Saturday, November 23, 2024

దారి దీపం

Father-God: పెద్దల మాట చద్ది మూట అన్నారు. మరి, నాన్న మాట మాత్రం జీవితపు బాట. ఇచ్చిన మాటకు కట్టుబడి వాత్సల్యాన్ని పక్కన బెట్టిన ఓ నాన్న మాట రామాయణానికీ, గుడ్డి వాత్సల్యంలో మునిగిన మరో నాన్నమాట మహాభారతానికీ దారి తీశాయి. నాన్న రక్షిస్తాడు. అదే అతనికి అర్ధాన్నిస్తుంది అంటాడు జేక్ సల్లీ అవతార్ 2 సినిమాలో. తరతరాలుగా మన సంస్కృతీ  అదే చెప్తుంది. తల్లి భూమి అయితే నాన్న ఆకాశం.

పుట్టక ముందే ఎనలేని సంపత్తీ ఎవరెస్టంత పరపతీ సమాజంలో పేరూ వారసత్వ వేదికా ఇచ్చే నాన్నైనా, చిటికెన వేలూ భుజాలూ తప్ప ఇంకేమీ ఇవ్వలేని నాన్నైనా, కుదిరితే నాలుగు మంచి మాటలూ, వీలుకాక పోతే కొంత అప్పూ వదిలి పొయ్యే నాన్నైనా, తాగి తన్ని తగలేసే నాన్నైనా,  నాన్నంటే  పిల్లలకి మొదటి హీరోనే.  బతికితే చాలు అనుకుంటుందట తల్లి. అది అమ్మ వాత్సల్యం. పేగు ప్రేమ. బాగా బతకాలని అనుకుంటాడట తండ్రి. అది సుమతి శతకకారుడు చెప్పిన పుత్రోత్సాహం. ఎంత బాగా బతికినా ఏమి సాధించాడులే అన్నట్లు వ్యవహరించే ‘భారవి తండ్రు’లూ ఉన్నారు. ఆ అవమాన భారం భరించలేని భారవి బరితెగించి తండ్రిని చంపాలనుకుంటాడు. నాన్న పొగిడితే కొడుకు దారి తప్పుతాడనే తండ్రి గుంభనాన్ని తెలుసుకుని కాళ్ళమీద పడతాడు.  అది నాన్న ‘లోని మమకారం’…రాతిలోని చెమ్మ.

ఏటా ఓరోజు ఫాదర్స్, మదర్స్ డేలు జరుపుకోవడం ప్రప్రంచపు రీతి. మాతృదేవోభవ పితృదేవోభవ అనుకోవడం మన ఋతం.అదే మనకు హితం.

తన గెలుపోటముల, బతుకు పోరాటాల నుండి పుట్టుకొచ్చిన గుళికలు నాన్న మాటలు. అవి అందుకుంటే పట్టి నడిపించే చిటికెన వేళ్లు. తలెగరేస్తే చెంప ఛెళ్ళుమనిపించే  చేతివేళ్ళు. తన కొడుకుని స్కూల్ కి పంపేటప్పుడు టీచర్ కి అబ్రహం లింకన్ రాసిన ఉత్తరం ఏ తండ్రైనా కొడుకుకి వేయగలిగే అత్యుత్తమమైన బాట. చదివి తీరాల్సిందే. అయితే ఈ ఉత్తరం లింకన్ రాసింది కాదనే వాదనా ఉంది. అదే నిజమైతే నకిలీ పేరుతో రాసినా, ఓ పితృదేవుడు ఆచార్య దేవునికి తన కొడుకుని అప్పగిస్తూ రాసిన ఏంతో  ఉత్తమమైన రచన అది. హాలివుడ్ నటి ఎమిలా క్లార్క్  “ఎవరింట్లో బుక్  షెల్ఫ్ కన్నా టీవీ స్క్రీన్  పెద్దదిగా ఉంటుందో వాళ్ళని నమ్మొద్ద” ని తన నాన్నమాటగా ట్వీట్ చేసింది. ఎంత లోతైన మాట ! ఇటువంటి జీవిత సారాలు నాన్న మాటలు. ఇలాంటి మాటలు అందరూ చెప్పాలి అందరూ వినాలి.

నాన్నల గురించి పిల్లలు చెప్పడం, చెప్పుకోవడం తెలిసిందే అయినా, సాహిత్యంలో నాన్న కథలకు, అమ్మ కథలకు చెప్పుకోదగ్గ స్థానం ఉన్నట్లు కనిపించదు. స్మృతి కావ్యాల్లో మాతృస్మృతి లో వెలువడిన రచనలే ఎక్కువ అని సి.నా.రె సిద్ధాంత గ్రంధం చెప్తోంది. అయితే ఇవి పద్య రచనలు, గీత రచనలు. కథల రూపం లో ఎక్కువగా కనపడవు. కథకుని పేరు గుర్తు లేదు కానీ (మరుపుకి  క్షమించాలి) ఓ పాతిక సంవత్సరాల క్రితం పేరున్న కథకుడు మా ఉమా మహేశ్వర్ ఇచ్చిన రాయలసీమ కథకుల సంపుటంలోని “మాయమ్మ రాచ్చసి” అనే కథ గుర్తుండి పోయింది. బతుకులో  అలుపెరగని పోరాటం చేస్తూ కొడుకుకి మంచి బతుకునిచ్చిన రాచ్చసి కథ. మదర్స్ డే, ఫాదర్స్ డే లు జరపడం ఓ ఎత్తైతే, ఇలాంటి మరిన్ని అమ్మ కథలూ  నాన్న కథలూ వెలుగులోకి తీసుకురావడం మరో ఎత్తు. అమ్మా నాన్నల సాహిత్యం విరివిగా రాయాలి. బ్లడ్డూ బ్రీడూ గర్జనల కాలం లో గుండె లోతుల్లోంచి కళ్ళు చెమరించే కథలు రావాలి.

డబ్బున్నా లేకున్నా, సమాజం దృష్టిలో గెలిచినా  ఓడినా, ఏ అమ్మైనా ఏ నాన్నైనా పిల్లలకు ఇచ్చే సలహాల్లో స్వఛ్చత తప్ప నాకింకేం కనిపించదు. వచ్చే ఫాదర్స్ మదర్స్ డే కైనా ఓ అమ్మల,నాన్నల కథల, అమ్మలూ నాన్నలూ ‘చెప్పిన కథ’ల సంపుటాలు  తెలుగులో రావాలని కోరుకుందాం. అవి రాయడానికి ఓ గొప్ప రచయితా కథకుడూ కానవసరం లేదు అమ్మల, నాన్నల  మాట రుచి చూసిన ఏ కూతురైనా కొడుకైనా చాలు.

ఆ రుచి పంచుకుంటా. ఆ రోజు సాయంత్రం ఏడు. అసలే వృద్ధాప్యం…ఆపై అనారోగ్యం. సమయానికి భోజనం వడ్డించలేదని చిరాకుగా ఉన్న నాన్నని పలకరించా.  ఈ లోపు ఓ పద్యం చెప్పమని అడిగా. వందల పద్యాలొచ్చు ఆయనకు. ‘ఇప్పుడు మరుపు … చెప్పలే’నన్నారు.  పట్టు బట్టా. మీరు రాసిన పద్యమైనా చెప్పమన్నా.  కోపగించుకున్నా, కొంచెం సేపు మౌనంగా ఉండి  “ తెలివి యొకింత లేని యెడ…” అన్నారు.  ఆరో తరగతి తెలుగు పుస్తకంలో చదువుకున్న భర్త్రుహరి నీతిశతకం లోని సుభాషితం అది. గుర్తుంది. అందుకున్నా… “ తెలివి యొకింత లేని యెడ తృప్తుడనై కరి భంగి సర్వమున్ దెలిసినంచు గర్వితమతిన్ విహరించితి తొల్లి …” పూర్తికాక ముందే తప్పు పట్టారు ఆయన. అది “తృప్తుడ”నై కాదు “దృప్తుడ”నై అని. దృప్తుడు అంటే పొగరుబోతు అని. గర్విష్టి అని. తృప్తుడు అంటే తృప్తి చెందిన వాడని విడదీసి చెప్పారు. ఒప్పుడు అంతా నాకే తెలుసనే గర్వంతో మదపుటేనుగులాగా పొగరుబోతునై (దృప్తుడనై) తిరిగాననీ, ఇప్పుడు ఉజ్జ్వలమతులైన పండితుల పరిచయం అయ్యాక వారి చెంతన నాకేమీ తెలీదని తెలిసి నా పొగరు అణిగిందని ఆ పద్యం అర్థం. ఇద్దరం కలిసి పద్యం మళ్ళీ పూర్తి చేశాం. కనీసం పద్యమన్నా సరిగ్గా నాకు తెలుసనే దృప్తత నాలో తొలగింది. పొద్దున లేచి నా తొందరలో పలకరించే సమయం లేక ఓ నవ్వు నవ్వి నేను ఆఫీస్ కి వెళ్లాను. తిరిగి వచ్చే సరికి ఆయనా మరో మాట మాట్లాడకుండా వెళ్లిపోయారు. నాతో నాన్న మాట్లాడిన చివరి మాటలు ఆ పద్యమే. నా దృప్తత్వాన్ని జీవితాంతం గుర్తుచేసే పద్యం. ఇప్పటికీ నాన్నమాట స్మరిస్తూనే ఉంటా. దృప్తుడను కాకుండా ప్రయత్నిస్తూనే ఉంటా. ఆ సందేశం నాన్న చివరిమాట గా పొందినందుకు తృప్తి పడుతుంటా.

“It is a wise father who knows his own child.” – William Shakesphere 

–  విప్పగుంట రామ మనోహర

RELATED ARTICLES

Most Popular

న్యూస్