Friday, October 18, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకం'ప్యూర్ గోల్డ్' ఫిరోజ్ మర్చంట్

‘ప్యూర్ గోల్డ్’ ఫిరోజ్ మర్చంట్

ధనమేరా అన్నిటికీ మూలం
ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవధర్మం … అని సెలవిచ్చారో కవిగారు. గొప్ప ధనికులైనంత మాత్రాన ధనం విలువ తెలిసి ఉండాలనేం లేదు. కొందరికి ఎంత ఉన్నా ఆశ తీరదు. ఉన్నదాంతో ఎన్ని ఆస్తులు కొన్నా తనివితీరదు. ప్రపంచాన్నే మింగేయాలన్నంత ఆబగా ఉంటారు. దానధర్మాలు, ఇతరులకు సాయపడటం వీరికి ఎంతమాత్రం కిట్టదు. అసలు అలాంటివి పట్టించుకోరు కూడా. అటువంటివారికి పూర్తి భిన్నం సౌదీ లో స్థిరపడ్డ వ్యాపారవేత్త ఫిరోజ్ మర్చంట్. ఇతని దానాలు చాలా ప్రత్యేకం. అనేకమంది ఖైదీలకు ప్రాణ భిక్ష పెడుతున్నాడు.

అన్నిదానాల్లోకి అన్నదానం గొప్పదంటారు గానీ ఫిరోజ్ మర్చంట్ మాత్రం ప్రాణం ఉంటేనే కదా అన్నం దక్కేది అన్నట్టు ఎందరో అభాగ్యులైన ఖైదీల విడుదల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. ఇంతకీ ఎవరీ ఫిరోజ్ మర్చంట్?

తొమ్మిదిమంది సంతానం ఉన్న కుటుంబంలో పుట్టాడు. తండ్రి రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా పనిచేసేవాడు. ముంబైలో చిన్న గదిలో నివాసం. కష్టాల జీవితం. రెండో తరగతిలో ఫీజు కట్టలేక చదువుమానేసాడు. 13 ఏళ్ళ నుంచి తండ్రికి సహాయంగా ఉంటూ వ్యాపార మెళకువలు నేర్చుకున్నాడు. నెమ్మదిగా కుటుంబం కుదుటపడింది. వివాహమయ్యాక భార్యతో దుబాయ్ వెళ్లిన ఫిరోజ్ కి అక్కడి ‘గోల్డ్ సూక్’ తెగ నచ్చేసింది. చేస్తే అక్కడే వ్యాపారం చెయ్యాలనిపించింది. ముందు ఒప్పుకోకపోయినా తండ్రి ఫిరోజ్ పట్టుదల చూసి అంగీకరించాడు. ఎటువంటి పెట్టుబడి లేకుండా బంగారు వ్యాపారస్తుల వద్ద బ్రోకర్ గా చేరి నెమ్మదిగా డబ్బు కూడబెట్టి చిన్న దుకాణం అద్దెకు తీసుకున్నాడు. ‘ప్యూర్ గోల్డ్’ పేరుతో ఆభరణాల తయారీ, అమ్మకం ప్రారంభించాడు. ఈ రోజున అరబ్ దేశాల్లో 150 పైగా శాఖలున్నాయి. సుమారు నాలుగు లక్షల మంది వినియోగదారులు ఉన్నారు. సౌదీలో ఇప్పుడు ఫిరోజ్ ప్రముఖ వ్యక్తి. ప్రభుత్వంలో, అధికారులతో చక్కటి సంబంధాలున్నాయి. తమ దేశ ఆర్థిక వ్యవస్థకు వన్నె తెచ్చిన వ్యక్తిగా స్థిరనివాసం కోసం గోల్డెన్ కార్డు ఇచ్చి గౌరవించారు.

సంపాదన కేవలం స్వంతానికి కాదని ఫిరోజ్ నమ్మకం. అందుకే 2008 లో ‘ ది ఫర్ గాటెన్ సొసైటీ ‘ స్థాపించి అనేక కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యంగా ఏళ్లతరబడి జైళ్లలో మగ్గిపోతున్న భారతీయులను ఆదుకోవడం లక్ష్యం. ఉపాధి కోసం వెళ్లి చిన్న తప్పుల వల్ల జైలు పాలయి జరిమానాలు కట్టలేని నిస్సహాయులకు కొండంత అండ ఫిరోజ్ . వారి జరిమానాలు కట్టడమేకాదు, స్వదేశం వెళ్ళడానికి టిక్కెట్లు కొని వారిని కుటుంబాలతో కలుపుతున్నారు . ఆలా ఇప్పటివరకు సుమారు 20 వేలమందిని రక్షించారు. ఈ సంవత్సరం మూడు వేల మందిని విడుదల చేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు . ఇప్పటికే 2.5 కోట్లు చెల్లించి 900 మందిని విడుదల చేయించారు. రంజాన్ లోగా మిగిలిన వారినీ రక్షించాలని లక్ష్యం. ఫిరోజ్ చేసే మంచి పనులకూ అక్కడి ప్రభుత్వం సహకరిస్తోంది. బంగారం వ్యాపారం చాలామంది చేస్తారు. బంగారమంటి మనసు మాత్రం ఫిరోజ్ కే సొంతం. అందుకే సౌదీలో భారతీయ ఖైదీలు మా ఫిరోజ్ బంగారుకొండ అని పాటలు పాడుకుంటారు.

-కె. శోభ

RELATED ARTICLES

Most Popular

న్యూస్