Fast Urbanization : తెలంగాణను వేగంగా అభివృద్ధి చెందుతున్న అర్బన్ రాష్ట్రంగా చెప్పవచ్చని మంత్రి కే తారక రామారావు అన్నారు. ఇప్పటికే సుమారు 46 శాతం ప్రజలు పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారని, 5నుంచి 6 సంవత్సరాలో సగానికి పైగా జనాభా తెలంగాణ పట్టణాల్లో నివసించపోతున్నదని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని నగరపాలికల మేయర్లు, చైర్ పర్సన్లు, కమిషనర్లతో పట్టణ ప్రగతి పైన జరిగిన సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటిఆర్ మాట్లాడుతూ గత ఐదు వేల సంవత్సరాలుగా జరిగిన పట్టణీకరణ కన్న ఎక్కువగా రానున్న 50 సంవత్సరాలలో ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నదన్నారు. ఉత్తమ అవకాశాలు, వసతుల కోసం ప్రజలు పట్టణాలకు భారీగా తరలి వస్తున్న నేపథ్యంలో పట్టణాల్లోని మౌలిక వసతుల కల్పన అత్యంత సవాలుగా మారిందని, ఒకప్పుడు గాంధీ మహాత్ముడు అన్నట్టు భారతదేశం గ్రామాల్లో నివసిస్తే భారతదేశాన్ని నడిపిస్తున్నది మాత్రం పట్టణాలే అన్నారు.
తెలంగాణలో గత ఏడు సంవత్సరాల్లో రెట్టింపు అయిన gsdpలో సింహభాగం పట్టణాల నుంచి వస్తున్నదని మంత్రి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత నూతన పురపాలక చట్టం తీసుకువచ్చి ప్రజల కేంద్రంగా అనేక సంస్కరణలను చేపట్టామని, మౌలిక వసతుల కల్పన కార్యక్రమాలను స్థానిక పురపాలికల పైన భారం వేయకుండా తాగునీటి ప్రాజెక్టులను ప్రభుత్వమే చేపడుతుందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి కింద పేర్కొన్న ప్రధానమైన లక్ష్యాలను అన్ని పురపాలికలు సాధించాలని మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.
ప్రతి పట్టణంలో మోడల్ మార్కెట్లు
డిజిటల్ డోర్ నెంబరింగ్
ఆధునిక దోబీ ఘాట్ లు
మానవ వ్యర్థాల శుద్ధి మరియు నిర్వహణ ప్లాంట్
మోడల్ వెజ్ మరియు నాన్ వెజ్ మార్కెట్ లు
వైకుంఠ గ్రామాలు
ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్
బయో మైనింగ్ వంటి లక్ష్యాలను సాధించాలని సూచించిన కేటీఆర్
రానున్న వర్షాకాలంను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం నిర్దేశించిన హరితహారానికి సంబంధించిన లక్ష్యాలను పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం చట్టప్రకారం నిర్దేశించిన టి ఎస్ బి పాస్ ప్రకారం అనుమతులను ఎట్టి పరిస్థితుల్లో 21 రోజుల్లో ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. ఈ విషయంలో ఏ అధికారి, ప్రజాప్రతినిధి కానీ అవకతవకలకు పాల్పడితే, చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని కేటీఆర్ హెచ్చరించారు. ఇప్పటికే పట్టణాలకు సంబంధించిన అభివృద్ధి విషయంలో అద్భుతమైన ప్రగతి కార్యక్రమాల నేపథ్యంలో ప్రతి పురపాలిక తన ప్రగతి ప్రస్థానం పైన ఒక నివేదికను సిద్ధం చేయాలని కోరారు.
జూన్ రెండవ తేదీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాటికి ప్రతి పురపాలికల్లో చేపట్టిన అభివృద్ధిని నగర పౌరుల ముందు ఉంచేలా చర్యలు తీసుకోవాలని మంత్రి చెప్పారు. త్వరలో పురపాలికల్లో సిబ్బంది కొరతను అధిగమించేందుకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ ని పూర్తి చేస్తామని, పురపాలికల్లో వార్డ్ ఆఫీసర్ల వ్యవస్థ, ఇందుకు సంబంధించిన సిబ్బంది నియామకం త్వరలో పూర్తి అవుతుందని మంత్రి తెలిపారు.
Also Read : కంసాన్‌పల్లి రైతులకు మంత్రి కేటీఆర్ భరోసా