Wednesday, January 22, 2025
HomeTrending Newsచలో ఢిల్లీకి సిద్దమవుతున్న రైతు సంఘాలు... అనుమానాలు

చలో ఢిల్లీకి సిద్దమవుతున్న రైతు సంఘాలు… అనుమానాలు

పంటలకు కనీస మద్దతు ధర, ఇతర డిమాండ్ల పరిష్కారం అయ్యే వరకు రైతాంగ ఉద్యయం ఆపేది లేదని రైతు సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. మరోసారి ఢిల్లీ ర్యాలీ చేపడతామని ప్రకటించాయి. హర్యానా అంబాల సమీపంలోని శంభు సరిహద్దు వద్ద జాతీయ రహదారిపై రాకపోకలు ప్రారంభం కాగానే చలో ఢిల్లీ చేపడుతామని సంయుక్త కిసాన్‌ మోర్చా(నాన్‌ పొలిటికల్‌) నేత జగ్జిత్‌ సింగ్‌ దల్లేవాల్‌ మంగళవారం వెల్లడించారు.

శంభు సరిహద్దు వద్ద బారికేడ్లను వారం రోజుల్లో తొలగించాలని హర్యానా ప్రభుత్వాన్ని… పంజాబ్‌-హర్యానా హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో దల్లేవాల్‌ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఎస్కేఎం(నాన్‌ పొలిటికల్‌), కిసాన్‌ మజ్దూర్‌ మోర్చా(కేఎంఎం) ఆధ్వర్యంలో రైతులు చేపట్టిన ‘ఢిల్లీ చలో’ను పోలీసులు పంజాబ్‌-హర్యానాలోని శంభు సరిహద్దు వద్ద అడ్డుకోవడంతో ఫిబ్రవరి 13వతేదీ నుంచి రైతులు అక్కడే బైఠాయించి ఆందోళన కొనసాగిస్తున్నారు.

ర్యాలీ ఢిల్లీ చేరుకున్నాక జంతర్‌మంతర్‌ లేదా రామ్‌లీలా మైదానంలో శాంతియుత నిరసన కొనసాగిస్తామని జగ్జిత్‌ సింగ్‌ దల్లేవాల్‌ వెల్లడించారు. ర్యాలీ మళ్లీ అడ్డుకొన్నా, రోడ్డు దిగ్బంధించినా ప్రభుత్వానిదే బాధ్యతని స్పష్టం చేశారు. రైతు నేతల ప్రకటనతో ఢిల్లీ సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కేంద్ర ప్రభుత్వం గత ఐదేండ్లుగా మద్దతు ధర పెంచకపోవడంతో దేశంలోని చక్కెర పరిశ్రమ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నదని షుగర్‌ యూనిట్స్‌ ఫెడరేషన్‌ ఆవేదన వ్యక్తం చేసింది. నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ కోఆపరేటివ్‌ షుగర్‌ ఫ్యాక్టరీస్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ జైప్రకాశ్‌ దండేగోంకర్‌ మంగళవారం మీడియాతో మాట్లాడారు. అదే సమయంలో రైతు సంఘాల నేతలు మీడియా సమావేశం నిర్వహించటం గమనార్హం.

ఉత్తరాదిలో రైతుల ఆందోళన వెనుక చక్కర పరిశ్రమ మాఫియ ఉందని నిఘా వర్గాలకు సమాచారం అందినట్టు విశ్వసనీయ సమాచారం. చెరుకు సాగుకు అధిక నీటి వినియోగం ద్వారా భూసారం దెబ్బ తింటుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చక్కెర తయారీలో వాడే రసాయనాల ద్వారా ముప్పు వాటిల్లుతోందని అంటున్నారు. చక్కెర దాని అనుబంధ ఉత్పత్తుల వినియోగం ద్వారా ప్రజలు మధుమేహం, చర్మ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారని వివిధ సర్వేల్లో వెలుగు చూసింది.

బయో డిజిల్ లో కలిపేందుకు ఉపయోగించే ఇథనాల్ తయారీలో ఇప్పటివరకు మొలాసిస్ వాడే వారు. ఇకనుంచి మొలాసిస్ వినియోగం పూర్తిగా ఆపేసి మొక్కజొన్న(మక్కల)వినియోగం పెంచాలని శాస్త్రవేత్తలు సూచించగా కేంద్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటోంది. మొలాసిస్ వినియోగం ద్వారా పర్యావరణ సమతౌల్యం అడుగంటిందని ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాలు చెరుకు సాగు గణనీయంగా తగ్గించాయి.

ఈ దిశగా మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చెరుకు సాగు తగ్గించాలని యత్నిస్తున్నా అక్కడి పరిశ్రమ యాజమాన్యాలు సహకరించటం లేదు. తాజాగా రైతులు చేపట్టబోయే ఆందోళనకు వీరే తెరవెనుక సహకరిస్తున్నారని అనుమానాలున్నాయి. కేంద్రప్రభుత్వం రైతుల సమస్యలు పరిష్కరించక పోవటంతో రైతు సంఘాల నిర్ణయాలు, కార్యాచరణలో బయట శక్తుల జోక్యం పెరుగుతోందనే వాదన ఉంది.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్