తు చేశారు. ఈ సభకు నాయకత్వం వహించే బాధ్యత ఇప్పుడు ముగిసిపోవచ్చని, కానీ వెంకయ్య అనుభవాలు రాబోయే సంవత్సరాల్లో దేశానికి మార్గదర్శకంగా ఉంటాయన్నారు. ‘మాతృభాష కళ్లలాంటిది, రెండవ భాష కళ్లజోడు లాంటిది అని మీరు ఎల్లప్పుడూ చెబుతారు. సభలో ఏ భాషలోనైనా మాట్లాడగలరు’ అని వెంకయ్యనాయుడును ఉద్దేశించి అన్నారు. వెంకయ్య మార్గదర్శనంలో ఎన్నో బిల్లులు విజయవంతంగా ఆమోదం పొందాయన్నారు. రాజ్యసభ సచివాలయాన్ని, కాగిత రహిత వ్యవస్థను ప్రోత్సహించడం వంటి ఎన్నో కార్యక్రమాలకు బీజం వేశారని, చర్చల ద్వారానే ఏ సమస్యకైనా పరిష్కారమనే విషయంలో వెంకయ్య చేసిన మార్గదర్శనం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు.

రాజ్యసభలో ప్రతిపక్ష నాయకులు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. ‘ మన మధ్య సిద్ధాంతపరమైన విభేదాలు ఉండవచ్చు. కానీ సభను నడిపించడంలో మీరు సమర్థవంతమైన పాత్రను నిర్వర్తించినందుకు (నాయుడు) ధన్యవాదాలు’ అని చెప్పారు. కాంగ్రెస్‌ నేత జైరాం రమేష్‌ మాట్లాడుతూ.. 2014లో ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంపై చర్చ జరిగినప్పుడు నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని అన్నారు. మీరు చివరిగా లేచి తమ ప్రభుత్వం రాబోతుందని, పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించారు. ఆ హామీని గుర్తు చేస్తున్నాను. నన్ను క్షమించాలి’ అని అన్నారు.
వైసిపి ఎంపి వి విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. రాజ్యసభ ఛైర్మన్‌గా తెలుగు వ్యక్తి ఉండటం తొమ్మిది కోట్ల తెలుగు ప్రజలకు గర్వకారణమన్నారు. తాను విద్యార్థిగా ఉన్నప్పుడు వెంకయ్యనాయుడు బహిరంగ సభలకు హాజరయ్యానని, తమకు స్ఫూర్తినిచ్చారన్నారు. ‘మీకు భాషలపై పట్టుంది. ఇది అభినందించాల్సిందే. 370 ఆర్టికల్‌ రద్దు బిల్లుపై చర్చ జరిగినప్పుడు చిన్న పార్టీలకూ మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారు’ అని పేర్కొన్నారు.
టిడిపి ఎంపి కనకమేడల రవీంద్ర కుమార్‌ మాట్లాడుతూ.. వెంకయ్య సభ్యులను ప్రోత్సహించేవారని, తనకు మార్గదర్శిగా ఉన్నారని అన్నారు. ప్రతి అంశంపై పరిజ్ఞానం వెంకయ్యకు ఉందని అన్నారు. సిపిఎం ఎంపి జాన్‌ బ్రిట్టాస్‌ మాట్లాడుతూ.. తమ పార్టీ వెంకయ్యకు శుభాకాంక్షలు తెలుపుతుందన్నారు. ‘దేశంలోని భిన్నత్వంలో ఏకత్వానికి మీరు ఒక ఉదాహరణ. మీరు అంగీకరించకపోయినా మాట్లాడేందుకు అనుమతిచ్చేవారు’ అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌, సభా నాయకుడు పియూష్‌ గోయల్‌, కేంద్ర మంత్రులు ప్రహ్లాద్‌ జోషి, పురుషోత్తం రూపాలా (బిజెపి), డెరిక్‌ ఒబ్రెయిన్‌, జవహర్‌ సిర్‌కార్‌ (టిఎంసి), తిరుచ్చి శివ, పి విల్సన్‌ (డిఎంకె), సంజరు సింగ్‌, విక్రమ్‌ జిత్‌ సింగ్‌, రాఘవ్‌ చద్దా, సంత్‌ బల్బీర్‌ సింగ్‌ (ఆప్‌), సస్మిత్‌ పాత్ర (బిజెడి), అహ్మద్‌ అష్ఫాక్‌ కరీం, మనోజ్‌ కుమార్‌ ఝా (ఆర్‌జెడి), రామ్‌నాథ్‌ ఠాకూర్‌ (జెడియు), ఎం తంబిదురై (అన్నాడిఎంకె), ప్రఫుల్‌ పటేల్‌, వందన చౌహాన్‌ (ఎన్‌సిపి), రామ్‌గోపాల్‌ యాదవ్‌ (ఎస్‌పి), బికాష్‌ రంజన్‌ భట్టాచార్య (సిపిఎం), బినరు విశ్వం (సిపిఐ), రాందాస్‌ అథ్వాలే (ఆర్‌పిఐ), బిరేంద్ర ప్రసాద్‌ బైశ్యా (ఎజిపి), రాంజీ (బిఎస్‌పి), అబ్దుల్‌ వాహబ్‌ (ఐయుఎంఎల్‌), జికె వాసన్‌ (టిఎంసిఎం), జోషి కె మణి (కెసిఎం), పిటి ఉష, అజిత్‌ కుమార్‌ భుయన్‌ (స్వతంత్ర) తదితరులు మాట్లాడారు.

వెంకయ్య కంటతడి

టిఎంసి ఎంపి డెరిక్‌ ఒబ్రెయిన్‌ మాట్లాడుతూ.. వెంకయ్య చిన్నతనంలోనే తల్లి కోల్పోయిన ఘటనను గుర్తు చేశారు. ఈ సందర్భంలో వెంకయ్య కంటతడి పెట్టుకొని, భావోద్వేగానికి లోనయ్యారు. చివరిగా మాట్లాడిన వెంకయ్యనాయుడు మీడియా నిర్మాణాత్మక అంశాలను రిపోర్టు చేయకపోడం దురదృష్టకరమని, దాని నుంచి మీడియా బయటపడాలన్నారు. ప్రపంచంలోనే మనది అత్యంత పెద్ద పార్లమెంటరీ ప్రజాస్వామ్య దేశమని, సభా నిర్వహణ అతిపెద్ద బాధ్యతని, ప్రపంచమంతా మనల్ని చూస్తోందని అన్నారు. హుందాతనం, గౌరవంగా ప్రతి సభ్యుడూ నడుచుకోవాలని సూచించారు. బాధతోనే కొన్నిసార్లు చర్యలు తీసుకున్నానని, అంతే తప్ప తాను ఎవరికీ, ఏ పార్టీకీ వ్యతిరేకం కాదన్నారు. ప్రజలు చర్చను కోరుకుంటున్నారని, చర్చతోనే బిల్లులు ఆమోదం పొందాలని తెలిపారు. తానెప్పుడూ రాష్ట్రపతి పదవిని కోరుకోలేదని, అసమ్మతి కానని పేర్కొన్నారు. మొదట మాతృ భాష, ఆ తరువాత సోదరుని భాష అని అన్నారు. రాజ్యసభ సెక్రటేరియట్‌లో అన్ని భాషల్లో అనువాదం చేస్తారని, అందుకు అనుగుణంగా శాశ్వత యంత్రాంగాన్ని ఏర్పాటు చేశామన్నారు.

Also Read : జాతీయవాద భావనే భారతదేశ అస్తిత్వం ఉపరాష్ట్రపతి

RELATED ARTICLES

Most Popular

న్యూస్