Saturday, January 18, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంకొవ్వుతో పెరిగే కోపం

కొవ్వుతో పెరిగే కోపం

Beware of Fat: “శేషం కోపేన పూరయేత్” అని సంస్కృతంలో ఒక గొప్ప మాట.  ఒక సమస్యనో, చర్చనో, వివాదాన్నో తుదిదాకా ఓపికగా హ్యాండిల్ చేయడం చేతకానివారు మధ్యలోనే కోప్పడి– ఆ కోపంతోనే ఆ శేషాన్ని పూరించినట్లు అనుకుంటారట. సాధారణంగా పేదవాడి కోపం పెదవికి చేటు. పెద్దవారి కోపం పెదవికి చేటు కాదు అని దీనికి అర్థం మనం గ్రహిస్తే- సామెత కాదనదు. తెలుగులో కోపతాపాలు విడదీయడానికి వీల్లేని ద్వంద్వ సమాసం.

కోపంవల్ల ఉచ్వాస నిశ్వాసాలు వేడెక్కుతాయి. అందువల్ల కోపంతో పుట్టే వేడిగా దాన్ని భాష గుర్తించింది. ఆ వేడిలో మెదడు ఉద్రేకానికి గురవుతుంది. ఆ ఉద్రేకంలో బుద్ధి విచక్షణ కోల్పోతుంది. ఆ నిర్విచక్షణలో ఏదయినా జరగవచ్చు. విపరీతమయిన కోపంలో ఊపిరి ఎక్కువగా వెంట వెంటనే తీసుకోవాల్సి వస్తుంది. ఆ కోపానికి తగినస్థాయిలో గట్టిగా అరవాల్సి ఉంటుంది. దాంతో గొంతు బొంగురు పోతుంది. కోపంలో నరాలన్నీ బిగుసుపోవాలి. దాంతో రక్త ప్రసరణ ఎక్కువ అవసరమవుతుంది. కొందరు కోప్పడి కోప్పడి ఆయుష్షు తమకు తాముగా తగ్గించుకుంటూ ఉంటారు.

కొందరు స్వభావరీత్యా కోపిష్ఠులు. కొందరు పరిస్థితులవల్ల కోపాన్ని ఇష్టంగా పెంచి పోషించుకుంటూ కోపిష్ఠుల లిస్టులో చేరతారు. కొందరు అకారణంగా కోప్పడతారు. కొందరు సకారణంగా కోప్పడతారు. రాముడి గురించి వాల్మీకి చెప్పిన పదహారు గుణాల్లో- “జిత క్రోధో” కోపాన్ని జయించినవాడు- ప్రధానమయినది. మహాత్ముల కోపం రెప్పపాటులో మాయమవుతుందట. మనం మహాత్ములు కాదు కాబట్టి కన్నుమూసేవరకు కోపాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటాం.

స్వభావ రీత్యా కోపం, పరిస్థితుల వల్ల కోపం సంగతేమో కానీ- ఇప్పుడు తిన్నది అరగక కొవ్వు పెరిగి పెరిగి దానివల్ల కోపతాపాలు బాగా పెరిగిపోతున్నాయట. కొవ్వుకు- కోపానికి అంతర్గతంగా సంబంధం ఉన్నట్లుంది. తిన్నది అరగక కొవ్వు పేరుకుని పేరుకుని అది కోపంగా పరిణమిస్తోంది అని అనుకోవచ్చు. ఈ సూత్రం ప్రకారం సన్నగా రివటలా, ఎండు పుల్లలా ఉన్నవారికి అసలు కోపమే ఉండకూడదు!

పాశ్చాత్య జీవన విధానం, బాగా ప్రాసెస్ చేసి దాచిన ప్యాక్డ్ ఆహారం తింటున్నవారు, రోజులో అసలు వ్యాయామం, శారీరక శ్రమ లేనివారు కొవ్వు పేరుకుని కొండలుగా ఎదుగుతున్నారట. చివరకు కోపిష్ఠులుగా మారుతున్నారట.

“తన కోపమే తన శత్రువు
తన శాంతమె తనకు రక్ష దయ చుట్టంబౌ
తన సంతోషమె స్వర్గము
తన ధుఃఖమె నరకమండ్రు తథ్యము సుమతీ !”

అని ఇదివరకు ఒకటి రెండు తరగతుల్లో నీతి శతక పద్యం తప్పనిసరిగా నేర్పించేవారు- పెద్దయ్యాక ఉపయోగపడుతుందని.

ఎంత చెట్టుకు అంత గాలి!
ఎంత కొవ్వుకు అంత కోపం!

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

ప్రభుత్వ ‘పన్నుల’ వైద్యం

RELATED ARTICLES

Most Popular

న్యూస్